సరిహద్దు జిల్లాల్లో తగ్గని ఉధృతి

12 Jul, 2021 01:33 IST|Sakshi

కరోనా ప్రభావంపై జిల్లాల్లో పర్యటించిన వైద్య బృందం అంచనా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి రాలేదని.. వాటికి సరిహద్దుగా ఉన్న మన జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కొన్నిజిల్లాల్లో ఒక్కో రోజు ఒక్కకేసు కూడా నమోదుకాని పరిస్థితి ఉంటే.. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం వరుసగా పదులకొద్దీ కేసులు  వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు ఎక్కువగా వస్తున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, మరికొందరితో కూడిన ఉన్నతస్థాయి బృందం హెలికాప్టర్‌లో సుడి గాలి పర్యటనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేటలలో ఉన్నతాధికారులు పర్యటించారు. స్థానిక వైద్య సిబ్బందిని, అధికారులతో సమావేశమై కరోనా నియంత్రణలోకి రాకపోవడానికి కారణాలను పరిశీలించారు. కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల బృందం ఆదివారం రాత్రి ఖమ్మంలోనే బసచేసింది. సోమవారం డోర్న కల్, హుజూరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ రాత్రి గోదావరిఖనిలో బసచేసి.. మంగళవారం సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లో పర్యటించనుంది. 

సీఎం ఆదేశాల మేరకు


పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతుండటంపై ఇటీవల సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. అటు వంటి ప్రాంతాలను గుర్తించి అధ్యయ నం చేయాలని.. కరోనా విస్తరణకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల బృందం మూడు రోజుల పాటు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించింది. 

ఎక్కడెక్కడ కేసుల పరిస్థితి ఏమిటి? 


నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్‌ ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ నెల ఐదో తేదీన 62 కేసులు నమోదైతే, పదో తేదీన 64 కేసులు వచ్చాయి. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉండటం, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం, కరోనా టెస్టులు, ట్రేసింగ్‌ సరిగా నిర్వహించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నా నియంత్రణపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
 

మరిన్ని వార్తలు