Coronavirus: సొంతంగా మందులు వాడేస్తున్నారు!

19 May, 2021 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వైద్యో నారాయణో హరి’.. అంటే, వైద్యులు దేవుడితో సమానమని! మరి అలాంటి వైద్యుల సలహాలు లేకుండానే కొందరు సొంతం వైద్యం చేసుకుంటూ ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ముంచుకొస్తున్న కరోనాను తప్పించుకునే క్రమంలో ముప్పును ‘కొని’తెచ్చుకుంటున్నారు..సొంత వైద్యం.. ప్రమాదానికి నేపథ్యం అని గ్రహించడంలేదు. ఎవరికివారు వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుందనో, ఎవరో తెలిసిన డాక్టర్‌ చెప్పారనో, ఈ మందులు తీసుకుంటే మంచిదంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందనో యాంటీ వైరల్, యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్‌తోసహా అన్నింటినీ పలువురు యథేచ్ఛగా వాడేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కాకముందే కొందరు వీటిని వాడుతుండటంతో అవసరమైన సమయంలో అవి వారిపై పనిచేయడం లేదు.

మల్టీవిటమిన్ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందనే అపోహలతో డాక్టర్ల సలహాలు లేకుండానే జింక్, విటమిన్‌ సి, డీ ట్యాబ్లెట్లను నెలల తరబడి తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా చేటు జరుగుతోందంటున్నారు వైద్యులు. ఈ మందుల వల్ల రకరకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడంతోపాటు కోవిడ్‌ బారి న పడినప్పుడుగానీ, అవసరమైనప్పుడుగానీ ఇవి పనిచేయకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా ఉధృతి  పెరుగుతున్న ప్రస్తుతదశలో ఈ మందుల వల్ల లాభానష్టాలు, ఆరోగ్యంపై చెడుప్రభావంపై.. ఏడాదికిపైగా కోవిడ్‌ చికిత్సలో నిమగ్నమైన వైద్యనిపుణులు ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యాంశాలు.. వారి మాటల్లోనే... 

వైద్యుల సూచనల మేరకే మందులను వాడాలి 
స్టెరాయిడ్స్‌ దుర్వినియోగం వల్లే ఇప్పుడు పేషెంట్లలో ‘ఇమ్యూనో కాంప్ర మైజేషన్‌’దశ నమోదవుతోంది. ప్రిస్క్రిప్షన్‌లో ఉన్నా.. ఆయాసం, దగ్గు లాంటివి వస్తేనే వీటిని వాడాలని హోం క్వారంటైన్‌ రోగులకు చెబుతున్నాం. ‘ఇమ్యూనో కాంప్రమైజేషన్‌’స్టేజ్‌కి వెళ్లే పేషెంట్లు బ్లాక్‌ ఫంగస్, మ్యూకోమైకోసిస్‌ అనే ఫంగస్‌కు సులభంగా ప్రభావితమవుతారు. స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్స్‌ వంటివి  వైద్యుల సూచనల మేరకే ఉపయోగించాలి. విచ్చలవిడిగా వాడటం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారు చాలామందే ఉన్నారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మెడికల్‌షాపుల నుంచి తెచ్చుకున్న డైక్లోఫినాల్‌ టాబ్లెట్లు వాడి కిడ్నీలు పోగొట్టుకున్నవారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు.

పెయిన్‌కిల్లర్‌గా ఈ టాబ్లెట్‌ను వాడేస్తున్నారే తప్ప సైడ్‌ ఎఫెక్ట్స్‌ను పట్టించుకోవడం లేదు. అనవసరంగా వాడటం వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, కాలేయం, కిడ్నీలు, ఇతర శరీరభాగాలు దెబ్బతినడం వంటి వి చోటు చేసుకుంటున్నాయి. డయాబెటీస్‌ తదితర పేషెంట్లలో సమస్యలు తీవ్రమవుతున్నాయి. దేశ ప్రజల్లో విటమిన్, కాల్షియం లోపాలున్నందున మల్టీ విటమిన్స్‌ వాడకం వల్ల ప్రయోజనమే తప్ప పెద్దగా నష్టం జరగదు. అయితే జింక్, సెలీయం వంటివి మోతాదు మించితే లివర్‌ను ప్రభావితం చేస్తాయి. – డాక్టర్‌ ప్రభుకుమార్‌ చల్లగాలి, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్, వృందశ్రీ క్లినిక్‌ 

అవసరం లేకున్నా వాడితే సెకండరీ కాంప్లికేషన్స్‌ వస్తాయి
ఏ మందుకైనా కొన్ని పరిమితులుంటాయి. యాంటీ బయోటిక్స్, మల్టీ విటమిన్స్‌ బిళ్లలు కూడా ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో డబుల్, ట్రిపుల్‌ డోసేజీలు తీసుకోవడం మంచిది కాదు. స్టెరాయిడ్స్‌ అనేవి రెండంచుల కత్తి వంటివి. వాటిని ఏ మేరకు వాడాలో అంత వాడితేనే ప్రయోజనం. అధికంగా ఉపయోగిస్తే.. బ్లాక్‌ ఫంగస్, మ్యూకర్‌ మైకోసిస్‌ వచ్చినప్పుడు ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. ఈ క్రమంలో మరో యాంటీ ఫంగల్‌ డ్రగ్‌ను ఉపయోగిస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అవసరం లేకపోయినా వాడడం వల్ల సెకండరీ కాంప్లికేషన్స్‌ వస్తున్నాయి. రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారిలో పన్ను దగ్గర నొప్పి, సైనెస్‌ నొప్పి, నమలడానికి ఇబ్బంది, జ్వరం, దగ్గు, సైనసైటీస్‌ వంటి వాటి ద్వారా ఇవి బయటపడుతున్నాయి. డయాబెటీస్‌ కంట్రోల్‌లో లేనివారు, ఆటోఇమ్యూన్‌ డిజార్డర్స్‌ ఉన్నవారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. స్టెరాయిడ్స్‌ షుగర్‌ను పెంచడంతోపాటు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి, బ్లాక్‌ ఫంగస్‌ రావడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చినా, లక్షణాలు లేకున్నా ఫాబిఫ్లూ వాడటం వల్ల లివర్, కిడ్నీలపై ప్రభావం పడుతుంది. – డాక్టర్‌ ఎ.నవీన్‌రెడ్డి, జనరల్‌ మెడిసిన్, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, నవీన్‌రెడ్డి ఆసుపత్రి 

దుర్వినియోగమవుతున్న అజిత్రోమైసిన్‌..
‘ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో అజిత్రోమైసిన్‌ అనేది ఎక్కువగా దుర్వినియోగమవుతోంది. ఆసుపత్రిలో చేరే వరకు యాంటీ బయోటిక్స్‌ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, యాంటీ వైరల్, యాంటీ పారాసైట్‌ మందులన్నీ కూడా పాజిటివ్‌ రావడానికి ముందే వాడాల్సిన అవసరం లేదు. అలా వాడితే ప్రయోజనం ఉండదు. యాంటీ బయోటిక్స్‌ అవసరం లేకపోయినా, బ్యాక్టీరియల్‌ ఇన్షెక్షన్లు సోకక ముందే వాడితే శరీరంలో వాటి రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. అవసరమైనప్పుడు ఈ మందులు పనిచేయకుండాపోతాయి. ఫ్లాబి పిరవిర్‌ వంటి మందులను అవసరం లేకున్నా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి.

జింక్, విటమిన్‌ సీ, డీ మాత్రలను వైద్యుల సలహా లేకుండా నెలల తరబడి ఉపయోగించడం వల్ల లాభం లేకపోగా చేటు చేస్తాయి. విటమిన్‌ సప్లిమెంట్ల బదులు మంచి బలవర్థకమైన ఆహారం, పోషక విలువలున్న వాటిని తీసుకుంటే మంచిది. ఎవరో చెప్పారనో, ఇది మంచిదేగదా అని ఏది పడితే అది వాడటం సరికాదు. అవసరం లేకపోతే ఏ టాబ్లెట్‌ మంచిది కాదు. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి తదితరాలు అన్నింటికీ సర్వ ఔషధంగా భావించే పారాసిటమల్‌ బిళ్ల కూడా అవసరం లేకుండా ఎక్కువ వాడితే లివర్‌పై ప్రభావం పడుతుంది.  – డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు

మరిన్ని వార్తలు