డ్రోన్లతో వ్యాక్సిన్ల రవాణా: 100 కి.మీ వేగం.. 70 కి.మీ దూరం..

5 Jun, 2021 06:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా రవాణా చేయనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. అవసరమైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవేయడానికి సంబంధించి ప్రముఖ డ్రోన్‌ డెలివరీ స్టార్టప్‌ సంస్థ ‘టెక్‌ ఈగిల్‌’కు తాజాగా అనుమతులు లభించాయి. ‘మెడిసిన్‌ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టులో భాగంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, నీతి ఆయోగ్‌–అపోలో ఆస్పత్రులు, తెలంగాణ ప్రభుత్వాల సంయుక్త సహకారం, కృషితో ఇది వాస్తవ రూపం దాల్చుతోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో.. సుమారు 70 కిలోమీటర్ల దూరం వరకు వ్యాక్సిన్లు, మందులను డ్రోన్లతో సరఫరా చేయడానికి వీలు కలుగనుంది.

వికారాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా..
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల డెలివరీకి సంబంధించి.. రాష్ట్రంలో తొలుత వికారాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మక పరిశీలన చేపట్టనున్నారు. తర్వాత ఇతర జిల్లాలకు విస్తరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనితో కోవిడ్‌ వ్యాక్సిన్లు మాత్రమేకాకుండా.. అత్యవసరమైన ఇతర మందుల సరఫరాకు కూడా వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. రోడ్డు కనెక్టివిటీ సరిగా లేని ›ప్రాంతాలకు, నిర్ణీత ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్లను స్టోర్‌ చేసే ఏర్పాట్లు లేని చోట్లకు టీకాల రవాణా సవాళ్లతో కూడుకున్నదని.. ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా రవాణా ఎంతో ప్రయోజనకరమని అంటున్నారు. కాగా.. గతేడాది డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ నుంచి ముస్సోరికి ఐస్‌బాక్స్‌తో కూడిన నాన్‌–కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పంపారు. తెలంగాణలో మాత్రం నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్ల చేరవేతకు వినియోగించనున్నారు.

వేలాది జీవితాలు కాపాడొచ్చు
అత్యవసర మందులను డ్రోన్ల ద్వారా సకాలంలో చేరవేయడం ద్వారా వేలమంది జీవితాలను కాపాడవచ్చునని ‘టెక్‌ ఈగిల్‌’ వ్యవస్థాపకులు, సీఈవో విక్రమ్‌ సింగ్‌ మీనా పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మారుత్‌ డ్రోన్‌టెక్‌ సంస్థను కూడా వ్యాక్సిన్లు, మందుల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. మొబైల్‌ యాప్‌ సాయంతో మారుమూల, సరైన రోడ్డులేని ప్రాంతాలకు మందులను డ్రోన్లతో సరఫరా చేయొచ్చని మారుత్‌ డ్రోన్‌టెక్‌ మెడికల్‌ డెలివరీ యూనిట్‌ హెపికాప్టర్‌ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్‌ విశ్వనాథ్‌ చెప్తున్నారు.
చదవండి: గంటల వ్యవధిలో ముగ్గురు.. తల్లి.. కొడుకు.. తండ్రి!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు