Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు

16 May, 2021 09:41 IST|Sakshi
గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ సిలిండర్స్‌ నుంచి ఆక్సిజన్‌ తీసుకుంటున్న రోగులు 

అడ్మిషన్‌ దొరికి చికిత్స మొదలయ్యేలోపు అవసరమైన రోగులకు ప్రాణవాయువు అందిస్తూ...

ఎస్‌డీఐఎఫ్, యాక్సెస్‌ ఫౌండేషన్, ఎస్‌బీఎంల సంయుక్త దాతృత్వం

గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్స్‌ ఏర్పాటు

47 కేజీల సామర్థ్యంతో గాంధీలో 15, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో మూడేసి సిలిండర్లు

రోజూ దాదాపు 170 మంది రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ..  

హిమాయత్‌నగర్‌: గాంధీ, కింగ్‌కోఠి (కేకేహెచ్‌), చెస్ట్‌ ఆసుపత్రులు నిత్యం కోవిడ్‌ పాజిటివ్‌ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బం ది కొరత కారణంగా అడ్మిషన్‌ సుమారు గంటవరకు ఆలస్యం అవుతుంది. ఎంతోమందికి అడ్మిషన్‌ దొరి కి బెడ్‌పైకి చేరేవరకూ ఆక్సిజన్‌ అందడం లేదు. ఈ ఆలస్యంతో ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్‌ సమయంలో అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించే విధానం లేదు. దీంతో ఇటు రోగులు, అటు రోగుల సహాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అడ్మిషన్‌ ఆలస్యంతో ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్‌ డేటా ఇన్‌షేటివ్స్‌ ఫోరం (ఎస్‌డీఐఎఫ్‌), యాక్సెస్‌ ఫౌండేషన్, సఫియా బైత్వాల్‌ మాల్‌ (ఎస్‌బీఎం) ఎన్జీఓలు. 15 రోజులుగా మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన రోగులకు ప్రాణవాయువును అందిస్తూ వందలాది ప్రాణాలను కాపాడుతున్నారు.

కింగ్‌కోఠి ఆసుపత్రిలో..

గాంధీ, కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు.. 
15 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో 47 కేజీల సామర్థ్యం కలిగిన 15 సిలిండర్లను ఈ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నిత్యం గాంధీకి వచ్చే వందలాది కరోనా రోగులకు ఈ ఎమర్జెన్సీ ఆక్సిజన్‌ సిలిండర్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా కింగ్‌కోఠి ఆసుపత్రి, ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రుల్లో గత ఆదివారం 47 కేజీల సామర్థ్యం కలిగిన మూడు సిలిండర్‌లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటున్నాయి. మూడు ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ సిలిండర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. గాంధీలో ప్రతిరోజూ వందకు పైగా రోగులు లబ్ధి పొందుతుండగా, కేకేహెచ్, చెస్ట్‌ ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రిలో 30–40 మంది ఈ ఆక్సిజన్‌తో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. 

కరోనా బాధితుల్లో ఆక్సిజన్‌ అవసరమైన రోగులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని, అడ్మిషన్‌ సమయంలో ఆక్సిజన్‌ అందక ఎవరూ ఇబ్బంది పడకూడదన్నదే మా లక్ష్యం అంటున్నారు ఎస్‌డీఐఎఫ్‌ ఫౌండర్‌ ఆజంఖాన్, యాక్సెస్‌ ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హఫ్స, ఎస్‌బీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ అజర్‌. ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్స్‌ 15 చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆజంఖాన్‌ తెలిపారు. కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రుల్లో ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్స్‌ మూడు లేదా నాలుగు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్‌ హఫ్స తెలిపారు. మూడు ఆసుపత్రులకుగాను ప్రతి 24 గంటలకు వెయ్యి కేజీల ఆక్సిజన్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు అజర్‌ పేర్కొన్నారు. 

చదవండి: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్‌

ఊరట: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు..

మరిన్ని వార్తలు