కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి 

18 May, 2021 08:34 IST|Sakshi

ఆ కళ్లు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఆ చూపుల్లోని దైన్యం, ఊపిరి తీసుకునేందుకు పడే కష్టం, ప్రాణాలు నిలుపుకొనేందుకు వారు చేసే పోరాటం మరిచిపోలేక పోతున్నాం. రాత్రింబవళ్లూ కష్టపడినా బతికించలేని పరిస్థితి గుండెల్ని పిండేస్తోంది 
– ఓ నర్స్‌ ఆవేదన 

► 24 గంటలు కోవిడ్‌ పేషెంట్‌లతో గడిపేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. ఒంటరితనం వేధిస్తోంది. మా బాధంతా ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలో తోచడం లేదు. – ఒక డాక్టర్‌ నిస్సహాయత 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది దాని బారిన పడుతున్నారు. ఒకపక్క బాధితులు, వారి కుటుంబాలు విలవిల్లాడుతుంటే, మరోవైపు ఈ మహమ్మారిపై గత ఏడాదిగా పోరాటం చేస్తున్న కోవిడ్‌ వారియర్స్‌ ను మానసిక సమస్యలు, భయాందోళనలు వెంటాడుతున్నాయి. దీంతో ఉపశమనం కలిగించే నాలుగు మాటలు, కాసింత ఓదార్పు, మానసిక ధైర్యాన్నిచ్చే ఆసరా కోసం వారు తహతహలాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్వచ్ఛంద సంస్థలను, మానసిక నిపుణులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని  స్వచ్ఛంద సంస్థ రోష్నికి వెల్లువెత్తుతున్న ఫోన్‌ కాల్స్‌లో 30 నుంచి 40% డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉండటం ఆలోచింపజేసే విషయం.  

అవసరమైన వారికి అండగా.. 
‘కోవిడ్‌ పేషెంట్‌లకు వైద్యసేవలందజేసి వాళ్ల ప్రాణాలను నిలబెట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ కొంతమంది క్రమంగా మరణానికి దగ్గరవుతున్నప్పుడు వాళ్లను కాపాడలేకపోతున్నామనే బాధ, ఆ పేషెంట్‌ల నిస్సహాయమైన చూపులు తట్టుకోలేకపోతున్నాం..’అని పలువురు నర్సులు ‘రోష్ని’తో తమ ఆవేదన పంచుకుంటున్నారు. కోవిడ్‌ వార్డుల్లో పని చేస్తున్న వాళ్లు తమ ఇళ్లలో కుటుంబసభ్యులతో కలిసి ఉండకుండా ఐసోలేషన్‌ లోనే ఉంటున్నారు. తమ బాధను కుటుంబ సభ్యులకు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వైద్య సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రోష్ని కృషి చేస్తోంది. తిరిగి వాళ్లను కార్యోన్ముఖులను చేస్తోంది.  

ఇరుగు పొరుగు వివక్ష... 
ఇలావుండగా కోవిడ్‌ బాధితులు, వారి కుటుంబసభ్యులు ఇరుగు పొరుగు వారి నుంచి తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నట్లు రోష్నికి ఫిర్యాదులు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలో ఒక ఇంట్లో ఎవరికైనా కోవిడ్‌ వస్తే మిగతావాళ్లు ఆ ఇంటి వైపు కూడా చూడటం లేదని, అలా ఒంటరిగా గడుపుతున్న వాళ్లు తమ బాధను రోష్నితో చెప్పుకొంటున్నారని సంస్థ డైరెక్టర్‌ ఉషశ్రీ ‘సాక్షి’తో చెప్పారు.

14 రోజుల హోం క్వారంటైన్‌  ముగిసిన తరువాత కూడా బాధిత వ్యక్తులను, కుటుంబాలను ఇరుగు పొరుగు వారు సాధారణ స్థితిలో చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ పేషెంట్‌లు మృత్యు వాత పడటం చూసి చలించిపోతున్న వాళ్లు తమ మానసిక స్థితిని రోష్నితో పంచుకుంటున్నారని సీనియర్‌ వాలంటీర్‌ ఒకరు వివరించారు.  

ఒంటరి వృద్ధులకు ఎన్ని కష్టాలో... 
కొడుకులు, కూతుళ్లు విదేశాల్లో స్థిరపడి హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటున్న వయోధికులైన తల్లిదండ్రులు అనేక బాధలను అనుభవిస్తున్నారు.  అలాం టి వయోధికులు సైతం రోష్నిని ఆశ్రయిస్తున్నారు. 

సాంత్వన కోసం రోష్ని... 

  • కుంగుబాటు, ఆందోళన, కుటుంబ కలహాలు వంటి వివిధ రకాల సమస్యల వల్ల ఆత్మహత్య భావనకు గురయ్యే వారిని కాపాడేందుకు రోష్ని దశాబ్ద కాలానికి పైగా పని చేస్తోంది, గతేడాది కోవిడ్‌ కాలంలో నిరుద్యోగం, ఆకలి, లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలో గొడవలపైన సంస్థకు ఎక్కువ ఫిర్యాదులు అందాయి. 
  •  ఈసారి సెకండ్‌ వేవ్‌ ఉధృతితో కోవిడ్‌ బారిన పడిన రోగులు, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపైన మాత్రమే కాకుండా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది తమ మానసిక సమస్యలను, ఆవేదనను రోష్ని తో పంచుకొని ఓదార్పును కోరుకుంటున్నారు.
  •  రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తే అందులో 30 శాతం వరకు కోవిడ్‌ వారియర్స్‌ నుంచే కావడం గమనార్హం.

ఇలా సంప్రదించవచ్చు.. 
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ ఎవరైనా రోష్నితో తమ బాధలను , సమస్యలను పంచుకోవచ్చు. వివరాలు గోప్యంగా ఉంటాయి. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు అందుబాటులో ఉంటారు.  
ఫోన్‌  : 66202000, 66202001   
చదవండి: చిన్నారి ఆరోగ్యానికి కేటీఆర్‌ భరోసా

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు