కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే

24 Feb, 2022 14:35 IST|Sakshi
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు

గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు

మరో వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువ

పూర్తిస్థాయిలో ముప్పు తొలగిపోలేదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి ఇకపై వేవ్‌ రూపంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వేరియంట్లు మాత్రం ఉంటాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫస్ట్, సెకెండ్‌ వేవ్‌లలో విశ్వరూపం చూపించిన కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ నాటికి బలహీన పడిందన్నారు. గత పాండమిక్‌లు, వైరస్‌ల చరిత్ర పరిశీలిస్తే మూడు వేవ్‌ల తర్వాత వైరస్‌లు వివిధ రకాలుగా రూపాంతరం చెంది, కొంతమేర శక్తి కోల్పోయి బలహీన పడినట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తేలిందన్నారు. 

ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో ప్రాణనష్టం జరిగిందని, థర్డ్‌వేవ్‌లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత బలహీనమైనదిగా నిర్ధారణ అయిందన్నారు. వైరస్‌లు కొంతకాలం తర్వాత రూపాంతరం చెంది బలహీన పడతాయని, కొన్ని సందర్భాల్లో మాత్రం మరింత బలపడి విజృంభిస్తుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌ టీకా అందుబాటులోకి రావడం, వైరస్‌పై అవగాహన కలగడం, రోగనిరోధకశక్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కోవిడ్‌ వైరస్‌ తన ప్రభావాన్ని కొంతమేర కొల్పోయినట్లు భావించవచ్చన్నారు. (క్లిక్‌: తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..)

గాంధీ ఆస్పత్రిలో ప్రస్థుతం 31 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్‌ డిశ్చార్జీలు కొనసాగుతుండగా, అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. మూడు వేవ్‌ల్లో వేలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందన్నారు. పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని, వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. (క్లిక్‌: ఓయూలో అబ్బాయిల హాస్టల్‌..  అమ్మాయిలకు!)

మరిన్ని వార్తలు