వారంలో కరోనా టీకా ఎగుమతులు

23 Feb, 2021 01:46 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌

కోవాక్స్‌ కార్యక్రమం ద్వారా టీకా వివక్షకు చెక్‌

కరోనా రూపాంతరాలపై ఆందోళన అవసరం లేదన్న శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాక్సిన్‌లు భారత్‌ నుంచి వారం రోజుల్లో ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్స్‌–సీవోవీ–2 వైరస్‌ పరిశోధనలను వేగవంతం చేయడం నుంచి అందరికీ టీకా అందేలా చేసేందుకు ‘కోవాక్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అన్ని దేశాలకు టీకా సరఫరా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బయో ఆసియా–2021 సదస్సులో భాగంగా సోమవారం ‘ప్రపంచానికి టీకా వేయించడం.. భారత్‌ ప్రస్తుత స్థితి, భవిష్యత్‌ సమర్థత’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. కోవాక్స్‌ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల అవసరం ఉందని ఈ ఏడాది సుమారు 300 కోట్ల డాలర్ల నిధులు అవసరమని సౌమ్యా స్వామినాథన్‌ తెలిపారు.

పెద్ద ఎత్తున టీకా తయారీకి ప్రత్యేక కేంద్రాలు అవసరమవుతాయని, కోవాక్స్‌లో భాగమైన 199 దేశాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే తారతమ్యాలు, వివక్ష వంటివి లేకుండా అందరినీ టీకా ద్వారా కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించొచ్చని వివరించారు. కోవాక్స్‌ ప్రయత్నాల ఫలితంగా ఇంకో వారంలోనే భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పెద్ద ఎత్తున టీకాలు 25–30 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. రకరకాల టీకాల తయారీ, నిల్వ, నిర్వహణ అంశాల్లో భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయని చెప్పారు. రూపాంతరిత వైరస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని సకాలంలో గుర్తించి జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా నియంత్రించొచ్చని వివరించారు.

ఎవరూ సురక్షితం కాదు..
తగిన టీకా వేయించుకోనంత వరకు ప్రపంచంలో ఎవరూ సురక్షితంగా ఉన్నామనుకోవద్దని యూనిసెఫ్‌ ప్రధాన సలహాదారు రాబిన్‌ నంది స్పష్టం చేశారు. గతంలో కొత్త టీకాలు పేద దేశాలకు చేరేందుకు చాలా ఏళ్లు పట్టేదని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కోవాక్స్‌ ఉపయోపడుతుందని చెప్పారు. 2021 నాటికి కనీసం 200 కోట్ల కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పంపిణీ చేయాలన్నది యునిసెఫ్‌ లక్ష్యమని వివరించారు. కోవాగ్జిన్‌ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను సకాలంలో అందివ్వలేకపోయామని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ముక్కు ద్వారా పిచికారీ చేసే టీకా తొలి దశ ప్రయోగాలు ఈ వారం మొదలు అవుతాయని చెప్పారు. కోవాక్స్‌లో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏటా 4 కోట్ల టీకాలు తయారు చేసే సామర్థ్యం తమ వద్ద ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు