తెలంగాణ: డ్రై రన్‌ సక్సెస్‌

3 Jan, 2021 01:31 IST|Sakshi
గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సమక్షంలో శనివారం హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీలో ఆయా రేణుకకు తొలి డమ్మీ టీకా ఇస్తున్న వైద్యులు

175 మంది ఆరోగ్య కార్యకర్తలతో డమ్మీ వ్యాక్సినేషన్‌ 

రాష్ట్రంలో ఏడు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు 

హైదరాబాద్‌ తిలక్‌నగర్‌ కేంద్రాన్ని సందర్శించిన గవర్నర్‌ 

ముందుగా 5 లక్షల డోసులు: ఈటల  

సాక్షి, హైదరాబాద్‌/పాలమూరు: కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, వాటిని సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం చేపట్టిన డ్రైరన్‌ సక్సెస్‌ అయింది. హైదరాబాద్‌లోని గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్‌నగర్‌ ఆరోగ్యకేంద్రం, సోమాజిగూడ యశోద ఆస్పత్రి.. మహబూబ్‌నగర్‌లోని జనరల్‌ ఆస్పత్రి, నేహాషైనీ ఆస్పత్రి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో సెంటర్‌లో 25 మంది చొప్పున మొత్తం 175 మంది హెల్త్‌ వర్కర్లకు డమ్మీ వ్యాక్సిన్‌ వేశారు. ఈ డ్రై రన్‌లో డమ్మీ వ్యాక్సిన్, ఇంజక్షన్లు ఉపయోగించారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తిలక్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, డ్రై రన్‌ తీరును పరిశీలించారు. తొలి వ్యాక్సిన్‌ను తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీ ఆయా రేణుకకు ఇచ్చారు.

గాంధీ టీచింగ్‌ ఆస్పత్రిని డీఎంఈ రమేశ్‌రెడ్డి, నాంపల్లి ఏరియా ఆస్పత్రిని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సందర్శించారు. నేహాషైనీ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిని కలెక్టర్‌ వెంకట్రావ్‌ పరిశీలించారు. జానంపేట పీహెచ్‌సీని అడిషనల్‌ కలెక్టర్‌తేజాస్‌ నందులాల్‌ పవార్‌ పరిశీలించారు. స్టోరేజ్‌ సెంటర్‌ నుంచి ప్రత్యేక కోల్డ్‌బాక్స్‌లో వ్యాక్సిన్‌ తరలింపు ప్రక్రియ నుంచి.. వ్యాక్సిన్‌ తీసుకునే లబ్ధిదారుల గుర్తింపు కార్డుల తనిఖీ, కోవిన్‌ యాప్‌లో పేర్ల నమోదు, ఫోన్‌ నంబర్లకు వచ్చిన ఓటీపీ.. వ్యాక్సినేషన్‌లో సిబ్బంది పనితీరు.. ఆరోగ్యపరంగా తలెత్తే రియాక్షన్లను గుర్తించేందుకు 30 నిమిషాలపాటు గదిలోనే ఉంచడం.. లాంటి వాటిని క్షుణ్నంగా పరిశీలించడమే కాకుండా ఆయా అంశాలను ఎప్పటికప్పుడు కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేశారు.  


మహబూబ్‌నగర్‌లో చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌ తదితరులు  

వ్యాక్సిన్‌ సురక్షితం: గవర్నర్‌ తమిళిసై  
కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, ఆందోళనలు అవసరం లేదని.. వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. వ్యాక్సిన్‌ పనితీరుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇలాంటి సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన డ్రైరన్‌కు గవర్నర్‌ దంపతులు హాజరయ్యారు. డమ్మీ వ్యాక్సినేషన్‌ కోసం చేసిన ఏర్పాట్లు, ఎంపిక చేసిన లబ్ధిదారులు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సిన్‌ వేసే తీరును పరిశీలించారు. వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారితో గవర్నర్‌ దంపతులు స్వయంగా మాట్లాడి, న్యూ ఇయర్‌ గ్రీటింగ్‌ కార్డులు అందజేశారు.

అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. నాలుగు దశల్లో రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ డ్రైరన్‌ ఉపయోగపడుతుందన్నారు. కరోనా సమయంలో సేవలు అందించిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్లకు సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీ కోసం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. 2020 పాండమిక్‌ సంవత్సరమని, 2021 వ్యాక్సిన్‌ ప్రొటెక్షన్‌ సంవత్సరంగా అభివర్ణించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, తదితరులు పాల్గొన్నారు. 

ముందుగా 5 లక్షల డోసులు: మంత్రి ఈటల  
కోవిడ్‌–19ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం డ్రైరన్‌ కొనసాగుతోంది. 10 వేల మంది వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్, వివిధ హోదాల్లో ఉండే స్టాఫ్‌ శిక్షణ తీసుకున్నారు. రోజుకు 10 వేల మంది పాల్గొని 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ చేయగలిగే కెపాసిటీ రాష్ట్రంలో ఉంది. డ్రైరన్‌ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం 5 లక్షల డోసులు ఇస్తామని సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ 10 లక్షలు... అనంతరం కోటి డోసులు ఇస్తామని పేర్కొంది. ఆ మేరకు వ్యాక్సిన్‌ వేస్తాం’అని వివరించారు. 

కేంద్రానికి రిపోర్ట్‌ పంపుతాం
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు జరుగుతున్నా యి. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూరుస్తున్నాం. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. కేంద్రం వ్యాక్సిన్‌ సరఫరా చేసిన ఒకట్రెండు రోజుల్లోనే గుర్తించిన వారందరికీ వ్యాక్సినేషన్‌ చేస్తాం. డ్రైరన్‌కు రిపోర్టును కేంద్రానికి అందజేస్తాం.  –డాక్టర్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ 

99 శాతం వ్యాక్సిన్‌ సేఫ్‌
కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు. 99.90 శాతం సేఫ్‌. ప్రతి లక్ష మందిలో ఎవరో ఒకరికి శరీర తీరును బట్టి నొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకానీ పెద్ద ప్రమాదం లేదు. ఈ డ్రైరన్‌ వైద్య సిబ్బందికి మంచి అనుభవాన్ని ఇచ్చింది.  –డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీఎంఈ 

మరిన్ని వార్తలు