‘టిఫిన్‌’ తినేదెట్లా?

4 Sep, 2020 08:49 IST|Sakshi

సిటీలో అల్పాహారం తినడం ఇక కష్టమే. ఇడ్లీ, దోసె, వడ, మైసూర్‌ బజ్జీ, పూరీ లాంటి టిఫిన్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొద్దిరోజులుగా మూతపడిన టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, రోడ్డు వెంబడి బండ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ ఐటమ్స్‌ రేట్లు మాత్రం విపరీతంగా పెంచేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: టిఫిన్‌ సెంటర్‌ లేదా హోటల్‌కు వెళ్లి ప్లేట్‌ ఇడ్లీ తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ ఆర్డర్‌ ఇచ్చే ముందు పర్స్‌ చెక్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఇంట్లో టిఫిన్‌ రెడీ చేయకపోతే టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి రూ.వంద ఇస్తే నలుగురికి సరిపడా టిఫిన్‌ వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్ని ధరలతో పాటు టిఫిన్‌ ఐటమ్స్‌ రేట్లూ పెరిగిపోయాయి. దీంతో చాలా మంది టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లో ఏది ఉంటే అది తినేందుకు సిద్ధపడుతున్నారు. కరోనా ప్రభావం గ్రేటర్‌లో కాస్త తగ్గుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ ప్రజలు ఇప్పడుడిప్పుడే బయటి ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో హోటల్‌ వ్యాపారం కాస్త పుంజుకుంటుంది. అయితే ధరలు మాత్రం విపరీతంగా పెంచారు. గత ఐదు నెలలుగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రోడ్‌ సైడ్‌ బండ్లు సైతం నడవక తీవ్ర నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు ప్రస్తుతం నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో అల్పాహారం రేట్లు పెంచాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.  

ఇడ్లీ, వడ, దోసె, పూరీ, మైసూర్‌ బోండా ధరలు గతం కంటే 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. స్పెషల్‌ టిఫిన్ల ధరలు ఇంకా భారీ స్థాయిలోనే పెరిగాయి. కరోనా సంక్షోభానికి ముందు ఇడ్లీ ప్లేట్‌ రూ.15 నుంచి రూ.20 ఉండగా, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర పెట్టాల్సి వస్తోంది. కొన్ని టిఫిన్‌ సెంటర్లలో ధర అంతగా పెంచకపోయినా, పరిమాణం మాత్రం బాగా తగ్గించారు. చిన్న టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండ్లపై ప్లేట్‌కు నాలుగు ఇడ్లీలు ఇస్తుండగా, పెద్ద టిఫిన్‌ సెంటర్లలో రెండు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కొన్ని టిఫిన్‌ సెంటర్లలో రూ.30 నుంచి రూ. 50 వరకు చేరుకుంది. స్పెషల్‌ సాంబార్‌ ఇడ్లీ రూ.50 నుంచి రూ.70 వరకు బిల్‌ వేస్తున్నారు. గతంలో రూ.20 ఉన్న సాదా దోసె ఇప్పుడు రూ.30కి పెరిగింది. మసాల దోసె, ఆనియన్‌ దోశ, ఆమ్లెట్, ఉప్మా దోసె రూ.50 నుంచి రూ.70 వరకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల స్పెషల్‌ దోశలకు రూ.100 కూడా ఇవ్వాల్సి వస్తోంది. మైసూరు బజ్జీ ప్లేట్‌ గతంలో రూ.25 ఉండగా, ఇప్పుడు కొన్ని చోట్ల రూ.50 వరకు తీసుకుంటున్నారు. ఇక వడ రూ.50 నుంచి రూ.60 పెడితే కాని తినలేని పరిస్థితి. పూరీ, చపాతీల ధరలూ పెరిగిపోయాయి. 

సరుకుల ధరలు పెరగడంతోనే...
కరోనా అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో టిఫిన్ల ధరలూ పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తరువాత నిత్యావసర సరుకుల ధరలు దాదాపు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ప్రస్తుతం కిలో మినపప్పు రూ.120 నుంచి రూ. 140, పల్లీలు రూ.100 నుంచి రూ.120, పుట్నాలు రూ.40 నుంచి రూ. 60, నువ్వులు కిలో రెండు వందలపైనే లభిస్తున్నాయి. ఇక వంటనూనెల ధరలు కూడా కిలోకు రూ.20 వరకు పెరిగాయి. సరుకుల ధరతో పాటు కూరగాయాల ధరలు కూడా పెరిగాయి. టమాట బెండకాయ, క్యాప్సికం, పందిరి బీర, క్యారెట్‌ తదితర కూరగాయల ధరలు మండుతున్నాయి. 

సిబ్బంది జీతాల భారం 
కరోనాతో చాలా మంది పనివాళ్లు ఊళ్లకు వెళ్లారు. దీంతో లేబర్‌ సమస్య కూడా ఏర్పడింది. టిఫిన్‌ సెంటర్లలో మాస్టర్లు, ఇతర సిబ్బంది జీతాలు కూడా పెరిగాయి. గతంలో మాస్టర్‌ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పనిచేస్తే రూ.300 నుంచి రూ.600 వరకు చెల్లించే వారు. ఇప్పుడు రూ.600 నుంచి రూ. వెయ్యి ఇస్తే కానీ మాస్టర్లు దొరకడం లేదు. ఇతర సిబ్బంది జీతాలు కూడా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయాయి.  

మరిన్ని వార్తలు