కరోనా: ఫీజు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తాం!

26 Mar, 2021 11:27 IST|Sakshi
విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులతో శృతి

ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం డిమాండ్‌

విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన 

సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్‌): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతకు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే విద్యార్థిని ఇంటికి పంపిస్తామని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం డిమాండ్‌ చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి గణేశ్‌-శ్రీదేవి దంపతుల కూతురు శృతి. జమ్మికుంట పట్టణంలోని న్యూమిలీనియం స్కూల్‌ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. పాఠశాలల వేసివేత నేపథ్యంలో తమ కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు గణేశ్‌–శ్రీదేవి దంపతులు బుధవారం స్కూల్‌కు వచ్చారు. అయితే ఫీజు రూ. 20 వేలు చెల్లిస్తేనే శృతిని ఇంటికి పంపిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇంటిదారి పట్టారు.

గురువారం మళ్లీ పాఠశాలకు రాగా, యాజమాన్యం అలాగే చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు బాధితులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై ప్రవీణ్‌రాజ్‌ పాఠశాల వద్దకు చేరుకుని ఇరువురితో మాట్లాడడంతో యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపిచేందుకు అంగీకరించింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు కారంకొండ శ్రావణ్‌కుమార్, శివకుమార్, కొల్లూరి ప్రశాంత్, కల్లపెళ్లి రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు