నేడే తొలి టీకా..

16 Jan, 2021 08:13 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: దాదాపు పది నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి విముక్తి లభించనుంది. జిల్లాలో శనివారం కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు రంగం సిద్ధమైంది. తొలిరోజు తొమ్మిది ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఒక్కో సెంటర్‌లో 30 మందికి చొప్పున వైద్య ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నారు. టీకాకు అవసరమైన 119 వ్యాక్సిన్‌ వాయిల్స్‌ని ఆయా ఆస్పత్రులకు శుక్రవారం పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. ఈ కేంద్రాల్లో ఐస్‌ లెర్న్‌డ్‌ రిఫ్రిజిరేటర్ల (ఐఎల్‌ఆర్‌)లో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ నిల్వ ఉంచారు.

ఒక్కో వాయిల్‌ ద్వారా 10 మందికి టీకా వేయవచ్చని అధికారులు తెలిపారు.  ప్రారంభించనున్న మోదీ.. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో నార్సింగి ఆర్‌హెచ్‌సీలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఆస్పత్రుల్లో మోదీ ఈ విధానంలో  ఆరంభిస్తుండగా.. ఇందులో మన జిల్లాలోని నార్సింగి ఆస్పత్రి ఒకటి కావడం విశేషం. అలాగే ఇక్కడి సిబ్బందితో మోదీ మాట్లాడనున్నారు. ఇక్కడ టీకా పంపిణీ మోదీ చేతుల మీదుగా ప్రారంభంకాగానే.. మిగిలిన 8 కేంద్రాల్లో మొదలుపెడతారు. తొలిరోజు టీకా వేయించుకునే వారికి ఇప్పటికే సమాచారం చేరవేశారు.  

వ్యాక్సిన్‌ వేసే కేంద్రాలు

  1. కొండాపూర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి 
  2. వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రి 
  3. ఇబ్రహీంపట్నంలోని సీహెచ్‌సీ 
  4. షాద్‌నగర్‌లోని సీహెచ్‌సీ 
  5. మైలార్‌దేవ్‌పల్లి పీహెచ్‌సీ 
  6. హఫీజ్‌పేట యూహెచ్‌సీ 
  7. ఆమనగల్లు యూపీహెచ్‌సీ 
  8. మొయినాబాద్‌ పీహెచ్‌సీ 
  9. నార్సింగి ఆర్‌హెచ్‌సీ 

సమయం: ఉదయం 10.30 గంటల నుంచి 

కేంద్రాల సంఖ్య పెంచుతాం..
తొలి రోజు టీకా అందజేతకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఒక్కో ఆస్పత్రిలో 30 మందికి చొప్పున 9 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేస్తారు. టీకా అనంతరం ప్రతి ఒక్కరూ కేంద్రంలో అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటే చికిత్స అందిస్తారు. ఇందుకు సంబంధించిన కిట్స్‌ అందుబాటులో ఉన్నాయి. సీరియస్‌ కండిషన్‌ ఉంటే.. పైఆస్పత్రులకు వెంటనే తరలిస్తారు. వారంలో ఆరు రోజులపాటు టీకా అందజేస్తారు. సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను క్రమంగా పెంచుతాం.  – అమయ్‌కుమార్, కలెక్టర్‌ 

మంచి జరుగుతుందని..
మొయినాబాద్‌ పీహెచ్‌సీలో మొదటి టీకా తీసుకుంటున్నా. అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మేమే ముందుంటున్నాం. మండల వైద్యాధికారిగా ఉన్న నేనే మొదటగా టీకా తీసుకుంటే మా సిబ్బందికి ధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది. మొదటి టీకా తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నా.. మరో పక్క కాస్త భయంగా కూడా ఉంది.  – డాక్టర్‌ రోహిణి, మండల వైద్యాధికారి, మొయినాబాద్

మొదటి టీకా మాకు ఇవ్వడం ఆనందంగా ఉంది 
కరోనా మహమ్మారి బారినపడి 20 రోజులు తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే క్రమంలో నిరంతరం పనిచేసినందుకు మొదటి టీకా మాకే ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు పడిన శ్రమ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు తమ సేవలను గుర్తించటంతోపాటు వాక్సిన్‌ను ముందుగా మాకే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మనో నిబ్బరాన్ని పెంచుతుంది. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – జయమ్మ, ఏఎన్‌ఎం, నార్సింగి ఆరోగ్య కేంద్రం 

వ్యాక్సినేటర్‌గా గర్వపడుతున్నా.. 
కరోనా మహమ్మారి సోకకుండా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని గండిపేట మండలంలో నాకు అప్పగించారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మండల ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించిన మాకు మహమ్మారిని పారదోలే వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశం రావటం ఆనందంగా ఉంది. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతో మాట్లాడనున్నారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. – తేజ, వ్యాక్సినేటర్, నార్సింగి ఆరోగ్య కేంద్రం 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు