28 రోజులు కీలకం

18 Jan, 2021 01:52 IST|Sakshi

ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు

తొలి టీకా తర్వాత నాలుగు రోజులు జాగ్రత్త

మద్యం వద్దు... పొగతాగొద్దు... పోషకాహారం మేలు

టీకా వేసుకున్నవారికి వైద్య,ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

12 రోజుల్లో యాంటీబాడీల వృద్ధి ప్రారంభం

రెండో డోసు తర్వాత రెండు వారాల్లో పూర్తి రక్షణ

తొలి డోసుతో అలర్జీ వస్తే రెండో డోసు ఇవ్వరు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకా వేసుకున్నాక ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. తొలి టీకా వేసుకున్నాక 28 రోజులపాటు మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని తెలిపింది. టీకా వేసుకున్న నాలుగు రోజుల పాటు మద్యం ముట్టొద్దని, పొగతాగరాదని, పోషకాహారం తీసుకోవాలని స్పష్టం చేసింది. శనివారం కరోనా టీకా వేయడం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకా వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని విరివిగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.

కరపత్రాలు, సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ ప్రవేశించగానే శరీరంలో అనేక కీలకమైన మార్పులు, చర్యలు ప్రారంభం అవుతాయి. యాంటీబాడీలు తయారయ్యే క్రమం మొదలవుతుంది. ఆ సమయంలో సరైన ఆహార నియమాలు పాటించాలని స్పష్టం చేసింది. కలుషిత ఆహారం తిన్నా, నీరు తాగినా, మద్యం ముట్టినా యాంటీబాడీల వృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిపింది. అంతేకాదు యాంటీబాడీలు తయారయ్యే క్రమంలో మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒకవేళ ఆ సమయంలో కరోనా వైరస్‌ ప్రవేశిస్తే, వ్యాక్సిన్‌ వల్ల ఉపయోగం ఉండదని తేల్చింది. 

రెండో డోసు వేసుకున్న రెండు వారాలకు పూర్తి రక్షణ...
తొలి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్న దాదాపు 12 రోజులకు 30 నుంచి 40 శాతం మేరకు యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. 28 రోజుల నాటికి 60 నుంచి 70 శాతం వరకు ఏర్పడుతాయి. రెండో డోసు వేసుకున్న రెండు వారాలకు శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయి. అంటే మొదటి డోసు వేసుకున్నాక కొద్దిగా రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే అది కరోనా వైరస్‌ నుంచి పూర్తి రక్షణ ఇవ్వదు. అటువంటి సమయంలో కరోనా వైరస్‌ ప్రవేశిస్తే ఇన్‌ఫెక్ట్‌ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే 28 రోజులకు రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. రెండు డోసులు తీసుకున్న వారికే పూర్తి రక్షణ ఉంటుంది.

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ను 28 రోజులకు రెండుమూడు రోజులు అటుఇటు ఎప్పుడైనా వేసుకోవచ్చు. రెండు డోసుల తర్వాత కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా సీరియస్‌ కాదు. అయితే టీకా వేసుకున్న వారిలో కరోనా వైరస్‌ ఉంటే మాత్రం ఇతరులకు వ్యాపింపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేసుకున్నవారుకానీ, ఇతరులుకానీ కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. 70 శాతానికిపైగా ప్రజలకు టీకాలు వేశాకే పూర్తిస్థాయి సామాజిక రోగనిరోధకశక్తి వస్తుంది. అప్పటివరకు కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తాజా వ్యాక్సిన్లలో భద్రతకు గ్యారంటీ ఉంది.. కానీ, అది వైరస్‌ నుంచి ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో చూడాల్సి ఉందని వైద్యాధికారులు తెలిపారు. 

మార్గదర్శకాల్లో కొన్ని

  • తొలి డోసు వేసుకున్నాక, అలాగే 28 రోజులకు రెండో డోసు వేసుకున్న రెండు వారాలకు అంటే మొత్తం 42 రోజులకు శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయి. వ్యాక్సిన్‌ వేసుకున్నాక యాంటీబాడీలు వృద్ధి అయ్యే క్రమంలో బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. వీలైనంత మేరకు డ్రైప్రూట్స్, పళ్లు, తాజా కూరగాయలు, గుడ్లు తీసుకుంటే మంచిది. 
  • వ్యాక్సిన్‌ వేసుకున్నాక మూడునాలుగు రోజులపాటు కూడా అలసట, జ్వరం, తలనొప్పి, ఇతరత్రా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కొనసాగితే తప్పనిసరిగా 104 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
  • టీకా వేసుకున్నామన్న సంతోషంలో పార్టీలు చేసుకోవడం, బయటి ఆహారం తీసుకోవడం, మద్యం ముట్టడం మంచిదికాదు. 
  • రెండో డోసును నాలుగు వారాలకే (28 రోజులు) కాదు.. ఆరు వారాలకు కూడా వేసుకోవచ్చు. అయితే ఎక్కువ రోజుల సమయం తీసుకోవడం వల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో వృద్ధి కావడానికి ఆలస్యం అవుతుంది. సమయం వృథా అయిపోతే, ఆ మధ్య కాలంలో కరోనా వైరస్‌ సోకితే ప్రయోజనం ఉండదు. అందుకే 28 రోజుల కాలాన్ని నిర్ధారించారు. 
  • మొదటి డోస్‌ వేసుకున్నాక అలర్జీల వంటివి వస్తే.. రెండో డోస్‌ వేయరు.  

అపోహలొద్దు.. హ్యాపీగా ఉన్నా
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నా. ఇప్పటి వరకు 24 గంటలు గడిచాయి. హ్యాపీగా ఉన్నా. జ్వరం, దగ్గు, దద్దుర్లు, తలనొప్పి, వాంతులులాంటి సమస్యలు తలెత్తలేదు. టీకా వేయించుకున్నప్పటి నుంచి ఎలాంటి నియమాలు పాటించలేదు. టీకా వేయించుకున్న రోజు కూడా డ్యూటీ చేశాను. నా అలవాటు ప్రకారం రాత్రి షటిల్‌ ఆడాను. నిద్ర బాగానే పట్టింది. ఉదయాన్నే వ్యాయామం, సైక్లింగ్‌ చేశాను. ఆహార నియమావళిలోనూ ఎలాంటి మార్పులేదు. టీకా విషయంలో అపోహలు వద్దు. 
-కరుణాకర్‌ రేడియోగ్రాఫర్, సూర్యాపేట

24 గంటల తర్వాత...మొదట భయం వేసినా..
గజ్వేల్‌ పట్టణంలోని జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రిలోశానిటేషన్‌ వర్కర్‌గా రెండేళ్లుగాపనిచేస్తున్నాను. వైద్యులు ఇచ్చిన మనోధైర్యంతో తొలిటీకా వేసుకున్నాను. టీకా తీసుకునేటపుడు భయం అనిపించింది. తరువాత గడిచిన24 గంటల్లో ఏ ఇబ్బందీ కలగలేదు. రోజూ మాదిరిగానే పనులు చేసుకుంటున్నాను.ఆరోగ్యంగానే ఉన్నాను. 
-డి. కీర్తన, శానిటైజేషన్‌ వర్కర్, గజ్వేల్‌

మరిన్ని వార్తలు