కరోనా పడగ నీడ

2 Aug, 2020 08:22 IST|Sakshi

‘కరోనా’ వైరస్‌ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా ఈ మహమ్మారి తాకిడి నుంచి తేరుకోలేదు. ‘లాక్‌డౌన్‌’, ‘అన్‌లాక్‌’ ప్రక్రియలు ఎలా ఉన్నా, దేశంలో పండుగ పబ్బాల సందడి దాదాపు కనిపించకుండా పోయింది. పండుగల వేళ పిల్లలకు ఆటవిడుపు లేకుండాపోయింది. ఇళ్లకు బంధుమిత్రుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే అన్నట్లుగా జనాలు ఒంటరిద్వీపాల్లా బతుకులీడుస్తున్నారు. ‘కరోనా’ మహమ్మారి దెబ్బకు సామాజిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. సహజంగా సంఘజీవులైన మనుషులకు ఈ పరిస్థితి మింగుడుపడనిదిగా ఉంటోంది. మనుషుల సామాజిక, మానసిక పరిస్థితులపై ‘కరోనా’ మహమ్మారి ప్రభావాన్ని గురించి ఒక పరిశీలన...

‘కరోనా’ వైరస్‌ చైనాను అతలాకుతలం చేస్తున్న వార్తలు ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చాయి. మన దేశంలో తొలి కేసు కేరళలో జనవరిలోనే నమోదైంది. ఇది జరిగిన రెండు నెలలకు పరిస్థితి అదుపుతప్పే సూచనలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఐదు విడతల లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ 8న మొదటి విడత ‘అన్‌లాక్‌’ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలో ‘కరోనా’ కేసులు ఆరు లక్షలు దాటిన తర్వాత జూలై 1న రెండో విడత ‘అన్‌లాక్‌’ ప్రక్రియ మొదలైంది. కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ అమలులో ఉండగానే ప్రధానమైన పండుగల్లో చాలా గడిచిపోయాయి. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, రథయాత్ర వంటి ప్రధానమైన పండుగలన్నీ కళాకాంతులు లేకుండాగానే జరిగిపోయాయి.

రేపు రాబోయే రాఖీ పూర్ణిమతో పాటు ఏటా అట్టహాసంగా జరిగే వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు కూడా పెద్దగా సందడి లేకుండానే, జనాలు నామమాత్రంగా జరుపుకొనే సూచనలే కనిపిస్తున్నాయి. వచ్చేనెలలో జరగనున్న వినాయక నవరాత్రులకు సంబంధించి పలుచోట్ల ఇప్పటి నుంచే ఆంక్షలు కూడా మొదలయ్యాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా వీధుల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులకు మించరాదని, ఇళ్లల్లో పూజించే విగ్రహాల ఎత్తు రెండడుగులకు మించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

నవరాత్రులు పూర్తయిన వెంటనే విగ్రహాలను నిమజ్జనం చేయకుండా, వచ్చే ఫిబ్రవరిలో రానున్న ‘మాఘి గణేశ చతుర్థి’ రోజున లేదా వచ్చే ఏడాది వినాయక నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయాలని ఆదేశించింది. వీధుల్లో ఏర్పాటు చేసే బహిరంగ మండపాలకు వచ్చే జనాలు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రుల వేడుకలపై కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

పండుగపబ్బాలు, వేడుకలపై ఆంక్షలు వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ‘కరోనా’ వ్యాక్సిన్‌ జనాలకు అందుబాటులోకి వచ్చి, మహమ్మారి పరిస్థితులు సద్దుమణిగేంత వరకు జనాలు ధైర్యంగా బహిరంగ వేడుకలు జరుపుకొనే పరిస్థితులు లేవు. పెద్దలు కొంతలో కొంతవరకు ఈ పరిస్థితులకు ఎలాగోలా సర్దుకుపోతున్నా, పిల్లలు మాత్రం నిరాశ చెందుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలే కాదు, ఇదివరకటిలా తోటి పిల్లలతో వీధుల్లో ఆడుకునే పరిస్థితులూ లేకపోవడంతో దిగులుతో కుంగిపోతున్నారు.

పెరుగుతున్న మానసిక సమస్యలు
‘కరోనా’ వైరస్‌ ఉధృతి కంటే, దీని పర్యవసానంగా తలెత్తిన లాక్‌డౌన్, మనుషుల మధ్య భౌతికదూరం, అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక మరింతగా పెరుగుతున్న రోగుల సంఖ్య వంటి పరిణామాలు మనుషుల్లో మానసిక సమస్యలను పెంచుతున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగా మనుషుల్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముందే అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడంతో ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇంకొందరు ఉద్యోగాల్లో కొనసాగుతున్నా, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని భయంతో బితుకుబితుకుమంటున్నారు.

మహమ్మారి కారణంగా అనుకోకుండా వచ్చిపడ్డ ఆర్థిక సమస్యల నుంచి ఎప్పటికి గట్టెక్కుతామో తెలియని ఆందోళనతో చాలామంది దిగులుతో కుంగిపోతున్నారు. గత ఏడాది చివర్లో చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి దావానలంలా దేశదేశాలకు వ్యాపించింది. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రక్రియ మొదలైన సుమారు నెల్లాళ్ల వ్యవధిలోనే 26.4 కోట్ల మంది మానసిక కుంగుబాటుకు లోనైనట్లు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) మే 14న విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. 

మన దేశంలో ఇదీ పరిస్థితి
మహమ్మారి కాలంలో మన దేశంలో ప్రజల మానసిక పరిస్థితులపై ఒక చిన్న ఉదాహరణ. ‘కారిటాస్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత ఏప్రిల్‌లో ఒక హెల్ప్‌లైన్‌ నంబరును ప్రారంభించింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు పలువురు ఈ నంబరుకు కాల్‌ చేశారని, వారిలో ఏడేళ్ల చిన్నారులు మొదలుకొని ఎనభయ్యేళ్లు పైబడిన వృద్ధుల వరకు ఉన్నారని ‘కారిటాస్‌ ఇండియా’ వెల్లడించింది. ఎక్కువ కాల్స్‌ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారివేనని, అస్సాం, బీహార్‌ తదితర ప్రాంతాల నుంచి కొద్ది మంది నిత్యావసరాలు, మందులు పంపాలని కూడా ఫోన్‌ చేసినవారు ఉన్నారని ‘కారిటాస్‌ ఇండియా’ వాలంటీర్‌ ఒకరు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమకు కాల్స్‌ వస్తుంటాయని, కాల్స్‌ వచ్చిన ప్రాంతాలకు చెందిన తమ ప్రతినిధులను అప్రమత్తం చేసి, ఆందోళనతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇస్తుంటామని వివరించారు. ‘లాక్‌డౌన్‌’ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటి ‘అన్‌లాక్‌’ ప్రక్రియ కొనసాగుతున్న రోజుల వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య దాదాపు 20 శాతానికి పైగా పెరిగినట్లు ‘ఇండియన్‌ సైకియాట్రీ సొసైటీ’ (ఐపీఎస్‌) వెల్లడించింది. అంతేకాదు, ‘కరోనా’ మహమ్మారి ఫలితంగా దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిపింది.

మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోవడం, జీవన భద్రత కొరవడటం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి సమస్యలు చాలామందిలో మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు కలిగిస్తున్నాయని, అక్కడక్కడా కొద్దిమంది వ్యాధి సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై వార్తలు వెలువడుతున్నాయని, దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ లా అండ్‌ పాలసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సౌమిత్రా పథారే చెబుతున్నారు. మన దేశంలో మానసిక సమస్యల తీవ్రత ‘కరోనా’ తాకిడికి ముందు నుంచే ఉంది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘లాన్సెట్‌’ అధ్యయన నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చేమో గాని, వారిలో సమస్యలేవీ లేవని తోసిపుచ్చలేమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. 

‘లాన్సెట్‌’ నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలో దాదాపు 19.73 కోట్ల మంది రకరకాల మానసిక వ్యాధులతో ఉన్నారు. వీరిలో దాదాపు 4.57 కోట్ల మంది డిప్రెషన్‌తోను, 4.49 కోట్ల మంది యాంగై్జటీ సమస్యలతోను సతమతమవుతున్నారు. ‘కరోనా’ మహమ్మారి తాకిడి కారణంగా ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య మరో ఇరవై శాతానికి పైగా పెరిగినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో కనీసం 15 కోట్ల మందికి సత్వర మానసిక చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌’ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దురదృష్టకరమైన విషయమేమిటంటే మన దేశంలోని మెజారిటీ జనాభాకు సరైన మానసిక చికిత్స లభించే అవకాశాలు అందుబాటులో లేవు. నగర, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మానసిక వైద్య నిపుణుల సంఖ్య చాలినంతగా లేదు. మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే చొరవ కూడా మన జనాభాలో చాలామందికి లేదు. రకరకాల భయాలు, అపోహల కారణంగా తమ ఇంట్లో ఎవరికైనా మానసిక సమస్యలు తలెత్తినా, మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లేందుకు వెనుకాడే జనాలే ఎక్కువ. దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం
‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ‘యాక్సెస్‌ మీడియా ఇంటర్నేషనల్‌’ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయమేదీ లేని పరిస్థితుల్లో వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడిచారు.

చిన్నా చితకా వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలామంది గిరాకీల్లేక వ్యాపారాలను మూసేసుకున్నారు. ‘కరోనా’ దెబ్బకు మూతబడిన వ్యాపారాల్లో చిన్న చిన్న టీస్టాల్స్‌ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్‌ వంటివి కూడా ఉన్నాయి. కొన్ని దుకాణాలను తెరిచినా, ఇదివరకటి స్థాయిలో గిరాకీల్లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిలోనూ చాలామందికి జీతాల్లో కోతలు పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. 

రవాణా వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం మరో ఆరునెలల వరకు ఉన్నచోటును విడిచి ప్రయాణాలకు బయలుదేరేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. కోరుకుంటే విదేశాలకు విమానాల్లో వెళ్లగలిగే స్థోమత ఉన్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలో సైతం దాదాపు 35 శాతం మంది మరో ఆరునెలల వరకు విమాన ప్రయాణాల జోలికి వెళ్లబోమని కరాఖండిగా చెబుతున్నారు. వీరంతా రూ.12 లక్షలకు పైబడిన వార్షికాదాయం గలవారేనని ‘యాక్సెస్‌ మీడియా ఇంటర్నేషనల్‌’ వెల్లడించింది. మెరుగైన ఆదాయం గల సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే, ‘కరోనా’ ధాటికి సామాన్యుల బతుకులు ఇంకెంతలా చితికిపోయాయో ఊహించుకోవాల్సిందే!

అధిగమించడం ఎలాగంటే...
‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించని పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తలెత్తే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. తోటి పిల్లలతో కలసి మెలసి ఆడుతూ పాడుతూ గడపడం ద్వారానే పిల్లలు మానవసంబంధాలను మెరుగుపరచుకుంటారు. ఇళ్లల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, ఇంట్లో ఉండే తాత బామ్మలు వంటి వారితో తమ భావాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. మనుషులకు దూరమయ్యే పరిస్థితుల్లో వారు వస్తువులకు దగ్గరవుతారు. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వంటి వాటితోనే ఎక్కువగా కాలక్షేపం చేయడం మొదలుపెడతారు. ‘లాక్‌డౌన్‌’ పరిస్థితులు ఇంటిల్లిపాదీ ఒకేచోట చేరి కాలం గడిపే పరిస్థితిని తీసుకొచ్చింది.

తల్లిదండ్రులు పూర్తిగా  ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’లో మునిగిపోకుండా పిల్లలతో కబుర్లు చెప్పడం, ఆటలాడటం చేస్తున్నట్లయితే, వాళ్లల్లో ఒంటరితనం దూరమవుతుంది. ‘కరోనా’ ఫలితంగా ఉపాధి పోవడం, ఉద్యోగాల్లో అభద్రత వంటి పరిస్థితులు చాలామందిలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచుతున్నాయి. ‘కరోనా’ తర్వాత మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. రోగ నిరోధకత పెంచుకునేందుకు పోషకాహారంతో పాటు విటమిన్‌–సి, విటమిన్‌–డి మాత్రలు తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. అప్పటికీ మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, కుంగుబాటు ఇబ్బందిపెడుతున్నట్లయితే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే. – డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై .. మానసిక వైద్య నిపుణులు,  ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్‌ 

మరిన్ని వార్తలు