కరోనా భయం: ముస్లిం యువకుల మానవత్వం

12 Apr, 2021 08:12 IST|Sakshi

మానవత్వం చాటిన ముస్లిం యువకులు

పాడె మోసి.. అంతిమ సంస్కారం నిర్వహించి..

కరోనా భయంతో ముందుకురాని బంధువులు 

మిర్యాలగూడ: ఓ వ్యక్తి చనిపోతే కరోనా భయంతో చివరిచూపు చూసేందుకు కూడా బంధువులు రాని నేపథ్యంలో కొందరు ముస్లిం యువకులు పాడె మోసి, అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. మతాలు మాత్రమే వేరని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఇస్లాంపురకు చెందిన చంద్రశేఖరాచారి (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. అయితే, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ భయంతో సమీప బంధువులు ఎవరు కూడా భౌతికదేహాన్ని కడసారి చూసేందుకు రాలేదు. దీంతో మృతుడి తల్లికి తోడుగా ఆ కాలనీకి చెందిన ముస్లిం యువకులు నాయబ్, బురాఖాన్, వసీం, ఖయ్యూమ్, జుబేర్, అబ్బూలు అంతిమ యాత్రలో పాడె మోశారు. కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీఎల్‌ఆర్‌ ఏర్పాటు చేసిన వైకుంఠ రథంలో హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 
 

మరిన్ని వార్తలు