ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్ల మోసం

25 Apr, 2021 07:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఎక్కడా సిలిండర్లు దొరకని పరిస్థితులు ఉండటంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. దీన్ని కూడా సైబర్‌ నేరగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ తరహాకు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. సిద్ధి అంబర్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌ శర్మ ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ మిషన్‌ ఖరీదు చేయాలని భావించారు.

విద్యుత్‌తో పని చేసే ఈ యంత్రం చుట్టూ గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను సమీకరించి రోగికి అందిస్తుంది. ఇది స్థానికంగా మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడంతో గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. అందులో నరీన ఆక్సిజన్‌ కాన్సట్రేటర్‌ పేరుతో ఓ సంస్థ వివరాలు కనిపించాయి. వారిని ఫోన్‌లో సంప్రదించగా... అవసరమైన యంత్రాలు పంపిస్తామంటూ రూ. 2.73 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేశారు. మరో ఉదంతంలో సికింద్రాబాద్‌ వాసి ఇలాంటి యంత్రం విక్రేతల వివరాలు చెప్పాలని తన స్నేహితుడిని కోరారు. ఆయన ద్వారా మరో స్నేహితుడి నంబర్‌ వచ్చింది. ఇలా మొత్తం ఆరుగురిని సంప్రదించారు.

ఆఖరి వ్యక్తి ఇండియా మార్ట్‌ వెబ్‌సైట్‌లో చూసి ఓ నంబర్‌ ఇచ్చారు. సికింద్రాబాద్‌ వ్యక్తి ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి రెండు యంత్రాలు కావాలని చెప్పారు. ఒక్కోటి రూ. 52,700 సరఫరా చేస్తానని చెప్పిన సైబర్‌ నేరగాడు రూ. 1,05,400 బదిలీ చేయించుకుని మోసం చేశారు. వీరిద్దరి ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ సంస్థలు మరిన్ని సోషల్‌ మీడియా, ఇంటర్‌నెట్‌ల్లో ఉన్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
చదవండి: ఢిల్లీలో ఆగని మృత్యుఘోష

మరిన్ని వార్తలు