వచ్చే నెలాఖరుకల్లా అదుపులోకి..

26 Aug, 2020 06:31 IST|Sakshi
విలేకరుల సమావేశంలో రమేశ్‌రెడ్డి, శ్రీనివాసరావు

కరోనా నియంత్రణపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి వెల్లడి

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే పూర్తిగా అదుపులోకి వైరస్‌

వచ్చే నెలాఖరుకల్లా మిగతా ప్రాంతాల్లోనూ నియంత్రణలోకి..

ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కొద్దిరోజుల్లోనే సాధారణ పరిస్థితులు

వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

రాష్ట్రంలో ఒకరిద్దరికి రెండోసారి కరోనా...

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని, కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కొద్ది రోజుల్లో ఇంకా తగ్గుతాయని, వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వైరస్‌ అదుపులోకి వస్తుందని తెలిపారు. సర్కారు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ప్రజలు కొద్దిరోజుల్లో సాధారణ జీవితం గడిపే పరిస్థితులు వస్తాయన్నారు.

బయట నుంచి తీసుకొచ్చే సామాన్లను శానిటైజ్‌ చేయనవసరం లేదన్నారు. వాటి నుంచి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువన్నారు. అలా అని జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు రాకుండా ఉండదన్న గ్యారంటీ లేదని హెచ్చరించారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 వేల మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. సీజనల్‌ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయని, అందువల్ల ప్రజలు ఏమాత్రం అనారోగ్యం బారినపడినా పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ఒకరిద్దరికి రెండోసారి కరోనా...
రాష్ట్రంలో ఒకరిద్దరికి రెండోసారి కరోనా వచ్చినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై తదుపరి పరిశోధన జరగాల్సి ఉందన్నారు. అయితే వారికి మొదటిసారి వచ్చినప్పుడు తప్పుగా పాజిటివ్‌ అని వచ్చిందా లేక నిజంగానే రెండోసారి వైరస్‌ సోకిందా అనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. తమ ఆఫీస్‌లోనూ ఒకతనికి మొదటిసారి వచ్చిందని, అప్పుడు అతనికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. కానీ ఇప్పుడు రెండోసారి లక్షణాలతో పాజిటివ్‌ వచ్చిందన్నారు. అయితే మొదటిసారి టెస్టుల్లో తప్పుడు పాజిటివ్‌ కూడా అయి ఉండొచ్చన్నారు. హాంకాంగ్‌లో కొందరికి రెండోసారి కరోనా వచ్చినట్లు నిరూపితమైందని, కాబట్టి రాష్ట్రంలోనూ వచ్చే అవకాశాలున్నాయన్నారు.‘హాంకాంగ్‌లో మొదటిసారి లోకల్‌ స్ట్రెయిన్‌తో వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్‌ యూనియన్‌లోని స్ట్రెయిన్‌ వల్ల మళ్లీ అక్కడ వచ్చింది. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. మొదటిసారి వైరస్‌ సోకినప్పుడు ఉన్నంత ప్రభావం రెండోసారి ఉండట్లేదు’ అని శ్రీనివాసరావు వివరించారు.

ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారమే...
ప్రైవేటు ఆస్పత్రుల్లోని అన్ని పడకల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరల ప్రకారమే కరోనా వైద్యం అందించాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సగం పడకలు తమకిష్టం వచ్చినట్లుగా చార్జీలు వసూలు చేసేందుకు అంగీక రించబోమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో పడకలు నిండాకే ప్రైవేటులోని 50 శాతం పడకలు తీసుకొని తామే రోగుల్ని పంపుతామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒకట్రెండు రోజుల్లో చర్చలకు వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచిందని, కేవలం ఈ నెలలోనే 5,62,461 కరోనా పరీక్షలు చేశామన్నారు.

అన్ని జబ్బులకూ అన్ని చోట్లా చికిత్స: డాక్టర్‌ రమేశ్‌రెడ్డి
అన్ని జిల్లా, బోధనాస్పత్రుల్లో సీజనల్‌ వ్యాధులతోపాటు ఇతర జబ్బులకు చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామని డీఎంఈ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకితే నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, వారికి బీమా లభించేలా బీమా కంపెనీలకు ప్రతిపాదనలు పంపామన్నారు. సేవలందిస్తూ మరణించిన వైద్య సిబ్బంది విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్నారు. 

>
మరిన్ని వార్తలు