Photo Feature: ఇదేం కరోనా ‘పరీక్ష’

17 May, 2021 11:01 IST|Sakshi

పరిగి: కిట్ల కొరతతో పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా తగ్గించారు. వారం క్రితం వరకు ఒక్కో ఆస్పత్రిలో 300కుపైగా పరీక్షలు చేయగా.. ప్రస్తుతం 40–50 మించి చేయట్లేదు. దీంతో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. పలువురు పరీక్ష కోసం ముందు  రోజు రాత్రే పడిగాపులు కాస్తున్నారు. రోజూ పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి 150– 200 మంది పరీక్షల కోసం వస్తుండగా 40 మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. అందుకు ఇవిగో నిదర్శనాలు..

రెండుసార్లు జాగారం
ఈ ఫొటోలో పడుకుని ఉన్న మహిళ పేరు మాణిబాయి (పరిగి మండలం నజీరాబాద్‌ తండా). వారం క్రితం రాత్రంతా పడిగాపులు కాసి.. తెల్లారి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడింది. నెగెటివ్‌ వస్తే పనులకు వెళ్లొచ్చనే భావనతో శనివారం రాత్రి 10 గంటలకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి టెస్ట్‌ కోసం వచ్చింది. ఎలాగో ఆదివారం మధ్యాహ్నానికి పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రావడంతో ఇంటికెళ్లింది.

ఎవరికి ‘చెప్పు’కోవాలి?
ఈమె బాలమ్మ. బొంరాస్‌పేట్‌ మండలం మైలారానికి చెందిన ఈమె నాలుగు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. బొంరాస్‌పేట్‌లో టెస్టులు చేయకపోవడంతో మూడ్రోజుల క్రితం పరిగి ఆస్పత్రికి వచ్చి చెప్పులు లైన్లో ఉంచింది. తెల్లారి చూస్తే చెప్పులు మాయం.. చేసేదిలేక వరుసగా రెండ్రోజుల పాటు రాత్రిళ్లు ఆస్పత్రి ముందే నిద్రించి.. ఉదయం ప్రయత్నించినా టోకెన్లు దొరకలేదు. శనివారం రాత్రి 9 గంటలకు మళ్లీ ఆస్పత్రికి వచ్చి రాత్రంతా జాగారం చేసింది.

పరిగి ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి చెప్పుల క్యూ
చదవండి: కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్‌ ఫంగసా?

మరిన్ని వార్తలు