కరోనా వైరస్‌ గాలిలో ప్రయాణిస్తుంది: సీసీఎంబీ 

6 Jan, 2021 08:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గాలిలో ప్రయాణించగలదని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది. చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబియల్‌ టెక్నాలజీతో కలసి నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, చండీగఢ్‌లో మూడు చొప్పున ఆసుపత్రుల్లో ప్రయోగాలు నిర్వహించినట్లు చెప్పింది. కోవిడ్, ఇతర వార్డుల నుంచి గాలి నమూనాలు సేకరించి ఆరీ్టపీసీఆర్‌ విధానంలో పరీక్షలు జరిపినట్లు వివరించింది.  (గుడ్‌న్యూస్‌.. టీకా పంపిణీకి సిద్ధం )

కోవిడ్‌ వార్డుల్లోని గాలిలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని, ఇతర వార్డుల నమూనాల్లో కనిపించలేదని తెలిపింది. దీన్ని బట్టి కోవిడ్‌ నిరోధానికి ఆసుపత్రుల్లో గదుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిచ్చిందని పేర్కొంది. కోవిడ్‌తో బాధపడుతున్న వారు ఒక గదిలో ఎంత మంది ఉన్నారనే అంశంపై గాలి ద్వారా వైరస్‌ వ్యాపించేదీ లేనిదీ తెలుస్తుందని, రోగుల్లో లక్షణాల తీవ్రత, గదిలో ఎంతకాలం ఉన్నారనే అంశాలూ ప్రభావం చూపుతాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

వ్యాధిగ్రస్థులు ఎక్కువ కాలం గడిపిన గదిలో రెండు మీటర్ల కంటే దూరంలోనూ గాల్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించినట్లు ఈ పరిశోధన వెల్లడించింది. లక్షణాలు లేనివారి నుంచి వైరస్‌ ఎక్కువ దూరం వెళ్లడం లేదని తాము గుర్తించామని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. టీకా అందుబాటులోకి వచ్చేంతవరకూ భౌతిక దూరం, చేతుల శుభ్రత, మాస్కు ధరించడం చాలా ముఖ్యమని పరిశోధన చెబుతోందని, వైరస్‌ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తేలడం దీనికి కారణమని ఆయన వివరించారు. (కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నర్స్‌ మృతి)

మరిన్ని వార్తలు