ఆగమాగమైన అమీర్‌పేట ఐటీ!

18 Dec, 2020 15:51 IST|Sakshi

నిర్మానుష్యంగా అమీర్‌పేట కోచింగ్‌ సెంటర్స్‌ 

ఐటీ శిక్షణ కేంద్రాలను నిండా ముంచేసిన కరోనా 

మూసివేత దిశగా 80 శాతం వరకు సంస్థలు 

50 వేల మంది ఉపాధిపై వేటు 

అమీర్‌పేట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచానికి తెలిసిన పేరు.. కుప్పలుతెప్పలుగా ఉండే కోచింగ్‌ సెంటర్లలో గుంపులుగా యువత.. ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతం కరపత్రాలతో నిండిపోతుంది. ఆకాశాన్ని మూసేలా పోటాపోటీ బ్యానర్లు.. ఎటు చూసినా ఆఫర్లమయం.. కాస్త ఆలోచించి శిక్షణ తీసుకొని కష్టపడితే చాలు ఫ్లైట్‌లో విదేశాలకు ఎగిరిపోవచ్చు.. పల్లెల్లో సైకిళ్లు ఎరుగని యువకులు సైతం పెద్ద కంపెనీల్లో కొలువులు చేస్తున్నారంటే అమీర్‌పేట పుణ్యమే.. ఎర్రబస్సు ఎరుగని పల్లె టు అమెరికా వయా అమీర్‌పేట అన్నా అతిశయోక్తి కాదేమో.. దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువులకు బాటలు ఇక్కడి నుంచే మొదలయ్యేవి. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను విద్యార్థులకు పండొలచినట్లు చెప్పి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దే సెంటర్లు కోకొల్లలు. ఏడాదికి ఐదు లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌కు పునాది అమీర్‌పేట. కరోనా కాటుకు ఇక్కడి ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి. -సనత్‌నగర్‌

ఆ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందంటే.. 
 కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ముందు ఐటీ విద్యార్థులతో అమీర్‌పేట అలరారింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కోచింగ్‌ సెంటర్లు తెరుచుకోలేదు.  

 ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. అకాడమీ ఇయర్‌ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపే అడుగులు వేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు వస్తారు.  

 ఇక్కడ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కలల జాబ్‌ను సంపాదించేందుకు ఇక్కడి కేంద్రాల్లో వాలిపోతుంటారు.  
 

 ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. 9 నెలలుగా విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. అప్పట్లో ఒక్క విద్యార్థి అమీర్‌పేట గడప తొక్కాడంటే.. అతడిని ఏదో రకంగా తమ కేంద్రంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది తొమ్మిది నెలలు పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఊహించుకోవచ్చు.  

 అమీర్‌పేట కేంద్రంగా 400–450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్‌లైన్‌’ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి.  

50వేల మంది ఉపాధిపై వేటు.. 
 అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసేవారు. ఆన్‌లైన్‌ శిక్షణ కొనసాగిస్తుండటంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

 టిఫిన్‌ సెంటర్లు, చాట్‌ భండార్‌లు, టీ స్టాల్స్‌.. ఇలా పదుల సంఖ్యలో చిరువ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బతికేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్‌ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్‌ లేకుండాపోయింది. ఇక హాస్టల్స్‌ పరిస్థితి అగమ్యగోచరం.  

టాలెంట్‌కే పెద్దపీట.. 
కరోనాకు ముందు ప్రతి 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా మోస్ట్‌ టాలెంటెడ్‌ వారికే అవకాశం కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభ సమయంలో చాలా ఐటీ కంపెనీలు కరోనా సాకుతో చాలామందిని ఇంటికి సాగనంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో టాలెంట్‌ కలిగిన ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ్రెషర్స్‌కు తక్కువ వేతనాలు ఇచ్చినా తమకు అనుకూలంగా ఉంటారన్న భావనతో ఉన్నట్లు సమాచారం. 

‘ఆన్‌లైన్‌’.. ఒక సవాలే.. 
పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధించినట్లు ఇక్కడ కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఓ ఫ్లాట్‌ఫాం. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాలి. ఫిజికల్‌ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్‌లైన్‌లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే.. అందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఆన్‌లైన్‌ సిమిలేటర్స్‌ సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం.  

కీలక సమయం కోల్పోయాం.. 
ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై మాసాలు అత్యంత కీలకం. కరోనా కారణంగా ఆ సమయాన్ని కోల్పోయాం. ఆన్‌లైన్‌ తరగతులను సీరియస్‌గా ఫాలో అయితే జాబ్‌ కొట్టొచ్చు. కరోనాతో కొంతమేర ఐటీ కంపెనీలు డీలా పడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులను పక్కకు తప్పించారు. ఇప్పుడు టాలెంట్‌ ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి.  – నరేష్, ఎండీ, నరేష్‌ టెక్నాలజీ  

400 మందికి ఉద్యోగాలు.. 
సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలపై కోవిడ్‌–19 కోలుకోని దెబ్బకొట్టింది. అమీర్‌పేట, కేపీహెచ్‌కాలనీ ప్రాంతాల్లో 80 శాతం వరకు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. విద్యార్థులకు స్కిల్స్‌ ఉంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా శిక్షణ పొందినా ఉద్యోగం గ్యారంటీ. తాము కోవిడ్‌లోనూ 400 మందికి ప్లేస్‌మెంట్‌ అందించాం. స్కిల్స్‌ ఉంటే ఇంటికే ల్యాప్‌టాప్‌ పంపించి పని చేయించుకుంటారు.  – దండు విశ్వనాథరాజు, సీఈఓ, వెక్టార్‌ ఇండియా   

మరిన్ని వార్తలు