Corona Vaccine: టీకా కటకట

18 Jul, 2021 03:44 IST|Sakshi
మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ కోసం భౌతిక దూరం లేకుండా కిక్కిరిసిన ప్రజలు

టీకా కేంద్రాలకు జనం తాకిడి

సెకండ్‌ డోసు కోసం క్యూ కడుతున్న లబ్ధిదారులు

రోజుకు 1.5 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేస్తున్న వైద్యశాఖ

వనస్థలిపురానికి చెందిన డి.నర్సింగ్‌రావు మే 27న కోవాగ్జిన్‌ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. 4 నుంచి 6 వారాల గడువులో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. దీంతో కొన్ని రోజులుగా టీకా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడా దొరకలేదు. ఈ నెల 15న ఆఫీసుకు సెలవు పెట్టి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని టీకా కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిల్చున్నాడు. సిబ్బంది పరిమిత సంఖ్యలోనే టోకెన్లు ఇవ్వడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. టీకా కేంద్రాల కోసం గాలిస్తూ నాగోల్‌ సమీపంలోని మరో కేంద్రానికి వెళ్లగా.. అక్కడా పెద్ద క్యూ కన్పించింది. చివరకు కొత్తపేట్‌లోని ఓ కేంద్రం వద్ద సాయంత్రం వరకు వేచి చూసి, ఆరు వారాల గరిష్ట గడువు ముగిసిన వారం రోజుల తర్వాత రెండో డోసు టీకా పొందాడు.

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అర్హులు మొదటిడోసు కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెల్లువెత్తుతు న్నారు. మరోవైపు మొదటి డోసు అనంతరం గడువులోగా రెండో డోసు వేయించుకునేందుకు వస్తున్న వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటున్నారు. మొ త్తం మీద రాష్ట్రంలోని పలు వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు గత నాలుగైదు రోజులుగా జనాల తాకిడి తీవ్రంగా పెరగ్గా.. వచ్చిన వారందరికీ టీకాలు వేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధానంగా వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు ఏది వేసుకోవాలన్నా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కోవాగ్జిన్‌ టీకాలకు తీవ్ర కొరత ఏర్పడింది.

1,035 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ 
ప్రస్తుతం రాష్ట్రంలో 1,035 కేంద్రాల్లో కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 958 కేంద్రాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోంది. మరో 77 కేంద్రాలను ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఫీజులు తీసుకుని వ్యాక్సిన్‌ అందిస్తున్నాయి. రాష్ట్రంలో మే నెలలో టీకాల పంపిణీ ఊపందుకోగా.. కోవాగ్జిన్‌ టీకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు రెండోడోసు కోసం దిక్కులు చూస్తున్నారు. కేంద్రం నుంచి పరిమితంగానే వ్యాక్సిన్లు అందుతుండడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్లకు పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయి. 

రెండో డోసుకు డిమాండ్‌
ప్రస్తుతం రెండో డోసు టీకాకు డిమాండ్‌ పెరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 1.5 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేస్తుండగా.. మొదటి, రెండో డోసుల నిష్పత్తి 40:60 శాతంగా ఉంటోంది. ప్రస్తుతం కోవీషీల్డ్‌ టీకాల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు.  

ఇప్పటివరకు 1,31,47,311 టీకాలు 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,47,311 టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు 1,08,32,712 తీసుకోగా, రెండోడోసు కింద 23,14,599 పంపిణీ చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల్లో 1,06,08,692 డోసులను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉచితంగా పంపిణీ చేయగా, 25,38,619 డోసులు ప్రైవేటు కేంద్రాల్లో  పంపిణీ చేశారు.

స్లాట్‌ బుకింగ్‌ లేక.. 
వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్రం మొదట్లో కోవిన్‌ యాప్, వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. టీకాలు పొందాలనుకున్న వారు యాప్‌లో ఆధార్‌ నంబర్, ఇతర వివరాలను ఎంట్రీ చేసి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. దీంతో పరిమిత సంఖ్యలో టీకాల పంపిణీకి వీలుండేది. కానీ ప్రస్తుతం యాప్, వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌లు కేవలం ప్రైవేటు కేంద్రాలకే పరిమితమయ్యాయి. టీకా కోసం నేరుగా కేంద్రాల వద్దకే వెళ్లొచ్చునని కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద లబ్ధిదారులు నేరుగా వివరాలను సమర్పించి టీకా డోసులు పొందుతున్నారు. ఈ కారణంగా చాలాచోట్ల వ్యాక్సినేషన్‌ కేంద్రాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. స్పష్టమైన గడువు, డోసు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు పూర్తయ్యాయి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా క్యూలైన్‌లో వచ్చిన వారికి టీకాలు ఇసున్నారనే విమర్శలున్నాయి. దీంతో కొందరికి గడువు దాటినా టీకాలు అం దకపోగా.. మరికొందరు ముందుగానే టీకాలు పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద అంతా గందరగోళంగా ఉంటోంది.

మరిన్ని వార్తలు