టీకాపై అనుమానం వద్దు..

16 Jan, 2021 08:33 IST|Sakshi

దాదాపు 11 నెలలుగా పట్టి పీడించి.. మనుషుల జీవన గతినే మార్చేసి.. బంధాలు.. అనుబంధాలను దూరం చేసి.. ఆర్థిక రంగాన్ని కుంగదీసి.. ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసి.. అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బతీసి.. ఎన్నో..ఎన్నెన్నో వెతలకు..వ్యథలకు కారణమైన కోవిడ్‌–19 వైరస్‌కు చెక్‌ పెట్టే గడియ వచ్చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ వేదికగా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రేటర్‌లో తొలి టీకాను గాంధీ ఆస్పత్రిలోని పారిశుద్ధ్య ర్మికునికి ఇస్తారు. ఆ తర్వాత మహానగర వ్యాప్తంగా మొత్తం 33 సెంటర్లలో వెయ్యి మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. ఇందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక గాంధీ 
ఆస్పత్రి, నార్సింగ్‌ యూపీహెచ్‌సీల్లో టీకా వేయించుకున్న వారితో ప్రధాని మోదీ  మాట్లాడుతారు. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇలా.. 
గ్రేటర్‌లో ఒక్కో వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో మూడు గదులను సిద్ధం చేశారు. ప్రవేశ, నిష్కమణ ద్వారాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్‌లో ఐదుగురు (పోలీసు, టీచర్‌/ఏఎన్‌ఎం/ కంప్యూటర్‌ ఆపరేటర్‌/ స్టాఫ్‌ నర్సు, డాక్టర్‌) సిబ్బంది చొప్పున విధులు నిర్వహించనున్నారు.  

స్టేజ్‌–1: సెంటర్‌ ప్రధానగేటులో పోలీసు కానిస్టేబుల్‌/హోంగార్డు/ సెక్యూరిటీ స్టాఫ్‌ ఉంటారు. వీరు కేంద్రానికి చేరుకున్న లబ్ధిదారుల గుర్తింపు కార్డు, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి, లోనికి అనుమతిస్తారు.  
స్టేజ్‌–2: సెంటర్‌ ప్రధాన ప్రవేశ ద్వారంలో రిజిస్ట్రేషన్‌ కోసం కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉంటారు. వీరు కోవిన్‌ పోర్టల్‌లో లబ్ధిదారుని పేరు ఉందో? లేదో చెక్‌ చేసి, ఫోన్‌కు ఓటీపీ వచ్చిందో లేదో చూసి రెండో గదిలోకి పంపిస్తారు.
స్టేజ్‌–3: ప్రభుత్వ ఉపాధ్యాయుడు /ఆశావర్కర్‌ ఉంటారు. వీరు వచ్చిన వారిని గదిలో ఓ క్రమ పద్ధతిలో కూర్చొబెడతారు. శానిటైజ్‌ చేసుకున్నారా? మాస్క్‌ ధరించారా? లేదా? సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా వంటి అంశాలను వీరు పర్యవేక్షించనున్నారు. 
స్టేజ్‌–4: పీపీఈ కిట్లు ధరించిన స్టాఫ్‌నర్సు/ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటారు. వీరు వచ్చిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తారు.
స్టేజ్‌‌–5: డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌/అబ్జర్వర్‌ ఉంటారు. వీరు టీకా వేయించుకున్న వారిని గదిలో 30 నిమిషాల పాటు ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఏదైనా అనుకోని సమస్యలు తలెత్తితే వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ, టిమ్స్‌ వంటి కోవిడ్‌ సెంటర్లకు పంపి, అక్కడే వారికి వైద్య సేవలు అందించనున్నారు. 

నిమ్స్‌లో గవర్నర్‌ చేతులమీదుగా.. 
నిమ్స్‌లోని కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం డయాలసిస్‌ సెంటర్‌ను సిద్ధం చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాక్సినేషన్‌ను ఇక్కడ ప్రారంభించనున్నారు.  నిమ్స్‌లో 30 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బందికి వేయనున్నారు. ఇదిలా ఉండగా టీకా కార్యక్రమంపై తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. 

తొలి రోజు వ్యాక్సిన్‌ వేసేది ఇక్కడే..! 
తొలి రోజు గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి, నిమ్స్, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఆమన్‌నగర్, పాల్‌దాస్, తిలక్‌నగర్, సూరజ్‌భాను, యూపీహెచ్‌సీలు, నాంపల్లి, మలక్‌పేట, గోల్కొండ ఏరియా, కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రుల్లో .. 

రంగారెడ్డిజిల్లాలో నార్సింగ్‌ ఆరోగ్య కేంద్రం, వనస్థలిపురం, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రులు, ఆమన్‌గల్, హఫీజ్‌పేట్, ఇబ్రహీంపట్నం, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్, షాద్‌నగర్‌ పీహెచ్‌సీల్లో..  

⇔ మేడ్చల్‌ జిల్లాలో అల్వాల్, బాలానగర్, కీసర, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, మల్లాపూర్, నారపల్లి, శామీర్‌పేట్, షాపూర్‌నగర్, ఉప్పల్, వెంకట్‌రెడ్డినగర్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో..  

 తొలి ముగ్గురు లబ్ధిదారుల్లో ఒకరితో ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ వేదికగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత 18 వ తేదీ నుంచి యథావిధిగా మిగిలిన సెంటర్లలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతలో టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు వేయనున్నారు. 

అనుమానం వద్దు 
కోవిడ్‌ టీకాపై ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదు. వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమైంది. అన్ని పరీక్షల తర్వాతే అందుబాటులోకి తెచ్చింది. స్వల్ప జ్వరం, కొద్దిపాటి నొప్పి, వాపు మినహా భయపడేంత సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం మన అదృష్టంగా భావించాలి. వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలుఅవసరం లేదు. వదంతులు నమ్మొద్దు. హెల్త్‌కేర్‌ వర్కర్లంతా విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి.      

ఉదయం 10.30 గంటలకు ముహూర్తం 
⇔ గాంధీ, నార్సింగ్‌ పీహెచ్‌సీల్లో ప్రధాని మోదీ వర్చువల్‌ స్పీచ్‌ ద్వారా ప్రారంభం 
 గ్రేటర్‌లో తొలిరోజు 33 సెంటర్లలో వెయ్యి మందికి టీకా 
 తొలి టీకా పారిశుద్ధ్య కార్మికునికి.. రెండోది ఏఎన్‌ఎం..మూడోది డాక్టర్‌కు... సర్వం సిద్ధం చేసిన అధికారులు

మరిన్ని వార్తలు