కోవిడ్‌ దందా.. గుట్టు చప్పుడుగా కరోనా పరీక్షలు

28 Aug, 2020 09:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ‘కర్మన్‌ఘాట్‌కు చెందిన ఒక మహిళ గత నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతుంది. పక్కనే ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంతా అనుమానంతో తమను ఎక్కడ దూరం పెడతారో? అని భావించి ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌ని ఆశ్రయించింది. సదరు ఆస్పత్రిలోని ల్యాబ్‌ సిబ్బంది ఆమెకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు చేసి, కోవిడ్‌ లేదని నిర్ధారించాడు. టెస్టుకు రూ.3500 చార్జీ చేశారు. రిపోర్టు మాత్రమే కాదు.. కనీసం ఆస్పత్రి బిల్లు కూడా ఇవ్వలేదు. ఈ ఆస్పత్రి యాజమాన్యం ఇటీవలే కోవిడ్‌ చికిత్సలకు అనుమతి తీసుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అనుమతి లేదు. రిపోర్ట్‌లు జారీ చేస్తే దొరికి పోయే ప్రమాదం ఉండటంతో వాటిని ఇవ్వకుండా కేవలం నోటిమాట ద్వారా పాజిటివ్, నెగిటివ్‌ రిపోర్ట్‌లను చెప్పేస్తున్నారు... ఇలా ఒక్క ఈ నర్సింగ్‌ హోం మాత్రమే కాదు.. నగర శివారులోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో గుట్టు చప్పుడు కాకుండా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రూ.500 విలువ చేసే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్‌కు ఏకంగా రూ.3500 చార్జీ చేస్తుండటం గమనార్హం. 

ఇక్కడ తస్కరించి..అక్కడికి తరలించి 
కోవిడ్‌ నిర్ధారణలో ఖచ్చితత్వం కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ టెస్టులను ప్రామాణికంగా తీసుకుంది. గాంధీ సహా ఉస్మానియా, ఫీవర్, నిమ్స్, ఛాతి, డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్, ఈఎస్‌ఐసీ, సహా 16 ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌తో పాటు మరో 31 ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు ప్రైవేటులో రూ.2500 ధర నిర్ణయించింది. హోం సర్వీసుకు రూ.2800 ఛార్జీగా నిర్ణయించింది. విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో టెస్టుల కోసం సిటిజన్లు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరుతుండటం, రోగుల నిష్పత్తికి తగినన్ని టెస్టింగ్‌ కేంద్రాలు లేక పోవడం, రిపోర్ట్‌ జారీకి 48 గంటల సమయం పడుతుండటంతో టెస్టుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదే అంశంపై ఇటు హైకోర్టు సహా అటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగింది.

దీంతో ప్రభుత్వం జులై 8వ తేదీ నుంచి ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులను ప్రారంభించింది. ఫలితం కూడా అరగంటలో వస్తుండటంతో ప్రభుత్వం ఈ టెస్టింగ్‌ కేంద్రాలను విస్తరించింది. ఈ టెస్టులు చేసేందుకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే అనుమతి ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 1076 ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా, వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 97, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్‌ జిల్లాలో 87 ఆరోగ్య కేంద్రాల్లో ఈ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి రోజుకు సగటున 50 నుంచి 100 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న కొంత మంది మెడికల్‌ ఆఫీసర్లు, ల్యాబ్‌
టెక్నీషియన్లు గుట్టు చప్పుడు కాకుండా ఆయా కిట్లను సొంత క్లినిక్‌లకు తరలిస్తున్నారు.  

ప్రభుత్వానికి చిక్కకుండా... 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టులకు ఫోన్‌ నెంబర్, ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తే కానీ హెల్త్‌ పోర్టల్‌లో పేషంట్‌ నెంబర్‌ ఎంటర్‌ కాదు. ఈ హెల్త్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయించడం ద్వారా జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటి ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసి పోతుంది. యజమాని ఇళ్లు ఖాళీ చేయించే అవకాశం కూడా లేకపోలేదు. అందరికీ తెలిసే విధంగా టెస్టు చేయించుకోవడం కంటే గుట్టు చప్పుడు కాకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌తో పోలీస్తే ర్యాపిడ్‌ టెస్టులో రిజల్ట్‌ త్వరగా తెలిసిపోతుండటంతో ఎక్కువ మంది వీటికే మొగ్గు చూపుతున్నారు. రోగుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా క్లినిక్‌ల నిర్వాహకులు ఆసరాగా తీసుకుంటున్నారు. రూ.500 విలువ చేసే ర్యాపిడ్‌ కిట్లతో గుట్టుగా టెస్టు చేసి..వారి నుంచి రూ.3500 వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. చెల్లించిన బిల్లు తాలూకు రసీదు మాత్రమే కాదు..టెస్టుకు సంబంధించిన రిపోర్ట్‌ కూడా ఇవ్వడం లేదు. అదేమంటే..ఇక్కడ అంతేనని బుకాయిస్తున్నారు. వారితో గొడవకు దిగితే విషయం బయటికి తెలిసే ప్రమాదం ఉండటంతో వెనుతిరుగుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా