రంగారెడ్డిలో ఎక్కువ.. నారాయణపేటలో తక్కువ!

12 Oct, 2020 06:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. రంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. కరోనా పాజిటివిటీ రేటు ఏయే జిల్లాల్లో ఏ స్థాయిలో ఉందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను తాజాగా విడుదల చేసి ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం  పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల శాతం ఆధారంగా పాజిటివిటీ రేటును తయారుచేశారు. ఆ నివేదిక ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 % పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. అత్యంత తక్కువగా 3.4% నారాయణపేట జిల్లాలో ఉందని వెల్లడించింది. అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్న జీహెచ్‌ఎంసీలో మాత్రం పాజిటివిటీ రేటు 6.3 శాతముంది. అంటే పదో స్థానంలో జీహెచ్‌ఎంసీ నిలిచింది. రెండోస్థానంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో7%, మూడో స్థానంలో ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలో 6.7% పాజిటివిటీ రేటున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

ఐసీయూ పడకలకు అదే స్థాయిలో..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, అలాగే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల బోధనాస్పత్రుల్లో కరోనా కోసం ప్రభుత్వం 30,302 పడకలను కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది. అందులో ప్రభుత్వాస్పత్రుల్లో 8,868 పడకలు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 9,484 పడకలు, ప్రైవేట్‌ బోధనాస్పత్రుల్లో 11,950 పడకలు కరోనా కోసం కేటాయించినట్లు తెలిపింది. వాటిల్లో సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలున్నాయి. కరోనా వైరస్‌ కేసులు తగ్గకపోయినా ఆçస్పత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని నివేదిక తెలిపింది. ఐసో లేషన్, ఆక్సిజన్‌ పడకలకు జూలై నుంచి డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పడకల్లో జూలైలో ఐసోలేషన్‌ పడకలు 33.89% నిండిపోగా, అదే నెలలో ఆక్సిజన్‌ పడకలు 41.80%, ఐసీయూ పడక లు 15.14% నిండిపోయాయి.

ఆగస్టులో ఐసోలేషన్‌ పడకల ఆక్యుపెన్సీ 24.09 శాతానికి పడిపోగా, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 38.19 శాతానికి తగ్గింది. అయితే ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ మాత్రం 17.50 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో సాధారణ ఐసోలేషన్‌ వార్డుల్లో ఆక్యుపెన్సీ 12.95 శాతానికి పడిపోగా, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 27.33 శాతానికి తగ్గింది. ఐసీయూ పడకల్లో ఆక్యుపెన్సీ కాస్తంత పెరిగి 17.82 శాతానికి చేరుకుంది. అక్టోబర్‌లో అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఐసోలేషన్‌ పడకల ఆక్యుపెన్సీ 10.63 శాతానికి, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 24.37 శాతానికి పడిపోయాయి. ఐసీయూ పడకల్లోనూ ఆక్యుపెన్సీ కాస్తంత తగ్గి 16.96 శాతానికి చేరుకుంది. కరోనా మరణాల్లో 26వ స్థానం..దేశంలో తక్కువ కరోనా మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్య, ఆరోగ్యశాఖ ఆ నివేదికలో తెలిపింది.

జాతీయ స్థాయి సగటు మరణాల రేటు 1.50 శాతముంది. ఇక దేశంలో అత్యధిక కరోనా మరణాల రేటు పంజాబ్‌లో ఉంది. అక్కడ వైరస్‌ మరణాల రేటు 3.10 శాతముంది. ఆ తర్వాత రెండోస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో కరోనా మరణాల రేటు 2.60%, మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 2.40%, నాలుగో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్‌లో 1.90% ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ రకంగా తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. మిజోరాంలో మరణాల రేటు సున్నా ఉండగా, ఆ తర్వాత దాద్రానగర్‌ హవేలీలో 0.10% మరణాల రేటు ఉంది. కేరళలో 0.40% వైరస్‌ మరణాల రేటున్నట్లు నివేదిక తెలిపింది.
5,937 వైద్య పోస్టుల మంజూరు..కరోనాను నియంత్రించేందుకు రూ.1,369 కోట్లు మంజూరు చేసింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని భర్తీ చేసింది. అందుకోసం 5,937 వైద్య సిబ్బందిని భర్తీ చేసేందుకు జీవోలను జారీచేసినట్లు ఆ నివేదికలో ప్రస్తావించింది. 

మరిన్ని వార్తలు