పెరుగుతున్న  కరోనా కేసులు..

2 Nov, 2020 03:01 IST|Sakshi

వారం కిందట ఖమ్మంలో రోజుకు 17... ఇప్పుడు 74

మిగిలిన జిల్లాలు, జీహెచ్‌ఎంసీలోనూ ఇదే పరిస్థితి

వెల్లడించిన వైద్య, ఆరోగ్యశాఖ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యానికి పండుగలు, చలికాలం తోడవడంతో వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత నెల 25న రాష్ట్రం మొత్తం 582 కేసులు నమోదవగా, 31నాటికి 1,416కు పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా పెరిగినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం గత నెల 25న జీహెచ్‌ఎంసీలో 174 కేసులుండగా 31న 279కి చేరాయి. ఇదే తేదీల్లో ఆదిలాబాద్‌లో 9 నుంచి 18కి, భద్రాద్రి కొత్తగూడెంలో 22 నుంచి 79కి, ఖమ్మంలో 17 నుంచి 74కు, జనగామలో 2 నుంచి 21కి, మేడ్చల్‌లో 38 నుంచి 112కు, రంగారెడ్డిలో 55 నుంచి 132, వరంగల్‌ అర్బన్‌లో 7 నుంచి 22కు పెరిగాయి. కామారెడ్డిలో 25న ఒక్క కేసు నమోదు కాకపోగా, 31న 24 నమోదయ్యాయి. ఇలాగే మిగిలిన జిల్లాల్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. దసరా సమయంలో తక్కువ కేసులు నమోదవగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. చలికాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 

2.40 లక్షలకు చేరిన కేసుల సంఖ్య...
రాష్ట్రంలో ఇప్పటివరకు 43,23,666 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,40,048 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా మహమ్మారి బారినపడి మరో ఐదుగురు చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. శనివారం ఒక్కరోజే 1,579 మంది కోలుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,20,466కు చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.84 శాతానికి పెరిగింది. మరణాల రేటు 0.55 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,241. ఇందులో ఇళ్లు, సంస్థల ఐసోలేషన్‌లో 15,388 మంది చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు