ఏడాది కాలంగా కర్ఫ్యూలోనే కుదేలు!

24 May, 2021 18:05 IST|Sakshi

 ఏడాది కాలంగా ఐటీ విద్యార్థులు సరైన విద్యకు దూరం

 సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలు డీలా 

 కేంద్రాలను నమ్ముకున్న హాస్టళ్లు, వ్యాపారాలు చిన్నాభిన్నం 

 కరోనా దెబ్బతో ఈ రంగంలోని చాలా మంది ఉద్యోగం, ఉపాధిపై వేటు 

హైదరాబాద్‌: కరోనా విసిరిన పంజాతో ఐటీ విద్యా రంగం ఏడాది కాలంగా కర్ఫ్యూలోనే కుదేలవుతుంది. సాఫ్ట్‌వేర్‌గా తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఐటీ విద్యార్థులు సరైన శిక్షణలకు దూరమయ్యారు. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఎందుకంటే అకాడమిక్‌ ఇయర్‌ను పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపు మళ్లుతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల నుంచి శిక్షణ తీసుకునేందుకు నగరానికి వస్తారు.

ఎందుకంటే ఇక్కడ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ డ్రీమ్‌ జాబ్‌ను సాధించేందుకు అమీర్‌పేట కేంద్రంగా ఉన్న ఐటీ శిక్షణ కేంద్రాల్లో వాలిపోతుంటారు. కాని కరోనా దెబ్బకు ఏడాది కాలంగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. ఒక్క విద్యార్థి శిక్షణ కేంద్రం గడప తొక్కాడంటే.. అతన్ని ఏదో రకంగా తమ విద్యార్థిగా మలచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది సంవత్సరం పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. 
 
అమీర్‌పేట కేంద్రంలో 400 నుంచి 450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి.  
ఇక మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్‌లైన్‌’ అనే వేదికతో బతికిబట్టకడుతున్నాయి. మారుతున్న సాంకేతికతను విద్యార్థులకు పంచినట్టుగానే.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి తామూ మారక తప్పదన్న నిర్ణయానికి వచ్చి గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చెప్పేసినట్లుగా చెప్పేస్తే కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఒక వేదిక. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాల్సి ఉంటుంది.  ఫిజికల్‌ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్‌లైన్‌లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే. 

అందుకు తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వెర్స్‌ను, ఆన్‌లైన్‌ సిమిలేటర్స్‌ను సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం. అయినప్పటికీ వేళ్ల మీద లెక్కించేంత సంఖ్యలో మాత్రమే రిస్క్‌ తీసుకుని ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఫిజికల్‌ క్లాసుల ద్వారా అందించే క్వాలిటీని ఇవ్వలేకపోయినా.. 70 శాతం మేర విద్యార్థులకు న్యాయం చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అలా ఉంటే తప్ప విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ను అందించలేమన్న నిర్ణయానికి వచ్చాయి. ఆయా సంస్థలు ఇస్తున్న భరోసాతోనే విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల వైపు మళ్లారు. 

చాలా మంది ఉపాధిపై వేటు.. 
అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసే వారు. ఆన్‌లైన్‌ శిక్షణ కొనసాగిస్తుండడంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.  ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వీరంతా ప్రత్యక్షంగా ఇక్కడి సెంటర్లను నమ్ముకుని జీవించే వారు. ఇక ఐటీ కేంద్రాల మాటున పరోక్షంగా ఆధారపడ్డ వారూ చాలామందే ఉన్నారు. టిఫిన్‌ సెంటర్లు, చాట్‌ బండార్లు, టీస్టాల్స్‌... ఇలా పదుల సంఖ్యలో చిరు వ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బేషుగ్గా బతికేసే వారు. కానీ ఇప్పుడు చాలా మంది చిరు వ్యాపారులు తమ అడ్డాలను మార్చేసుకున్నారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్‌ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్‌ లేకుండా పోయారు. ఆయా సంస్థలు అందించే కోర్సుల వివరాలతో భారీగా ప్రచార కరపత్రాలు ముద్రించే వారు. ఇప్పుడు ముద్రణ సంస్థల నిర్వాహకులు సైతం బిక్కమొహం వేసేశారు. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా హాస్టల్స్‌ నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరం. ఆన్‌లైన్‌ తరగతులతో చాలామంది విద్యార్థులు ఇంటి బాటపట్టగా కొద్ది మందితో హాస్టల్స్‌ నిర్వహణ కష్టతరంగా మారింది. ఇలా కరోనా ప్రభావంతో ఏడాది కాలంగా తమ లక్ష్యాలను చేరుకోలేక ఐటీ విద్యార్థులతో పాటు ఐటీ శిక్షణ కేంద్రాలు, వాటిలో పనిచేసే ఉద్యోగులు, వాటిని నమ్ముకొని వ్యాపారం సాగించే వారి ఉపాధిపై తీవ్రంగా వేటు పడింది. 

 అద్దెకట్టలేని పరిస్థితిలో ఉన్నాం 
సాఫ్ట్‌వేర్‌ యువతను నమ్ముకుని తమ లాంటి వాళ్లు ఎంతోమంది వ్యాపారాలు పెట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్న సమయంలో వ్యాపారం బాగా సాగేది. కరోనా ప్రభావంతో ఇప్పుడు మరీ దారుణంగా పడిపోయింది. అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం అద్దెలైనా తగ్గించడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఇబ్బందులు పడాలో తెలియడం లేదు. 
– ధన్‌రాజ్, హోటల్‌ నిర్వాహకుడు, అమీర్‌పేట ఆదిత్య ట్రేడ్‌ సెంటర్‌ 
 
హాస్టల్స్‌ నిర్వాహకులను ఆదుకోవాలి 
కరోనాకు ముందు ఐటీ శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులతో హాస్టల్స్‌ అన్నీ కళకళలాడేవి. తాను నిర్వహించే హాస్టల్‌లో 150 మంది వరకు ఉండే వారు. ఇప్పుడు 15 నుంచి 20 మంది మాత్రమే ఉంటున్నారు. దీంతో కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే హాస్టల్స్‌ నిర్వాహకులను ఆదుకోవాలి. 
– హరిబాబు, హాస్టల్‌ నిర్వాహకుడు, అమీర్‌పేట 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు