లక్ష మంది పోలీసులకు కరోనా వ్యాక్సిన్‌

22 Jan, 2021 10:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోవిన్‌ యాప్‌లో పేర్ల నమోదు పూర్తి

45 వేల మంది మున్సిపల్‌ సిబ్బందికి కూడా..

మార్చి నుంచి విడతల వారీగా 10 వేల కేంద్రాల్లో టీకా

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం రెండు లక్షల మందికిపైగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఉంటారని అంచనా వేశారు. అందులో ఇప్పటివరకు 1.60 లక్షల మంది సిబ్బంది జాబితా పూర్తయింది. పూర్తయిన దాంట్లో లక్ష మంది పోలీసులు, హోంగార్డుల జాబితా ఖరారైందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారందరి వివరాలను కోవిన్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కాబోయే ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పోలీసులకు టీకా వేస్తామని ప్రకటించింది. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పోలీసులు, ఇతర పోలీసు అధికారులందరికీ కలిపి లక్ష మందికి టీకా వేస్తామని వెల్లడించారు. ఇదిలావుండగా 45 వేల మంది పురపాలక సిబ్బంది జాబితా కూడా కోవిన్‌ యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. వీరే కాకుండా పంచాయతీ రాజ్‌ శాఖలోని పారిశుద్ధ్య కార్మికులు సహా ఇతర ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది జాబితా కొంత మేరకు పూర్తయిందని వెల్లడించారు. వీరందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. 

రెవెన్యూ శాఖలో ప్రారంభం కాని నమోదు..
ఇదిలావుంటే రెవెన్యూ శాఖలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని గురువారం ఆ శాఖను ఆదేశిస్తూ మెమో జారీచేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఆ రోజు తుది గడువుగా నిర్ణయించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

25న మాప్‌అప్‌ రౌండ్‌..
ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకా కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిన్‌ జాబితా ప్రకారం శుక్రవారం నాటికి వీరికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఇంకా కొందరు రాక పోవడంతో ఈ నెల 25వ తేదీన మిగిలిన వారందరికీ కలిపి మాప్‌అప్‌ రౌండ్‌ పద్ధతిలో టీకా వేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్య సిబ్బంది టీకా కార్యక్రమం ముగిసినట్లేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి టీకాలు వేసుకున్న వారికి 28 రోజులకు రెండో డోసు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఈ నెల తొలి టీకా వేసుకున్న వారికి వచ్చే నెల 12వ తేదీన రెండో డోసు వేస్తారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు, వైద్య సిబ్బందికి రెండో డోసు టీకా ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుందని తెలిపారు. 50 ఏళ్లు పైబడినవారు, 18 నుంచి 50 ఏళ్లలోపున్న దీర్ఘకాలిక రోగులు 73 లక్షల మంది ఉంటారని, వీరికోసం విడతల వారీగా 10 వేలకు టీకా కేంద్రాలను పెంచుతామని, జూన్, జూలై నాటికి టీకా కార్యక్రమం పూర్తి చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.  

Poll
Loading...
మరిన్ని వార్తలు