యజమానుల్లో ‘టులెట్‌’ గుబులు

29 Aug, 2020 03:45 IST|Sakshi

కరోనా దెబ్బకు ‘గ్రేటర్‌’లో భారీగా ఇళ్లు, షాపులు ఖాళీ

ఈఎంఐలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో యజమానుల సతమతం

ఉప్పల్‌లో ఉంటున్న భీమన్న ఓ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సరిపోక అప్పు చేసి మరీ పెద్ద ఇల్లు కొని నాలుగు పోర్షన్లుగా మార్చి అద్దెకిచ్చాడు. ఆ అద్దెతో నెలవారీ ఈఎంఐ కట్టుకోవచ్చనే ధీమానే రెండేళ్లుగా ఆయన్ను నడిపించింది. అయితే కరోనా మహమ్మారితో అంతా తల్లకిందులైంది. మూడు పోర్షన్లలో కిరాయిదారులు ఖాళీ చేయడంతో ఇప్పుడు బ్యాంక్‌ లోన్, అప్పులు కట్టేందుకు సతమతమవుతున్నాడు.

చాదర్‌ఘాట్‌లో గతంలో అద్దెకు షాపు కావాలంటే విపరీతమైన డిమాండ్‌ ఉండేది. రూ. లక్షల్లో అడ్వాన్స్‌ కడతామన్నా అనువైన ప్రాంతంలో అద్దెకు దుకాణం దొరికేది కాదు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఓ షాపును నడుపుతున్న వారు పెద్దగా వ్యాపారం జరగట్లేదని ఖాళీ చేస్తామని చెప్పగా యజమాని మాత్రం సగం అద్దె ఇచ్చినా పర్వాలేదు కానీ ఖాళీ మాత్రం చేయొద్దని బతిమిలాడుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సొంతిళ్లు, షాపుల యజమానులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పోర్షన్లను అద్దెకివ్వడం ద్వారా వచ్చే సొమ్ముతో దర్జాగా బతికిన పరిస్థితి నుంచి ఇప్పుడు కిరాయిదారుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘టులెట్‌ బోర్డు’లతో కాలం వెళ్లబుచ్చాల్సిన రోజులొచ్చాయని వాపోతు న్నారు. బ్యాంకు రుణాలతో కట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితి తారుమారు: గతంలో డిమాండ్‌ ఉన్న ఏరియాలు, అన్నింటికీ అందుబాటులో ఉన్న ప్రాంతా ల్లోని ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనంగా ఉండేది. అద్దె ఇళ్ల కోసం  రెంటల్‌ ఏజెన్సీలపై కూడా కిరాయిదారులు ఆధారపడాల్సి వచ్చేది. పైగా ఓనర్లు పెట్టే ఆంక్షలు, నిబంధనలు అంగీకరించాల్సి వచ్చేది. పొద్దుపోయాక రావొద్దు.. బంధువులను పిలవకూడదు.. నీళ్ల ట్యాంకును రోజుకొకసారే నింపుతాం... ఇలా అనేక షరతులకు లోబడి అద్దెకున్న వారు ఉండేవారు.

అయితే ఎప్పుడైతే కరోనా నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిందో అప్పటి నుంచి ఇంటి ఓనర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు కోల్పోయి సరైన ఆదాయం రాని వారు, చిన్నాచితకా వ్యాపారాలు చేసే వారు అద్దె కట్టే పరిస్థితులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లారు. హైదరాబాద్‌లో ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రానందున వారిలో చాలా మంది తిరిగి నగరానికి వచ్చేందుకు జంకు తున్నారు. స్వగ్రామాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. దీంతో ఇళ్ల యజమానుల పరిస్థితి తారుమారైంది. నెలవారీ అద్దెలు రాకపోవడంతో గతంలో తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నారు.

సగం అద్దె ఇచ్చినా ఓకే: ఇప్పుడు కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వేచిచూడాల్సిన రోజులొచ్చాయి. దీంతో ఎవరైనా ఖాళీ చేస్తామని సూచనప్రాయంగా చెప్పినా యజమానులు కంగారుపడుతున్నారు. సగం అద్దె ఇచ్చినా పరవాలేదని బతిమాలుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి.

మరిన్ని వార్తలు