Corona Tragedy: ఫొటో, వీడియోగ్రాఫర్ల  బతుకులు ఆగం

9 Jun, 2021 09:34 IST|Sakshi

కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్‌ చీకట్లు నింపింది. పెళ్లిళ్ల సీజన్‌లో వీడియోగ్రాఫర్లు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుని మిగతా సమయాల్లో ఎలాగోలా కాలం వెల్లదీస్తారు. అలాంటిది కరోనా అడ్డంకులు, ఆంక్షలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లిళ్ల గిరాకీ రాకపోవడం, మామూలు ఫొటోలు ఎవరూ దిగకపోవడం, లాక్‌డౌన్‌తో షాపులు తెరుచుకోకపోవడంతో అటు ఉపాధి కరువై ఇటు షాపుల అద్దె చెల్లించలేక, పూటగడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): కరోనా ప్రభావం అన్ని వర్గాలవారిపై ప్రభావం చూపిస్తోంది. ఫొటోగ్రాఫర్‌ వృత్తిపై సైతం ఎక్కువగానే ఉంది. స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న వారికంటే పెద్ద కెమెరాలు కొనుగోలు చేసి పెళ్లిళ్ల సీజన్‌లో పని చేసే ఫొటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గతంలో వలె ఆర్భాటంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు పని తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది.

తగ్గిన డిమాండ్‌..
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు సైతం మమ అన్నట్లుగా చేస్తుండటం, పెళ్లిళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో పెళ్లివారు ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో గతంలో కంటే ఒక్కో పెళ్లి ఆర్డర్‌లో 50 శాతం రేట్లు తగ్గించినా గిరాకీలు రావడం లేదని వాపోతున్నారు. సీజన్‌ ఫొటోగ్రఫీ చేసేవారు కొందరు కిస్తీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో స్టూడియో ఉన్నవారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటు ఆర్డర్లు లేక, అటు కిరాయిలు కట్టలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
పెళ్లిళ్ల సీజన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలతో వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్‌ సెషన్స్‌ లేదు. ఇరుపక్షాల నుంచి ఒక్కరితోనే ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక పెళ్లికి దాదాపు ఐదారుగురికి పని దొరికేది.   ఇప్పుడు అన్ని ఒక్కడై ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండడంతో మిగతావారికి పని లేకుండా పో యింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి.                        
– ఆవుల నరేశ్, తారిక ఫొటో స్టూడియో, కరీంనగర్‌  

ఫోన్‌లతో తీసుకుంటున్నారు
కరోనా మహమ్మారితో ఎక్కువ మందిని పెళ్లిళ్లు, శుభాకార్యాలకు పిలవడం లేదు. 20, 30 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కొంత మంది సెల్‌ఫోన్‌లలోనే ఫొటోలు తీసుకుంటున్నారు. రిసెప్షన్‌ వంటివి లేకుండా పోయాయి. అన్ని ఒక్కరోజు, ఒక్క దగ్గరే జరిపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో పని లేకుండా పోయిందని వీడియో, ఫొటోగ్రాఫర్లు బాధపడుతుంటే మరోపక్క కరోనా మా బతుకులను వీధిన పడేసింది. 
– నకిరేకొమ్ముల శ్రీనాథ్, వీడియోగ్రాఫర్, కరీంనగర్‌


బతుకులు రోడ్డునపడ్డాయి..
కరోనాతో గతేడాదిగా ఉపాధి కరువైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సీజన్‌లో కొన్ని పెళ్లిళ్లకు అడ్వాన్స్‌ తీసుకున్నాం. కరోనా సెకండ్‌వేవ్‌తో పెళ్లి ఊరేగింపులు లేవు, హంగామా లేదు. అంతా సాదాసీదాగా చేస్తున్నారు. దీంతో ఎవరికీ పని లేకకుండా పోయింది. మామూలు రోజుల్లో ఒక్క పెళ్లి ద్వారా 100 మందికి ఉపాధి దొరికేది. క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్‌ సిస్టమ్, లైటింగ్‌ ఇలా.. ప్రస్తుతం అందరి బతుకులు రోడ్డునపడ్డాయి.

– గోగుల ప్రసాద్, ఈవెంట్‌ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్‌ కరీంనగర్‌

పోషణ కష్టమవుతోంది
కరోనాతో గిరాకీ లేక కుటుంబ పోషణ కష్టమవుతుంది. పెళ్లిళ్లు జరుగుతున్నా ఒక్కరికే అవకాశం ఇస్తున్నారు. తక్కువ మందితో కార్యాన్ని కానిస్తున్నారు. కరోనాకు ముందు ఒక పెళ్లికి దాదాపు ఫొటో, వీడియోకు లక్ష రూపాయల వరకు బడ్జెట్‌ కేటాయించే వారు. ఇప్పుడు కేవలం పెళ్లి ఫొటోలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో అందరికీ ఉపాధి లభించడం లేదు. 

– బద్దరి వంశీ, వీడియోగ్రాఫర్, కరీంనగర్‌  

చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు

మరిన్ని వార్తలు