వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ

27 Aug, 2020 13:47 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కరోనా మహమ్మారి మరో పోలీసు ఉన్నతాధికారిని బలిగొంది. జగిత్యాల ఏఎస్పీ కుంబాల దక్షిణామూర్తి(58) వైరస్‌ బారిన పడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ వరకు వివిధ స్థాయిల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసిన ఆయన జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించారు. వారం క్రితం ఆయన వైరస్‌ బారిన పడగా, కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ మృతి)

మొదట రెవెన్యూశాఖలో...
కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం అల్గునూర్‌కు దక్షిణామూర్తి చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగంలో చేరాలనే లక్ష్యంతో చదువులో ప్రతిభ కనబరిచేవారు. 1986లో మొదట రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరిన ఆయన కోరుట్ల, మెట్‌పల్లిల్లో విధులు నిర్వర్తించాక 16–01–1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో మొదటి పోస్టింగ్‌ దక్కించుకున్న ఆయన సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో చేశాక తెలంగాణ ఆవిర్భావం అనంతరం పదోన్నతిపై నిర్మల్‌ ఏఎస్పీగా విధుల్లో చేరాడు. అక్కడి నుంచి గత ఏడాది నవంబర్‌ 1న జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.  

శాంతిభద్రతల పరిరక్షణలో భేష్‌
ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోనే దక్షిణామూర్తి సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఏటూరునాగారం, కేయూసీ, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందాక కొద్దిరోజులు కాజీపేట రైల్వే డీఎస్‌పీగానే కాకుండా ములుగు డీఎస్పీగా, హన్మకొండ ఏసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. భూపాలపల్లి డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్న సమయంలో నిర్మల్‌ ఏఎస్పీగా వెళ్లారు. వరంగల్‌ జిల్లాలో పనిచేసిన సమయంలో యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్, 2007లో చిన్నారి మనీషా కిడ్నాప్, హత్య కేసుతో పాటు పలు కిడ్నాప్‌ కేసుల పరిశోధనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 

మేడారం జాతరలో అన్నీ తానై...
ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర భద్రత ఏర్పాట్లలో దక్షిణామూర్తే అన్నీతానై పర్యవేక్షించి ఉన్నతాధికారులతో మెప్పు పొందేవారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ‘18 జాతరలు చూశాను.. అమ్మవార్ల సేవలో తరించే అవకాశం వచ్చింది... వచ్చే జాతరకు ఉంటామో, లేదో.. నా రిటైర్‌మెంట్‌ కూడా ఉంది.. ఈసారి ఇంకా బాగా చేశాం.. నా జన్మ ధన్యమైంది’ అంటూ మీడియా ప్రతినిధులతో ఆయన తన మనోభావాలు పంచుకున్నారు. కాగా, కరోనా బారిన పడిన పోలీసు సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపిన ఆయనే కరోనా కాటుకు బలి కావడం గమనార్హం. ఇక ఈనెల 31న ఏఎస్పీ దక్షిణామూర్తి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఇంతలోనే కరోనా ఆయనను బలిగొంది. ఆయన ఉద్యోగ విరమణ రోజు ఘనంగా సన్మానించేందుకు పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందడంతో వారు దిగ్బ్రాంతికి లోనయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు