విమానాలపై గల్ఫ్‌ నిషేధం

23 Dec, 2020 08:18 IST|Sakshi

అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపేసిన ఒమన్, సౌదీ, కువైట్‌

పలు దేశాల్లో కొత్త రకం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్ణయం

వారంపాటు రాకపోకలు బంద్‌.. అవసరమైతే పొడిగింపు!

మోర్తాడ్‌ (బాల్కొండ): కొత్త రకం కరోనా వైరస్‌ బ్రిటన్‌ సహా పలు దేశాల్లో విస్తరిస్తుండటంతో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్‌ అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. సోమవారం నుంచి వారంపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, ఒమన్‌ నిషేధం విధించగా జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కువైట్‌ తెలిపింది. అవసరమైతే నిషేధాన్ని మరో వారంపాటు పొడిగిస్తామని సౌదీ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌ నెలాఖరు నుంచి భారత్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపేసిన సౌదీ... తమ దేశం నుంచి భారత్‌ తిరిగి వెళ్లాలనుకొనే వారికి మాత్రం అనుమతించింది. తాజాగా వాటిపైనా నిషేధం విధించింది. (చదవండి: దేశానికి ‘గల్ఫ్‌’ కష్టాలు)

మరోవైపు ఒమన్‌లో క్షమాభిక్ష అమల్లో ఉన్న తరుణంలో విమాన సర్వీసులపై నిషేధంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒమన్‌లో చాలా సంవత్సరాల తరువాత క్షమాభిక్ష అమలు చేస్తుండటంతో అక్కడ చట్టవిరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు ఉంది. ఒమన్‌ ఆకస్మిక నిర్ణయంతో వారు ఇప్పట్లో స్వదేశానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఒమన్‌లో ఉపాధి పనులకు వీసాలు పొందినవారు కూడా ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లే పరిస్థితి లేదు.  

మరిన్ని వార్తలు