గాలి, వెలుతురు కీలకం! 

31 Oct, 2020 01:36 IST|Sakshi

ఇవి తగినంత ఉంటే కరోనాకు చెక్‌ 

జర్మనీ హాలే యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి 

సాక్షి.హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్‌ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్‌–19’అధ్యయనంలో వెల్లడైంది.  

ఇదీ అధ్యయనం: గాలి ద్వారా ‘ఏరోసోల్స్‌’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్‌ మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు జనసమూహాలు ఉండే ప్రదే శాల్లోనూ కోవిడ్‌ మహమ్మారి నియంత్రణకు ఉపయోగపడతాయని వారు పేర్కొంటున్నారు.

చదవండి: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కమిటీలు

మరిన్ని వార్తలు