Second Dose Vaccination: ఇబ్బందులకు చెక్‌

18 May, 2021 06:51 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా నిరోధక వ్యాక్సిన్‌ రెండో డోసుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇకపై మొదటి డోసు వేసుకున్న వైద్య కేంద్రంలోనే రెండో డోసు వేయాలని నిర్ణయించారు. ఆధార్‌ను, మొదటి డోసు సర్టిఫికెట్‌ను పరిశీలించి సంబంధిత లబ్ధిదారునికి ఈ మేరకు సూచనలు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కట్టడి, నిరోధకచర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్‌ పాల్గొన్న ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమిడెసివర్‌ లభ్యత, తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, డ్రగ్‌ కంట్రోల్‌ జాయింట్‌ డైరెక్టర్, జిల్లా వైద్యాధికారి సభ్యులుగా కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి సత్వర చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
 
ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు కరోనా సంబంధిత అంశాలపై రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం తగినన్ని హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని ఈ  సమావేశంలో అధికారులకు సూచించారు.  

  • ఆస్పత్రుల కంటే హోమ్‌ ఐసోలేషన్లు పెంచాలని, ఆస్పత్రుల వద్ద అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలని సమావేశం సూచించింది.  
  • వివిధ ప్రభుత్వశాఖలు సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేస్తున్నందున కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రులు పేర్కొన్నారు.  
  • ఇంటింటి సర్వేలు, జ్వర పరీక్షల వల్ల వ్యాధి నియంత్రణలో ఉందన్నారు. అత్యవసరమైతే ఆక్సిజన్‌ అందించే కేంద్రాలుగానూ బస్తీదవాఖానాల్లో సదుపాయాలుండాలన్నారు.   
  • పారిశుధ్య కార్యక్రమాలు, హైపోక్లోరైట్‌ స్ప్రే వల్ల ప్రయోజనం కనబడుతోందంటూ స్ప్రే కార్యక్రమాలకు ఫైర్‌సర్వీసెస్‌ సహకారాన్ని కూడా పొందాలన్నారు.  
  • త్వరలోనే రుతుపవనాలు ప్రవేశించనున్నందున నాలాల్లో పూడికతీత పనుల్ని త్వరితంగా పూర్తిచేయాలన్నారు. 

పారిశుధ్యంపై మళ్లీ తనిఖీలు: మేయర్‌ 
ఈ సమావేశంలో మేయర్‌  విజయలక్ష్మి మాట్లాడుతూ, పారిశుధ్య కార్యక్రమాలపై రెండోవిడత తనిఖీలు మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరాలకు వినియోగించేలా ముందస్తుగానే సర్కిళ్ల వారీగా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా బాధితులకు ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, హైదరాబాద్‌ అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ అమలుకు పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రజలుకూడా అవగాహనతో వ్యవహరిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది.  

చదవండి: కరోనా నిబంధనలు గాలికి..జరిమానాలు 30 కోట్లపైనే..!

మరిన్ని వార్తలు