మహమ్మారితో రక్తసంబంధం సైతం..

21 Sep, 2020 17:33 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా పేగు బంధాన్ని(రక్త సంబంధికులను) సైతం దూరం చేసుకుంటున్నారు. నిజమాబాద్‌లో ఓ కొడుకు చేసిన చర్య మానవత్వానికే పెను సవాలు విసురుతోంది. ఓ అమ్మకు కరోనా సోకి, తిరిగి ఆరోగ్యం మెరుగుపడ్డా, ఇంట్లోకి రానివ్వకుండా ఆమె కొడుకు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తె: రోటరి నగర్ కు చెందిన బాలమణిని కొడుకు కొంత కాలం క్రితం అనాధాశ్రమంలో చేర్పించారు. కాగా కొడుకు, కోడలు, మనవళ్లు వారి ఇంట్లో ఉంటున్నారు. అయితే బాలమణితో పాటు ఆశ్రమంలో ఉన్న కొందరికి 26 రోజుల క్రితం కోవిడ్(కరోనా) సోకింది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ఆశ్రమం నుంచి జిల్లా ఆసుపత్రిలో చేర్చించారు. అయితే చికిత్స పొందాక, కరోనా పరీక్ష చేయగా వారికి నెగిటివ్‌ వచ్చింది. కరోనా నేపథ్యంలో ఆశ్రమం తాత్కాలికంగా మూసేశారు. దీంతో  ఇంటికి తీసుకెళ్లాలని కుమారునికి సూచించగా ఆయన స్పందించలేదు. అయితే ఆసుపత్రి వారే ఆమెను ఇంటి దగ్గరకి చేర్చారు. అయినా కుమారుడు మాత్రం తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో కలిసి మరో చోటికి  వెళ్లిపోయారు. ఇతరుల దగ్గరకు వెళ్లలేక.. తనలో తాను కుమిలిపోతూ.. ఇంటి ఆవరణలో అమ్మ ఉన్నారు. వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ తల్లి పేగు విలవిలలాడిపోతుంది.

కుమారుని ఆదరణకు నోచుకోక, కన్నీటి పర్యంతం అవుతోంది ఆ మాతృమూర్తి. కాగా ఇంటి పక్కన వాళ్లు పెట్టే భోజనం తింటూ, తన పరిస్దితిని చూసి కుమిలిపోతుంది. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్ధలానికి వెళ్లి కుమారునితో ఫోన్ లో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అమ్మకు భరోసా కల్పించారు. విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కొడుకు తీరుపై స్దానికులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు