విజృంభిస్తున్న కరోనా.. నెలరోజుల్లో నాలుగింతలు

5 Apr, 2021 01:43 IST|Sakshi

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 4,057 మంది కరోనా రోగులు 

మార్చి 3న 152 కేసులు.. ఏప్రిల్‌ 3న 1,321 కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ అంత కంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. నెల రోజుల్లోనే ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందంటే వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా గత నెల మూడో తేదీన కరోనాతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య 1,115 ఉండగా, ఈ నెల ఆ సంఖ్య ఏకంగా 4,057కు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై 1,165 మంది, ఆక్సిజన్‌పై 1,940 మంది చికిత్స పొందుతున్నారు. నెలరోజుల్లో 15.5 లక్షల పరీక్షలు చేయగా, అందు లో 12,734 మందికి కరోనా సోకింది. గత నెల మూడో తేదీన 152 కేసులు నమోదైతే, ఈ నెల మూడో తేదీన ఏకంగా 1,321 కేసులు నమోదు అయ్యాయి. అలాగే నెల రోజుల్లో ఏకంగా 80 మంది మృతి చెందారు. అలాగే లక్షణాలు లేకుండా కరోనాకు గురైనవారు గతంలో 70 శాతం ఉంటే, ఇప్పుడు అది 78.5 శాతానికి చేరుకుంది.

మొత్తం కేసులు 3.12 లక్షలు.. 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,03,92,927 నిర్ధారణ పరీ క్షలు చేయగా, అందులో 3,12,140 కేసులు నమోదయ్యాయి. శనివారం 62,973 టెస్ట్‌లు చేయగా, అందులో 1,321 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 320 మంది కరోనా బారినపడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా 293 మంది కోలుకోగా, ఇప్పటివరకు 3,02,500 మంది రికవరీ అయ్యారు. ఒక రోజులో ఐదుగురు చనిపోగా, ఇప్పటివరకు 1,717 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 3,866 మంది ఉన్నారని తెలిపారు. 

14.38 లక్షలకు చేరుకున్న టీకాలు.. 
శనివారం 45 ఏళ్లు దాటిన 41,488 మందికి మొదటి డోస్‌ టీకా వేశారు. అలాగే వైద్య సిబ్బందిలో 1,035 మంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 1,009 మంది మొదటి డోస్‌ వేసుకున్నారు. అలాగే తాజాగా ఒక్క రోజులో రెండో డోస్‌ తీసుకున్నవారు 10,872 మంది ఉన్నారు.  మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాలు వేసుకున్నవారి సంఖ్య 14,38,828 చేరిందని శ్రీనివాసరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు