చలి తీవ్రతతో కరోనా విజృంభణ

14 Nov, 2020 07:43 IST|Sakshi

ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరిక

వచ్చే మూడు నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

సాక్షి, హైదరాబాద్‌: చలి తీవ్రతతో కరోనా తీవ్రంగా విజృంభిస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. అందువల్ల వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విన్నవించారు. కరోనా టీకా సహా జనవరి, ఫిబ్రవరి నాటికి శాశ్వత వైద్య చికిత్స కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రోజుకు 8 వేల నుంచి 9 వేల కరోనా కేసులు, 80 నుంచి 90 వరకు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం, చలి వల్ల ఢిల్లీలో వైరస్‌ తీవ్రత ఉందని వెల్లడించారు. ‘అమెరికాలో 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. బాధ్యతారహితంగా ఉన్నచోట వైరస్‌ ఉధృతి పెరుగుతోంది. 90 శాతం వైరస్‌ వ్యాప్తికి కారణం ముక్కు, నోరే.. కాబట్టి మాస్క్‌ను ఆ రెండూ కవరయ్యే లా చూడాలి.

వాయు కాలుష్యం పెరిగితే గాలి కదలిక తగ్గుతుంది. ఇటువంటి సమయంలో వైరస్‌ వ్యాపిస్తుంది. దీపావళిని దీపాలతోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలి. బాణసంచా కాల్చవద్దు. ప్రజల వద్దకే పరీక్షల కోసం 310 మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. వీటి ద్వారా జనసమ్మర్థమున్న ప్రాం తాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వివిధ రకాల వ్యాధులకు వచ్చిన టీకాలు ఏవీ కూడా తక్కువ సమయంలో రాలేదు. ఏళ్ల తరబడి ప్రయోగాల ఫలితంగా అవి వచ్చాయి. ఇప్పుడు రాబోయే కోవిడ్‌ టీకాలు కూడా ఏ మేరకు సమర్థంగా పనిచేస్తాయో స్పష్టత లేదు. కాబట్టి టీకా కోసం ఎదురుచూడకుండా అందరూ  జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడతాయి..’అని ఆయన హెచ్చరించారు.

ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్‌..
వ్యాక్సిన్‌ జనవరి, ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని శ్రీనివాసరావు తెలి పారు. మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ఇస్తారన్నారు. 

నర్సుల వెయిటేజీ పరిశీలన కమిటీ రద్దు..
ఇక స్టాఫ్‌ నర్సుల భర్తీ ప్రక్రియలో వెయిటేజీ కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రస్తుత వెయిటేజీ పరిశీలన కమిటీని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు రద్దు చేశారు. బాధ్యతల నుంచి తొలగించిన వారికి మరే బాధ్యతలు కూడా అప్పగించలేదు. ఈ కమిటీ స్థానంలో నూతన కమిటీని నియమిస్తూ వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీలో సరోజినీదేవి ఆసుపత్రిలోని సహాయ సంచాలకుడు శ్రీహరి, ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోని సహాయ సంచాలకుడు సత్యచంద్రిక, ఉస్మానియా కళాశాలలో సహాయ సంచాలకుడు సోమశేఖర్‌లను నియమించారు. నర్సుల నియామకాల వెయిటేజీ ప్రక్రియను నూతన కమిటీ సభ్యులు మొదట్నుంచి పరిశీలిస్తారు.

మరిన్ని వార్తలు