Coronavirus:‘ప్లాస్మా’ థెరపీతో లాభం సున్నా!

17 May, 2021 08:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మొదలైన కొత్తలో ప్లాస్మా థెరపీ తెరపైకి వచ్చింది. కోవిడ్‌ సోకి తగ్గినవారి ప్లాస్మా ఇతర రోగులను కాపాడుతుందని, అది అపర సంజీవని అన్నంతగా ప్రచారం పొందింది. కరోనా గురించి పెద్దగా ఏమీ తెలియని సమయంలో ప్లాస్మా థెరపీని ఆశాకిరణంగా భావించారు. కోవిడ్‌ చికిత్సలో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని ప్రభు త్వాలు కూడా ప్రకటించడం, ప్లాస్మా దానం చే యాలంటూ జరిగిన ప్రచారంతో దానికి ప్రాధా న్యత బాగా పెరిగిపోయింది.

అయితే ఇటీవల జరిగిన పలు ఉన్నత స్థాయి అధ్యయనాలు మాత్రం.. కోవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం శూన్యమని తేల్చాయి. అంతేకాదు ప్లాస్మా థెరపీ వల్ల కరోనా వైరస్‌ కొత్త మ్యూటెంట్లు తయారయ్యాయని, వైరస్‌ సామర్థ్యాన్ని పెంచుకుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో కోవిడ్‌ చికిత్సల కోసం అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించింది.

లాన్సెట్‌ అధ్యయనంలో..
ప్లాస్మా థెరపీ వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన దాఖలాలు లేవని యూకే మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తాజా అధ్యయనంలో తేల్చింది. బ్రిటన్‌లో గతేడాది మే 28 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 11,558 మంది రోగులను 2 కేటగిరీలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న 5,795 మందిలో 1,399 (24 శాతం) మంది మరణించగా.. ఇతర సాధారణ చికిత్స తీసుకున్న 5,763 మందిలో 1,408 (24 శాతం) మంది మరణించినట్టు గుర్తించారు. మెడికల్‌ వెంటిలేషన్‌ అవసరం విషయంలో కూడా ప్లాస్మా, సాధారణ చికిత్సల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు.

ఇంతకుముందే మన దేశంలో జరిగిన ఐసీఎంఆర్‌–ప్లాసిడ్‌ అధ్యయనం, అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్‌ ట్రయిల్స్‌ కూడా ప్లాస్మా థెరపీతో రోగులకు పెద్దగా లాభమేమీ లేదని తేల్చాయి. గత శుక్రవారం ఐసీఎంఆర్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కరోనా చికిత్సల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. త్వరలో ఆస్పత్రులకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

ప్లాస్మానే ‘ఫస్ట్‌’ చాయిస్‌
ఏదైనా వ్యాధి నుంచి కోలుకున్నవారి రక్తంలో ఆ వ్యాధిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ ఏర్పడుతాయి. రక్తంలోని ప్లాస్మాలో ఉండే ఈ యాంటీబాడీస్‌ను.. అదే వ్యాధితో బాధపడుతున్న రోగికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీగా పేర్కొంటారు. రోగికి ప్లాస్మా ఎక్కించగానే.. దానిలో అప్పటికే ఉన్న యాంటీబాడీలు వైరస్‌తో పోరాటం మొదలుపెడతాయి.

గతంలో మందులకు కొరుకుడు పడని పలు వ్యాధుల చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడింది కూడా. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌ చికిత్సలోనూ ప్లాస్మా థెరపీని మొదలుపెట్టారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఏ చిన్న ఆధారం దొరికినా చాలు అన్న ఉద్దేశంతో పెద్దఎత్తున వినియోగించారు.

కొత్త మ్యూటెంట్లకు కారణమిదేనా?
ప్లాస్మా థెరపీ కోవిడ్‌ చికిత్సలో పనిచేయడం లేదంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది వైద్యరంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఇటీవల ఐసీఎంఆర్‌కు లేఖ రాశారు. భారత్‌లో కొత్త రకం కరోనా వేరియంట్లు విజృంభించడానికి ప్లాస్మా థెరపీ కూడా కారణమని వారు పేర్కొన్నారు. ఐసీయూలో చేరిన పేషెంట్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల.. అందులోని యాంటీబాడీస్‌ను ఎదుర్కొనేలా కరోనా వైరస్‌ కొత్త రూపాలు (మ్యూటెంట్లు) సంతరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రక్త పరీక్షలు కూడా చేయకుండానే ఐసీయూలో ఉన్న రోగులకు నేరుగా ప్లాస్మా ఇవ్వడం ప్రాణాంతకంగా పరిణమిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఈ థెరపీని అనధికారికంగా వినియోగించడం వల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాస్మా చికిత్స అంశాన్ని అత్యవసరంగా సమీక్షించి, ఆపేయాలని కోరారు. ఇటీవలి అధ్యయనాల ఫలితాలు, తాజాగా నిపుణుల లేఖ నేపథ్యంలో ప్లాస్మా థెరపీని పక్కనపెట్టాలని ఐసీఎంఆర్‌ నిర్ణయం తీసుకుంది.

అవగాహన అవసరం
సాధారణ కరోనా లక్షణాలకు ప్లాస్మా థెరపీ ఉపయోగం ఉండొచ్చు గానీ.. అప్పటికే ఆక్సిజన్, వెంటిలేట ర్‌పై వెళ్లినప్పుడు, క్రిటికల్‌ కేర్‌లో ఉన్నప్పుడు ఉపయోగం ఉండదు. గతంలో ఎబోలా చికిత్సలో కూడా ప్లాస్మా థెరపీని వా డారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక.. గతేడా ది దేశవ్యాప్తంగా 39 ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌ నిర్వహిస్తే.. ఫలితాలు అంత సంతృప్తికరంగా రాలేదు. ఇప్పుడు సెకండ్‌ వే వ్‌లో డబుల్‌ వేరియంట్స్‌ పెరగడానికి ప్లాస్మా థెరపీనే కారణమని.. వైరస్‌ రూపాంతరం చెంది, మరింత శక్తివంతంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అసలు ఫలితాలు సంతృప్తికరంగా లేనప్పుడు ట్రీట్‌ మెంట్‌ ప్రొటోకాల్‌ నుంచి ప్లా స్మా థెరపీని తీసేస్తే మంచిదని ఐసీఎంఆర్‌ భావిస్తోంది. మాకు ఇంకా గైడ్‌లైన్స్‌ రాలేదు. ఇప్పటికే ప్లాస్మా థెరపీ తీసుకున్నవారు, ప్రాసెసింగ్‌ ఉన్నవారికి.. వారి కండిషన్స్‌ బట్టి చికిత్స చేస్తాం. రెమ్‌డెసివిర్‌ గానీ, ప్లాస్మా థెరపీగానీ సెకండరీ చికిత్సలే. ఆక్సిజన్, స్టెరాయిడ్లకే ప్రాధాన్యం అవసరం. ఆక్సిజన్‌ స్థాయి తగ్గకుండా చూసుకుంటూ, డాక్టర్‌ సూచనలు పాటిస్తూ.. పౌష్టికాహారం తీసు కుంటూ, శ్వాసకోశ వ్యాయామాలు చేస్తుంటే 90శాతం మంది పూర్తిగా రికవరీ అవుతారు.    
– డాక్టర్‌ ఎస్‌ఏ రఫీ, 
కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్‌ 

 

మరిన్ని వార్తలు