టీకా ధీమాతో జాగ్రత్తలు హుష్‌!

29 Oct, 2020 02:17 IST|Sakshi

వ్యాక్సిన్‌ వస్తుందని రక్షణ చర్యలు గాలికి 

మాస్క్‌ మాయం..భౌతిక దూరం, శుభ్రతకు చెల్లు..    

రోగనిరోధక శక్తిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం 

నిపుణుల హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్, వ్యాక్సిన్‌.. కోవిడ్‌ను అంతం చేసే టీకా కోసం ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. సెపె్టంబర్, అక్టోబర్‌ నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని గత ఏప్రిల్‌ నుంచి కంపెనీలు పేర్కొంటూ వస్తున్నాయి. అందులో కాస్త ఆలస్యమైనా.. ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని ఆయా సంస్థలు బలంగా చెప్తున్నాయి. దీనికి తగినట్లు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఎలా పంపిణీ చేయాలి? అనే విషయంపై కసరత్తు కూడా చేస్తోంది. వెరసి.. ఇంకేంటి ఇక వ్యాక్సిన్‌ వచ్చినట్లే అనే ధీమా.. ప్రజల్లో కోవిడ్‌పై ఇంతకాలం ఉన్న భయాందోళనలను క్రమంగా దూరం చేస్తోంది. ఇదే వారిలో తీవ్ర నిర్లక్ష్యానికీ కారణమవుతోంది. కోవిడ్‌ భయం పూర్తిగా పోవడంతో అత్యవసరమైన మాస్కును కూడా దాదాపు పెట్టుకోవటం మానేశారు. 60 శాతం మంది మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరం.. చేతుల శుభ్రత సంగతి సరేసరి. ఈ తీరు అతిపెద్ద ప్రమాదకారి కాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కోవిడ్‌ రెండో వేవ్‌కు కారణమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం చలికాలం రాబోతుండడంతో వైరస్‌ మరింత విజృంభించే ప్రమాదముందంటున్నారు.  

రోగ నిరోధక శక్తే కీలకం
ప్రస్తుతం తుదిదశకి చేరిన వ్యాక్సిన్‌ ప్రయోగాలు సానుకూలంగానే ఉన్నాయని ఆయా కంపెనీలు అంటున్నా, వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్పలేం. గతంలో ఎప్పుడూ ఇంత వేగంగా వ్యాక్సిన్లు సిద్ధం కాలేదు. కోవిడ్‌ వైరస్‌ శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో నిరోధించే టీకా తయారవడం అంత సులభం కాదు. అందువల్ల టీకాపై ధీమాతో నిర్లక్ష్యంగా ఉండడం సరికాదు. వ్యాక్సిన్‌ వచ్చినా రోగనిరోధక శక్తిని సక్రమంగా ఉంచుకోవడమే అత్యంత కీలకం. ప్రస్తుతం చలికాలం ప్రవేశిస్తున్నందున మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనాతోపాటు దాడి చేసే ఇతర వైరస్‌లనూ దృష్టిలో ఉంచుకోవాలి. శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ స్థాయి పెంచుకోవాలి. న్యుమోనియాకు దారి తీయకుండా ఇది కాపాడుతుంది. వైరస్‌ చొచ్చుకుపోకుండా కాపాడుకోవాలి. నైట్రేట్స్‌ ఉండే పదార్థాలు తీసుకోవాలి. విటమిన్‌–డి చాలా అవసరం. ఎండ తక్కువగా ఉండే కాలం కాబట్టి విటమిన్‌–డి పెంపుపై దృష్టిసారించాలి. విటమిన్‌–డి శరీరంలో శోషణ కావాలంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం ఉండే పదార్థాలు తీసుకోవాలి.

మెగ్నీషియం, సెలీనియం ఇమ్యూనిటీని అవసరానికి తగినట్లు ఉంచడంలో తోడ్పడతాయి. జింక్‌ (రోజుకు 40 ఎంజీలోపు) కూడా శరీరానికి అందాలి. రోగ నిరోధకశక్తిలో కీలకంగా ఉండే ప్రొటీన్‌ ఇంటర్‌ల్యూకిన్‌–1బి, 6ను తగ్గించటంతోపాటు ఇంటర్‌ల్యూకిన్‌ 10ను పెంచేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఆకుకూరలు, మునగకాడలు, మునగాకు, షెల్‌తో ఉండే మాంసాహారంలో ఎక్కువగా ఉండే సెలీనియం బాగా ఉపయోగపడుతుంది. నైట్రేట్స్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల న్యుమోనియా, రక్తంలో గడ్డలు ఏర్పడకుండా, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జింక్‌ వల్ల రోగ నిరోధకశక్తి సమపాళ్లలో ఉంటుంది. సల్ఫర్‌ అధికంగా ఉండే పదార్థాల వల్ల గ్లూటాటయోన్‌ పెరిగి వైరస్‌ శరీరంలో విస్తరించకుండా ఉంటుంది. లివర్‌ బాగా పనిచేసేలా చేస్తుంది. వృద్ధుల్లో థైమస్‌ గ్రంథి కుచించుకుపోవడం వల్ల రోగనిరోధక శక్తి లోపిస్తుంది. అందువల్ల వీరు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. వీరు రోగనిరోధకశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.  

మరిన్ని వార్తలు