విమానయానంపై ఒమిక్రాన్‌  ప్రభావం.. జాగ్రత్తగా జర్నీ  

29 Nov, 2021 07:49 IST|Sakshi

ఆంక్షల సడలింపుతో కాస్త ఊరట

ప్రయాణాలపై ఎన్నారైలలో అంతర్మథనం

సాక్షి, హైదరాబాద్‌: న్యూజిలాండ్‌ నుంచి ఓ కుటుంబం డిసెంబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రెండేళ్ల పాటు కోవిడ్‌ కారణంగా ఎక్కడికీ వెళ్లకుండా ఉండిపోయారు. కొద్ది రోజులుగా వివిధ దేశాల మధ్య ఆంక్షలను సడలించడంతో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఆ కుటుంబం కూడా నగరానికి  వచ్చేందుకు సిద్ధమైంది.

డిసెంబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు వెళ్లి, చివరి వారంలో తిరిగి న్యూజిలాండ్‌కు చేరుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా ఒమిక్రాన్‌  ప్రమాద ఘంటికలు మోగించడంతో సందిగ్ధంలో పడ్డారు. ఇండియాకు వెళ్లి తిరిగి న్యూజిలాండ్‌కు చేరుకోగలమా లేదా అనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఉన్నపళంగా ఒమిక్రాన్‌ విజృంభింవచ్చనే  భయాందోళన పట్టుకుంది. దీంతో వారు  ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 
చదవండి: మళ్లీ ఆంక్షల చట్రంలోకి..మరిన్ని దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాప్తి

పారిస్‌లోని ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డీడీ కాలనీకి  చెందిన అనుపమ కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకొనేందుకు కొద్ది రోజుల పాటు సెలవుపై వచ్చిన ఆమెకు ఇప్పుడు తిరుగు ప్రయాణంపై ఆందోళన నెలకొంది. తిరిగి పారిస్‌కు వెళ్లే సమయానికి విమానాల రాకపోకలు ఆగిపోవచ్చనే భయంతో పాటు  ఏదో ఒక విధంగా వెళ్లినా మరోసారి ఇండియాకు రావడం కుదరకపోవచ్చనే సందేహం నెలకొంది.   

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌.... 
ఈ నెల మొదటి వారంలో అమెరికా కోవిడ్‌ ఆంక్షలను సడలించి ప్రపంచ దేశాలకు స్వాగతం పలికిన అనంతరం పెద్దఎత్తున ఊరట లభించింది. యూరప్‌ దేశాలు సైతం ఆంక్షలను సడలించాయి. వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి .సొంత కుటుంబాలకు, సొంత ఊళ్లకు దూరంగా  ఉంటున్న ఎన్నారైలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో చాలా వరకు ఆంక్షలను తొలగించి పర్యాటకులను సైతం ఆహ్వానించేందుకు పలు దేశాలు  చర్యలు చేపట్టాయి. 

రెండేళ్లుగా కుదేలైన పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ప్రయాణాలపైన కేంద్రం సైతం ఆంక్షలను  సడలించేందుకు సన్నద్ధం కావడంతో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఐఆర్‌సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ, పలు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలు  రకరకాల ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్‌  పిడుగులా వచ్చి పడడంతో అంతటా సందిగ్ధం నెలకొంది.

డిసెంబర్‌ ప్రయాణాలు కష్టమే... 
హైదరాబాద్‌ నుంచి ప్రస్తుతం బ్రిటన్‌తో పాటు దుబాయ్, ఖతార్, కువైట్‌ తదితర  దేశాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పర్యాటక దేశమైన మాల్దీవులుకు ప్రతి రోజు  ఒక ఫ్లైట్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా డిసెంబర్‌ నెలలో పర్యాటక ప్రయాణాలు బాగా పెరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల కోసం నగరవాసులు తమకు నచ్చిన పర్యాటక ప్రాంతానికి వెళ్తారు. రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రయాణాలు వచ్చే డిసెంబర్‌ నెలలో ఊపందుకోవచ్చని భావించారు. కానీ డిసెంబర్‌ నాటికి ప్రయాణాలు బాగా తగ్గవచ్చని పలు పర్యాటక సంస్థలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు