తెలంగాణలో 80% యాంటిజెన్‌ పరీక్షలే

16 Aug, 2021 03:59 IST|Sakshi

17.51 శాతానికే పరిమితమైన ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు 

కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ నివేదికలో వెల్లడి 

వేల సంఖ్యలో మిస్సైపోతున్న పాజిటివ్‌ కేసులు 

ఫలితంగా ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్న వైరస్‌  

కొత్తగా ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాలు వచ్చినా నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలో కాస్త నిర్లక్ష్యం కనిపిస్తోంది. యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చి, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలన్న నిబంధనను వైద్య ఆరోగ్య అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన వాటిలో 80 శాతంపైగా యాంటిజెన్‌ పరీక్షలే. కేవలం 17.51 శాతానికే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు పరిమితమైనట్లు ఇటీవల విడుదల చేసిన నివేదికలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,35,67,447 యాంటిజెన్‌ పరీక్షలు చేయగా, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య 23,76,131కు మాత్రమే పరిమితమైంది.

ప్రస్తుత ఆగస్టులో 10 శాతంలోపే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మరీ ఘోరంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు అత్యంత తక్కువగా చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం.. గత నెల 4 నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత తక్కువగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. ఈ కాలంలో నారాయణపేటలో 14,350 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 10 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. మిగిలివన్నీ యాంటిజెన్‌ పరీక్షలే. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో ఇదే కాలంలో 38,249 పరీక్షలు చేస్తే, అందులో 61 మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,35,305 పరీక్షలు చేస్తే, అందులో కేవలం 352 మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు.

అదనంగా ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాలు పెట్టినా 
రాష్ట్రంలో నెల క్రితం అదనంగా 14 జిల్లాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కువ మందికి ఆ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుంది. కొత్తవాటితో రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ కేంద్రాల సంఖ్య 31కి చేరుకుంది. కానీ చాలా జిల్లా ఆసుపత్రుల్లో వీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. యాంటిజెన్‌ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు.   

మరిన్ని వార్తలు