Corona Vaccine: పోస్టాఫీసులో టీకా నమోదు 

31 May, 2021 02:59 IST|Sakshi

గ్రామీణులు, నిరక్షరాస్యులకు ఉపయోగం

సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు. తపాలా శాఖ తాజాగా ఈ సేవలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవడంలో కొందరికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను ప్రారంభించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలియనివారు, నిరక్షరాస్యులు సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

తమ ఆధార్‌ కార్డు, ఫోన్‌ తీసుకుని పోస్టాఫీసుకు వెళ్లి వివరాలు చెబితే అక్కడి సిబ్బంది కోవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా జరిగేది అయినందున, తమ వెంట కచ్చితంగా మొబైల్‌ ఫోన్‌ తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే 36 హెడ్‌ పోస్టాఫీసులు, 643 సబ్‌ పోస్టాఫీసులు, 10 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ సేవ ప్రారంభించామని, త్వరలో 800 ఇతర బ్రాంచి పోస్టాఫీసుల్లో కూడా ప్రారంభిస్తామని తపాలా శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇది ఉచితంగా అందించే సేవ అని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు