Corona Virus: జూన్‌ 15 నాటికి..కంట్రోల్‌లోకి!

23 May, 2021 01:43 IST|Sakshi
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుప త్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డి

ఈ నెలాఖరుకు కరోనా కేసులు తగ్గుముఖం

రాష్ట్రంలో కీలకమైన రెండు దశలు వచ్చేశాయ్‌.. నియంత్రణలో వైరస్‌ వ్యాప్తి..

జాగ్రత్త పడకపోతే థర్డ్‌ వేవ్‌ రావొచ్చు.. బ్లాక్‌ ఫంగస్‌పై తొలిదశలోనే జాగ్రత్త పడాలి

‘సాక్షి’ ఇంటర్య్వూలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణ అంటే.. మొదటగా టెస్టుల్లో పాజిటి విటీ రేట్‌ తగ్గుతుంది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సీరియస్‌ కేసుల అడ్మిషన్లు తగ్గుతాయి. చివరిగా మరణాలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం తెలంగాణలో మొదటి రెండు దశలు వచ్చేసినట్టే..’అని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యం లోనే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చినట్టు కనిపిస్తోందని, కేసులు తగ్గుముఖం పట్టడాన్ని బట్టి ఇది స్పష్టమవుతోందని అం టున్న నాగేశ్వర్‌రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్య్వూలోని ముఖ్యాంశాలు..

కేంద్రం తోడ్పాటు అవసరం
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జూన్‌లోనూ అం తగా టీకాల ఉత్పత్తి జరిగి అవి ఎక్కువగా అందు బాటులోకి వచ్చే అవకాశాలు లేవు. అంటే జూలై లోనే అదనపు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనీసం 3,4 నెలల్లో అందరికీ టీకాలు వేసేయాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాది చివరికల్లా దేశంలో అందరికీ టీకాలు దొరికే అవకాశాలున్నా యి. వ్యాక్సిన్‌ను బయటి నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు మన వ్యాక్సిన్‌ తయారీదారులకు కూడా ఆర్థి కంగా, ఇతరత్రా సహాయాల విషయంలో కేంద్రం చేదోడు వాదోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. రాబోయే 4–8 వారాల్లో చాలా ఎక్కు వగా టీకాలు ఉత్పత్తి చేసు కోవాల్సిన అవసరముంది. 

ప్రభుత్వం కూడా నడుం బిగించాలి..
గత రెండు దశల్లో ఎదురైన అనుభవాలను దృష్టి్టలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తి చేయకుండా ప్రజలే జాగ్రత్తలు గట్టిగా పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలి. మహమ్మారి తీవ్రత సమయంలో ఎంతో ముఖ్యమైన వ్యాక్సినేషన్‌ తగిన స్థాయిలో జరగక పోవడం దురదృష్ట్ట కరం. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి టీకాలు గణనీయంగా పెంచాలి. వ్యాక్సిన్లు వేయడంలో వేగం పెంచడం ద్వారానే కరోనాను నియంత్రణలోకి తీసుకురాగలుగుతాం. 

అన్ని జాగ్రత్తలు = టీకా
ప్రస్తుత సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌ నుంచి కావాల్సిన రక్షణకు అనుగుణంగా రెండు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచు హ్యాండ్‌ శానిటై జేషన్, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇవన్నీ పాటిం చడం వ్యాక్సిన్‌ వేసుకోవడంతో సమానమన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. లేకపోతే మళ్లీ త్వరలోనే థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.

 టీకాలపై ఇప్పటికీ స్పష్టత లేదు
వ్యాక్సిన్లు వేసే విషయంలో ఇప్పటికీ కొంత గందరగోళం, అయోమయం కొనసాగుతోంది. దీనిని కేంద్ర పభుత్వం చేపడుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారా? లేక ప్రైవేట్‌ ఆసుపత్రులు, సంస్థలకు అవకాశం ఇస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ముందు ప్రై వేట్‌ వాళ్లను చేయమన్నారు. మళ్లీ ఆపేశారు. అత్యంత ముఖ్యమైన, ఏకైక ప్రత్యామ్నాయమైన టీకాల విషయంలో ఏం చేయాలో, వ్యాక్సినేషన్‌పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా వ్యాక్సిన్ల ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టాలి. వ్యాక్సినేషన్‌ను గణనీయంగా పెంచాలి.

అసలు ప్రజలకు ఎలా ఇవ్వాలి అన్నదానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. కొన్నిరోజులు టీకాలు వేసి మళ్లీ ఆపేయడం, కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలతో అందరిలో అయోమయం నెలకొంటోంది. కోవిన్‌ పోర్టల్‌ అంత ‘యూజర్‌ ఫ్రెండ్లీ’గా లేదు. దానిని సరళతరం చేయాలి. మొదటిదశలో సైడ్‌ ఎఫెక్ట్స్, ఇతర భయాలతో టీకా వేసుకునేందుకు తటపటాయించారు. గతంలోని పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు తమకు టీకా వేయాలని అడుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదొక సానుకూలాంశం. 

టీకా వేశాకా వస్తున్నది 5, 6 శాతానికే..
టీకా తీసుకున్నాక కూడా కోవిడ్‌ వస్తుందనడం కరెక్ట్‌ కాదు. రెండుడోసుల వ్యాక్సిన్‌ ఇచ్చాక ఒకవేళ కరోనా వచ్చినా స్వల్పంగానే వస్తుంది. మేము చాలా ఆసుపత్రుల్లో అధ్యయనం చేశాక తెలిసిందేమంటే టీకాలు తీసుకున్న వారిలో కేవలం ఐదారు శాతం మందికే వైరస్‌ సోకుతున్నట్లు స్పష్టమైంది. రెండు డోసుల తర్వాత కూడా సీరియస్‌ అవుతున్న కొద్దిమందిలో ఇతర జబ్బులు, తీసుకునే మందులు ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వ్యాయామం, షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

బ్లాక్‌ ఫంగస్‌తో బహుపరాక్‌
రెండోదశలో కోలుకున్న రోగులకు బ్లాక్‌ఫంగస్‌ లేదా మ్యుకార్‌మైకోసిస్‌కు గురికావడం ఆందోళనతో కూడుకున్నదే. ఇది మొదటి దశలో కనబడకపోగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కలిపి 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మనదగ్గరా 500 నుంచి 1,000 దాకా వచ్చి ఉంటాయి. సంఖ్యాపరంగా ఇవి ఎక్కువ కాకపోయినా ‘ప్రమాదకరమైన జబ్బు’కాబట్టి అందరూ దానిని గుర్తిస్తున్నారు. అనవసర స్టెరాయిడ్స్‌ వినియోగం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, ఆక్సిజన్‌ సరిగ్గా పెట్టక కల్తీ అయితే, ఆసుపత్రుల్లో సరఫరా చేసే పైపులు సరిగా లేకపోతే, హోం ఆక్సిజన్‌ పెట్టుకున్నప్పుడు సరిగా తీసుకోకపోతే ఇదొచ్చే అవకాశాలుంటాయి.

ముఖంలో ఒకవైపు నొప్పి, పిన్ను పెట్టి గుచ్చినట్టు బాధ, ముక్కు దిబ్బడ, చెవి వినికిడి తగ్గిపోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటివి తొలుత వచ్చే లక్షణాలుగా గుర్తించాలి. ఇది సెకండ్‌ స్టేజ్‌లో సైనస్‌ సమస్య మాదిరిగా వస్తుంది. ముఖం ఒకవైపు ఎర్రగా మారిపోతుంది. కళ్లు కొద్దిగా ఉబ్బుతాయి. ఈ దశల్లోనే లక్షణాలను గుర్తించి వచ్చిన పేషెంట్లకు తగిన చికిత్స అందించవచ్చు. మూడో స్టేజ్‌లో ఇది కంటిలోపలికి వెళ్లిపోయి, కళ్లు ఉబ్బిపోయి కంటిని తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక నాలుగో స్టేజ్‌లో మెదడుకు వ్యాపిస్తుంది. అప్పుడు శస్త్రచికిత్స చేయడం రిస్క్‌తో కూడుకున్నది.

యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే..
యువత మాస్క్‌లు పెట్టుకోకుండా, పార్టీలు అంటూ స్వేచ్చగా తిరగడం వల్ల సెకండ్‌వేవ్‌లో వీరంతా కరోనా బారిన ఎక్కువగా పడ్డారు. ఈ వయసు వారికి ఇంకా వ్యాక్సిన్లు వేయకపోవడం కూడా తీవ్రతకు కారణం. మరోవైపు కొత్త వేరియెంట్‌ బి.1.167 యువజనులు, పిల్లలపై ఎక్కువగా దాడి చేసినట్లు కన్పిస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 95 పైనే ఉంటోంది. ఆక్సిజన్‌ అవసరమున్న వారిని ఆసుపత్రిలో చేర్చి ట్రీట్‌మెంట్‌ ఇస్తే రికవరీ రేటు ఎక్కువగానే ఉంటోంది. అయితే చాలామంది ఆక్సిజన్‌ స్థాయిలు 70 దాకా తగ్గిపోయాక వస్తున్నారు. అలాంటప్పుడు సమస్యలొస్తున్నాయి. బి.1.167 అధిక ప్రభావం ఎందుకంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకినపుడు దాని విభజన జరుగుతుంది.

ఈ విధంగా ఏ వైరస్‌లోనైనా మ్యుటేషన్‌ జరుగుతుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ వైరస్‌ వేరియెంట్‌కు తన మ్యుటేషన్‌ను కరెక్ట్‌ చేసుకునే కెపాసిటీ లేదు. ర్యాండమ్‌గా వచ్చినపుడు ఏ మ్యుటేషన్‌ వల్లనైతే వైరస్‌ ఎక్కువగా జీవించి ఉంటుందో దాని మ్యుటేషన్లు ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర వచ్చిన ఈ వేరియెంట్లో 2,3 మ్యుటేషన్లు వచ్చేశాయి. ముఖ్యంగా స్సైక్‌ప్రోటీన్లో మ్యుటేషన్‌ ఎక్కువ రావడంతో మన శరీరాలకు అది సులభంగా అతుక్కుపోతోంది. అందువల్ల అంతకు ముందుతో పోల్చితే ఈ మ్యుటేషన్‌ వ్యాప్తి సులభంగా మారింది. 

సెకండ్‌ వేవ్‌ అందర్నీ చుట్టేస్తోంది
రెండో దశలో గతానికి భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. కొంచెం వయసు తక్కువ ఉన్నవారికి దగ్గు, జలుబు వంటి శ్వాససంబంధిత లక్షణాలు కాకుండా ఒళ్లు నొప్పులు, జాయింట్‌ పెయిన్స్‌ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే రుచి, వాసనలు కోల్పోతున్న వారూ ఎక్కువగానే ఉంటున్నారు. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ వైరస్‌ త్వరగా వ్యాపించేస్తోంది. ఇన్‌ఫెక్టివిటీ ఎక్కువగా ఉంటోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ మొదటిదశతో పోల్చితే అదనంగా వచ్చినవే. షుగర్, ఊబకాయం ఎక్కువున్న వారిలో ఈ కాంప్లికేషన్స్‌ పెరుగుతున్నాయి. ఆక్సిజన్‌పెట్టాల్సిన అవసరం కూడా గతంలో కంటే పెరుగుతోంది. 

ఏరోశాల్స్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తి..
ప్రస్తుతం వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఏరోశాల్స్‌ (గాలి) ద్వారా వ్యాపిస్తోంది. వైరస్‌ పార్టికల్‌ 5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ఎవరైనా తుమ్మినా, దగ్గినా, గట్టిగా మాట్లాడినా ఈ ఏరోశాల్స్‌ ద్వారా ఆరు అడుగుల దూరంలో ఉన్న వారికి కూడా కరోనా రావొచ్చు. ఇంట్లో అన్ని తలుపులు మూసేసి.. గాలి, వెలుతురు సరిగా లేకపోతే ఈ వైరస్‌ ఒకరి నుంచి వెలువడ్డాక గాలిలో కనీసం అరగంట దాకా అలానే ఉండిపోతుంది. అందువల్ల ఆ గదిలోని ఇతర సభ్యులకు ఇది వ్యాపించే ప్రమాదముంది. 

అనుమానముంటే అందరూ మాస్క్‌ పెట్టుకోవాలి
ఒకచోట ఎక్కువ మంది గుమిగూడేందుకు అవకాశమున్న ఫంక్షన్లు వంటి వాటిల్లో వైరస్‌ ఉన్న ఎవరో ఒకరి ద్వారా అక్కడున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ. గట్టిగా మాట్లాడినప్పుడో, భోజనం చేసేటప్పుడో ఇది ఇతరులకు వ్యాపించవచ్చు. అందువల్ల ఎవరికైనా ఉందనే అనుమానముంటే ఇళ్లలో కూడా అందరూ మాస్క్‌లు పెట్టుకోవాలి. కిటికీలు తెరిచిపెట్టాలి. ఏసీ వేసుకోవడం కన్నా ఫ్యాన్లు ఉపయోగించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలి.

వ్యాక్సిన్‌ ఒక్కటే మందు...
ఇప్పటివరకు కరోనా సోకని వారు ఇకముందు కూడా సోకకుండా ఉండాలంటే కచ్చితంగా టీకా వేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. కచ్చితంగా మాస్క్‌లు వాడుతూ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే ఇది వచ్చే అవకాశాలే ఉండవు. ఒకవేళ వచ్చినా సులభంగా తగ్గిపోతుంది. తీవ్రస్థాయికి చేరదు. ఇప్పుడు యూఎస్‌లో చూస్తే అందరూ సాధారణ స్థితికి వెళ్లిపోతున్నారు. అక్కడ తగ్గిపోయినందువల్ల మాస్క్‌లు కూడా వాడొద్దంటున్నారు. ఇజ్రాయెల్‌లో అలాగే తగ్గిపోయింది. యూకేలో కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రాష్ట్రంలో చర్యలు భేష్‌
రాష్ట్రంలో ఆక్సిజన్, ఇతర మందుల కొరత అంత ఎక్కువగా కాకుండా మంచి చర్యలే తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే వీటికి సంబంధించి ఇక్కడ బాగానే ఉంది. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు తీసుకున్న చర్యలు బాగున్నాయి. 

బెస్ట్‌ ప్రోటోకాల్స్‌పై ఏఐజీ బుక్‌
ప్రపంచంలో అనుసరిస్తున్న బెస్ట్‌ ప్రోటోకాల్స్‌ పరిశీలించి, వాటిలోంచి కోవిడ్, పోస్ట్‌ కోవిడ్‌లో పాటించాల్సిన మెరుగైన ప్రోటోకాల్స్‌పై ఏఐజీ ఆధ్వర్యంలో వారంలో ఒక పుస్తకం తీసుకొస్తున్నాం. దేశంలోని డాక్టర్లందరికీ దీనిని పంపించి కోవిడ్‌ వస్తే మొదటి వారంలో ఏంచేయాలి, స్వల్పంగా, ఒక మోస్తరుగా, తీవ్రంగా ఉంటే ఏంచేయాలి. ఎవరికి ఆక్సిజన్‌ ఇవ్వాలి, ఎవరికి వెంటిలేషన్‌ ఇవ్వాలి, ఎవరికి ముఖ్యమైన స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి, ఎంత డోస్‌ ఇవ్వాలో సవివరంగా అందులో తెలియజేస్తున్నాం. 

  • ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కచ్చితంగా వాడుతూ టీకాలు వేయించు కుంటే 3 నెలల్లోనే వైరస్‌ పూర్తిగా కనుమరుగు అవుతుంది.
  • మనదగ్గరా 500 నుంచి 1,000 దాకా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. సంఖ్యా పరంగా ఇవి ఎక్కువ కాకపోయినా ప్రమాదకర జబ్బుగా గుర్తిస్తున్నారు.
  • కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 95కు పైనే ఉం టోంది. ఆక్సిజన్‌ స్థాయిలు 70 దాకా తగ్గాక రావడం వల్లే సమస్యలు.
  •  టీకాలు తగిన సంఖ్యలో అందుబాటులోకి వచ్చాక, కనీసం 3, 4 నెలల్లో వీలైనంతగా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తే మంచిది.
  • కొత్త వేరియంట్‌ ప్రభావం పిల్లలు, యువతపై ఎక్కువగా ఉన్నట్టుంది.
  • ముఖ్యమైన విషయం ఏమి టంటే కరోనా సోకినాక సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదిస్తే పూర్తిగా నయం చేయొచ్చని తేలింది. 
మరిన్ని వార్తలు