కరోనా : 50 శాతం తగ్గింది

21 Dec, 2020 01:00 IST|Sakshi

2.27 నుంచి 1.09 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గుదల

తెలంగాణలో 22 రోజుల్లో తగ్గిన కరోనా కేసులు

గత నెల 19న 39,448 పరీక్షలకు 894 కేసుల నమోదు

ఈ నెల 10వ తేదీన 56,178 పరీక్షలు చేస్తే 612 కేసులు

ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసులు పెరుగుతాయని భావించామని, పెరగకపోగా కేసులు తగ్గడం ఊరట కలిగిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర నివేదిక ఇచ్చింది. కేవలం 22 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు సగానికి తగ్గినట్లు తెలిపింది. ఆ నివేదిక ప్రకారం గత నెల 19వ తేదీన 39,448 మందికి కరోనా పరీక్షలు చేయగా, 894 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే కరోనా పాజిటివిటీ రేటు 2.27 శాతంగా ఉంది. ఇక ఈ నెల 10వ తేదీన 56,178 మందికి పరీక్షలు చేయగా, 612 మందికి కరోనా సోకింది. అంటే పాజిటివిటీ రేటు 1.09 శాతానికి పడిపోయిందని తెలిపింది. రోజువారీగా చేస్తున్న పరీక్షల సంఖ్య పెరిగినా.. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దేశంలోనూ కరోనా ఉధృతి తగ్గిందని, అదే ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

మొబైల్‌ టెస్టింగ్‌ అంతంతే: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వం 300 మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇవి అధిక ప్రమాదం ఉన్న మార్కెట్లు, రైతు బజార్లు, ఆటోస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తదితర ప్రాంతాలకు వెళ్లి కరోనా పరీక్షలు చేయాలి. కానీ అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని నివేదికలో స్పష్టం చేశారు. ప్రతీరోజూ 300 టెస్టింగ్‌ వాహనాలు అన్ని జిల్లాల్లో కలిపి 18,350 శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయాల్సి ఉండగా, కేవలం 1,950 మాత్రమే చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 28 మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలను ఏర్పాటు చేసి, రోజుకు 2,800 టెస్టులు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కానీ రోజుకు 100 మాత్రమే పరీక్షలు చేస్తున్నాయి.

ప్రైవేట్‌ ఆసుపత్రులపై 1,409 ఫిర్యాదులు
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులపై కరోనా చికిత్సకు సంబంధించి ఇప్పటివరకు 1,409 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిపై విచారణ చేయించారు. ఆసుపత్రులకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. మొత్తం వచ్చిన వాటిల్లో 277 ఫిర్యాదులు అధికంగా బిల్లు వేస్తున్నారని వచ్చాయి. వాటిని జిల్లాల వారీగా జాబితా తయారుచేసి విచారణ చేయించారు. మొత్తంగా 160 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. అయితే మొదట్లో రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ తర్వాత షోకాజ్‌ నోటీసులకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. ఒత్తిళ్లు రావడం వల్లే చర్యలు తీసుకోలేదని సమాచారం.

కేసులు అనూహ్యంగా తగ్గాయి: డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రజలు, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమైంది. వేగంగా కేసులను గుర్తించడం వల్ల అటువంటి వ్యక్తులు ఐసోలేషన్‌ అయ్యారు. దీంతో వైరస్‌ ఇతరులకు వ్యాపించలేదు. పైపెచ్చు అక్కడక్కడ పాక్షికంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల కూడా కేసులు తగ్గినట్లు భావిస్తున్నాం.
––––––––––––––––––––––––––––––––
తేదీ            పరీక్షలు         కేసులు    పాజిటివిటీ రేటు (శాతం)
––––––––––––––––––––––––––––––––
నవంబర్‌ 19        39,448        894        2.27
నవంబర్‌ 20        42,077        925        2.20
నవంబర్‌ 21        41,646        873        2.10
నవంబర్‌ 22        24,139        602        2.49
నవంబర్‌ 23        42,740        921        2.15
నవంబర్‌ 24        47,593        993        2.09
నవంబర్‌ 25        41,101        862        2.10
నవంబర్‌ 26        42,242        761        1.80
నవంబర్‌ 27        41,991        753        1.79
నవంబర్‌ 28        46,280        805        1.74
నవంబర్‌ 29        33,040        593        1.79
నవంబర్‌ 30        46,597        502        1.08
డిసెంబర్‌ 1        51,562        565        1.10
డిసెంబర్‌ 2        53,686        609        1.13
డిసెంబర్‌ 3        57,405        631        1.10
డిసెంబర్‌ 4        59,471        596        1
డిసెంబర్‌ 5        57,308        622        1.09
డిసెంబర్‌ 6        33,098        517        1.56
డిసెంబర్‌ 7        55,645        682        1.23
డిసెంబర్‌ 8        51,402        721        1.40
డిసెంబర్‌ 9        53,396        643        1.20
డిసెంబర్‌ 10    56,178        612        1.09
–––––––––––––––––––––––––––––––––– 

మరిన్ని వార్తలు