నిమ్స్‌లో కోవాగ్జిన్‌ ఫేజ్‌–2 ట్రయల్స్‌ షురూ 

9 Sep, 2020 07:57 IST|Sakshi

మరో 15 మందికి టీకాలు

80 మంది వలంటీర్లకు స్క్రీనింగ్‌ పరీక్షలు 

సాక్షి, లక్టీకాపూల్‌: నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో కొనసాగుతున్న కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఫేజ్‌–2 టీకా ప్రయోగం మొదలైంది. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఫార్మాసూటికల్‌ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో నిమ్స్‌ ఆస్పత్రి కూడా ఒకటి కావడం విదితమే. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌–1ను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫేజ్‌–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఫేజ్‌–2 టీకాలు వేయడం ఆరంభించారు. నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె.మనోహర్‌ పర్యవేక్షణలో నోడల్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వీళ్లందరిని నాలుగు గంటల అబ్జర్వేషన్‌ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అదే విధంగా బుధవారం మరో 15 మందికి టీకా ప్రయోగం చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఈ ప్రక్రియ మూడు  రోజుల పాటు ఈ కొనసాగించేందుకు సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. కాగా ఈ టీకా ప్రయోగం ప్రక్రియలో భాగంగా ఆదివారం దాదాపుగా 80 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు