అందరికీ ఒకే జైలు..

27 Aug, 2020 12:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆదిలాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వివిధ రకాల నేరాల్లో అరెస్టు అయిన నిందితులందరినీ ఆదిలాబాద్‌ జిల్లా జైలుకే తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేటల్లో సబ్‌ జైళ్లు ఉన్నా కోవిడ్‌ నిబంధనలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్‌ జైలుకే తీసుకొస్తున్నారు. సబ్‌ జైళ్లలో పాత ఖైదీలు మినహా కొత్త వారిని తీసుకోవడం లేదు. కరోనా వ్యాప్తితో ప్రభుత్వ నిబంధనల మేరకు ఖైదీల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నేరస్తులు, శిక్షపడ్డ ఖైదీలు ఉన్నారు. జైలు సామర్థ్యం 320 మంది కాగా, ప్రస్తుతం 170 మంది ఖైదీలు ఉన్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని సబ్‌ జైళ్లలో కొత్త వారిని తీసుకోవడం లేదు. ప్రధానంగా సబ్‌ జైళ్లలో కెపాసిటీ, వసతులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టారు. దీంతో రెండు, మూడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో అరెస్టు అయిన నేరస్తులను రిమాండ్‌లో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఇటీవల వివిధ కేసుల్లో రిమాండ్‌ అయిన నేరస్తులకు కోవిడ్‌ టెస్టు చేయగా, ముగ్గురు నేరస్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని రిమ్స్‌ ఐసోలేషన్‌కు తరలించారు. ఈ విధంగా రిమాండ్‌ ఖైదీలను మొదట కోవిడ్‌ టెస్టు చేసిన తర్వాతే రిపోర్టుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక బ్యారక్‌ 
సాధారణంగా చిన్న చిన్న నేరాల్లో నేరస్తులను రిమాండ్‌ నిమిత్తం సబ్‌ జైలుకు తరలిస్తారు. కొంత తీవ్రత ఉన్న కేసుల్లో నేరస్తులను, శిక్షపడ్డ వారిని ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉంచుతారు. ప్రస్తుతం ఏదైనా కేసులో రిమాండ్‌లో భాగంగా జైలుకు వచ్చే ముందు కోవిడ్‌ టెస్టు చేయిస్తున్నారు. అందులో పాజిటివ్‌ వస్తే రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నెగెటివ్‌ వచ్చిన వారిని జిల్లాలో అడ్మిషన్‌ తీసుకుంటున్నారు. ఇలా కొత్తగా వచ్చే వారిని 20 రోజుల పాటు సపరేట్‌ బ్యారక్‌లో ఉంచుతున్నారు. అంతే కాకుండా ప్రతీ రెండు గంటలకు ఒకసారి బ్యారక్‌ పరిసరాల్లో శానిటైజేషన్‌ చేస్తున్నారు. అలాగే జిల్లా జైలులో ప్రతీరోజు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేస్తున్నారు.

ఖైదీల సంరక్షణ కూడా..
కరోనా నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు జైలు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జైలులోనే ఉన్న ఆస్పత్రి సిబ్బందితో ఖైదీలకు వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రతీరోజు ప్రతి ఒక్కరూ మూడు సార్లు ఆవిరి పట్టుకునేలా చూస్తున్నారు. జైలు ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు ఖైదీలకు సీ–విటమిన్, మల్టీ విటమిన్‌ మాత్రలు ఇస్తున్నారు. రోజు వేడివేడి ఆహారం అందిస్తున్నారు. చాయ్‌లో జిందా తిలిస్మాథ్‌ కలిసి ఆ ద్రావణాన్ని ఖైదీలకు అందిస్తున్నారు. జైలు ఆవరణలో పండించిన నువ్వులు, ఆకుకూరలను విరివిరిగా ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ఖైదీల సంరక్షణకు ఆహార పదార్థాల్లో నువ్వులు ఉండేలా వివిధ పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, బలహీనంగా ఉన్న ఖైదీలను గుర్తించి ప్రత్యేక డైట్‌ అందిస్తున్నారు. వారికి గుడ్లు, పాలు, పండ్లు అందిస్తున్నారు. నిత్యం ఖైదీలతో యోగా చేయిస్తున్నారు. జిల్లా జైలులో ప్రతీ బ్యారక్‌ దగ్గర హ్యాండ్‌వాష్‌ను తప్పని సరిచేశారు. ప్రతీ ఖైదీ చేతులు కడుక్కునేలా వసతులు కల్పించారు. ఖైదీలతో మాస్కులు తయారు చేయిస్తున్నారు. వీటిని జైలు బయట అమ్మకానికి పెట్టారు. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. 

సబ్‌ జైళ్లలో కెపాసిటీ లేకపోవడంతోనే..
పల్లు నేరాల్లో అరెస్టు అయిన వారిని ఉంచేందుకు ఉమ్మడి జిల్లాలోని సబ్‌ జైళ్లలో కెపాసిటీ లేక ఆదిలాబాద్‌ జిల్లా జైలుకే తీసుకువస్తున్నారు. కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు చర్యలు చేపట్టాం. రిమాండ్‌ తర్వాత జైలుకు వచ్చే ముందు కోవిడ్‌ టెస్టు తప్పనిసరి చేశాం. నెగెటివ్‌ ఉంటేనే జైలులోకి తీసుకుంటున్నాం. పాజిటివ్‌ ఉంటే రిమ్స్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌కు పంపిస్తున్నాం. అతను పూర్తిగా కోలుకున్నాక జైలులోకి తీసుకుంటున్నాం. – శోభన్‌రావు, జిల్లా జైలు అధికారి, ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు