నెలాఖరుకు 1% తగ్గనున్న కరోనా!

8 Sep, 2020 04:14 IST|Sakshi

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిపై అస్కి అధ్యయనంలో వెల్లడి

ఆగస్టు నెలలో 6 శాతం మేర కోవిడ్‌ కేసుల నమోదు

ఈ నెలాఖరుకు అవి 5% వరకే నమోదయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఈ నెలాఖరుకు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (అస్కి) తాజా అధ్యయనంలో తేలింది. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు, రికవరీ, మరణాల రేటు నివేదికల ను పరిశీలించి శాస్త్రీయ అంచనాలను అస్కి వెల్లడించింది. ఈ నెలాఖరుకు రాష్ట్రంలో వంద కరోనా టెస్టులు చేస్తే అందులో ఐదుగురికి అంటే సుమారు 5 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. అదే ఆగస్టు చివరి నాటికి వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా సరాసరిన 6 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. అంటే ఈ నెలాఖరుకు ఒక్క శాతం మేర కోవిడ్‌ కేసులు తగ్గుతాయన్న మాట.. ఇక కరోనా రోగుల్లోనూ రోజువారీగా రికవరీ రేటు 70%గా నమోదయ్యే అవకాశాలున్నాయంది. వంద మంది కోవిడ్‌ రోగుల్లో డెత్‌ రేటు ఒక్క శాతం మాత్రమేనని వెల్లడించింది.

సెప్టెంబర్‌ 7న కోవిడ్‌ వ్యాప్తి ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా కోవిడ్‌ కేసుల వ్యాప్తి, రికవరీ రేటుపై వైద్య, ఆరోగ్య శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా అస్కి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 7న కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల నమోదు 6 శాతంగా నమోదైందని ఈ అధ్యయనం తేల్చిం ది. పాజిటివ్‌ రోగుల్లో రికవరీ రేటు 73 శాతంగా ఉందని తెలిపింది. కాగా ఈ ఏడాది నవంబర్‌ వరకు రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల వ్యాప్తిపై తాము రూపొందించిన శాస్త్రీయ అంచనాలను ప్రకటిస్తామని అస్కి నిపుణుడు డాక్టర్‌ సస్వత్‌ కుమార్‌ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ఇక సెప్టెంబర్‌ తొలివారంలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 

ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ: సెప్టెంబర్‌ తొలివారం నాటికి కోవిడ్‌ కేసు ల నమోదులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే అగ్రభాగాన నిలిచినట్లు అస్కి అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లో మొత్తం జనాభాలో 1.3% మంది, రంగారెడ్డి జిల్లాలో 1% మందికి వైరస్‌ సోకినట్లు తెలి పింది. తర్వాత స్థానాల్లో మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ములుగు జిల్లాలో అతి తక్కువ కేసులు నమోదైనట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు