ప్రజల వద్దకే పరీక్షలు

30 Jul, 2020 05:28 IST|Sakshi
బుధవారం మొబైల్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి ఈటల

రంగంలోకి మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ 

ఇక విస్తృతంగా కరోనా టెస్టులు 

తొలుత హైదరాబాద్‌లో 20 మొబైల్‌ ల్యాబ్‌లు 

వీటిలో ఐసీయూ సదుపాయం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజల ముంగిటకే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మొబైల్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలను సిద్ధం చేసింది. వీటిని వైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమికంగా 20 మొబైల్‌ టెస్టింగ్‌ లేబొ రేటరీ బస్సులను సిద్ధం చేసింది. ముందుగా హైదరాబాద్‌ నగర ప్రజలకు వీటిని అందుబాటులోకి తెస్తా రు.

బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ బస్సులను ప్రారంభించారు. ఐదు డివిజన్లకు కలిపి ఒక బస్సు చొప్పున సిద్ధం చేశారు. తదనంతరం వైరస్‌ తీవ్రంగా ఉన్న జిల్లాల్లోనూ మొబైల్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలను అందుబాటులోకి తెస్తారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి కరోనా టెస్ట్‌లు చేయడానికి ఏర్పాట్లు చేయడంతో మున్ముందు మరిన్ని నిర్ధారణ పరీక్షలు చేయడానికి వీలు కలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజుకు 18 వేల వరకు చేస్తున్న పరిస్థితి ఉంది. 

చిన్నపాటి ఐసీయూ... నాలుగు ఆక్సిజన్‌ పడకలు 
‘వెర’స్మార్ట్‌ హెల్త్‌ సంస్థ రూపొందించిన ఇంటెలిజెన్స్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌ (ఐ–మాస్క్‌) టెక్నాలజీతో తయారు చేసిన ఈ వోల్వో బస్సుల్లో వెంటిలేటర్‌ సదుపాయం గల చిన్నపాటి ఐసీయూ ఉంది. ఆక్సిజన్‌ సదుపాయం గల నాలుగు పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి బస్సుకు అనుబంధంగా ఒక అంబులెన్స్‌ ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నవారిని వెంటిలేటర్‌ సదుపాయం గల ఈ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి బస్సులో 10 శాంపిల్‌ కలెక్షన్‌ కౌంటర్లు ఉంటాయి. పదిమంది టెక్నీషియన్లు బస్సు లోపల ఉండి, బయట ఉన్న వ్యక్తి గొంతు లేదా ముక్కు నుండి నమూనాలు సేకరిస్తారు.

కంటైన్మెంట్‌ జోన్లకు, కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ బస్సును తీసుకెళ్లి అనుమానితులందరికీ వెంటవెంటనే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్‌ వచ్చి, లక్షణాలున్నవారికి ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు ఆక్సిజన్‌ సదుపాయం గల అంబులెన్స్‌ల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తారు. ఈ అంబులెన్స్‌లో ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకొనే టెక్నాలజీ కూడా ఉండటం వల్ల, అక్కడకు తీసుకువెళ్లి వారి ప్రాణాలు కాపాడవచ్చు. దీనిద్వారా గోల్డెన్‌ అవర్‌ను పోకుండా చూస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

1,100 చోట్ల కరోనా పరీక్షలు: ఈటల 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,100 చోట్ల స్వాబ్‌ సేకరణ సెంటర్లు పెట్టి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠి కమాండ్‌ కంట్రోల్‌ రూం వద్ద మొబైల్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ బస్సులను బుధవారం ఆయన ప్రారంభించారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోని వారిని నిర్ధారణ పరీక్షల కేంద్రాలకు తీసుకెళ్లడం కష్టమవుతున్నందున, వారి వద్దకే మొబైల్‌ టెస్టింగ్‌ బస్సులను, అంబులెన్సులను పంపించి నమూనాలు స్వీకరించే వెసులుబాటు కల్పించామన్నారు. 80 శాతం మందిలో పాజిటివ్‌ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు ఉండవన్నారు. వారందరూ ఇంట్లోనే ఉండవచ్చన్నారు. వీరిని 104 ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు