Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు!

12 Jun, 2021 08:13 IST|Sakshi

ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీల వారికే టీకాలు 

ఆ వర్గాల్లో లేని వారు ప్రైవేటుకు.. 

ప్రస్తుతం పంపిణీ అవుతున్న టీకాల్లో 30శాతం దాకా ప్రైవేటులోనే.. 

ఇప్పటివరకు నగదు చెల్లించి టీకా వేసుకున్నవారు 13.27 లక్షలు 

ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పొందినవారు 60.71 లక్షలు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకాల పంపిణీ జోరు పెరిగింది. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌  తీసుకోవడమే మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తుండటం, కొద్దినెలల్లో కరోనా మూడోవేవ్‌ రావొచ్చనే అంచనాల నేపథ్యంలో.. టీకాలకు డిమాండ్‌ పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్‌  సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం ప్రైవేటు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ (పీసీవీసీ)లను ఆశ్రయిస్తున్నారు. ఇవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నా.. రద్దీ విపరీతంగా ఉంటోంది. 

656 ప్రభుత్వ.. 29 ప్రైవేటు కేంద్రాలు 
రాష్ట్రంలో 656 ప్రభుత్వ కేంద్రాలు, 29 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, హెల్త్‌ కేర్‌ వర్కర్లతో పాటు హైరిస్క్‌ కేటగిరీలో ఉన్న వారికి, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల పంపిణీ ఉచితం కాగా.. ప్రైవేటు కేంద్రాల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. 

ప్రైవేటులో రోజూ 2 వేల మందికిపైనే.. 
రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రైవేటు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రోజుకు సగటున 2వేల మందికిపైనే టీకాలు ఇస్తున్నారు. గురువారం ఒక్కరోజే 29 ప్రైవేటు కేంద్రాల్లో 57,922 మందికి టీకాలు వేశారు. అదే 656 ప్రభుత్వ కేంద్రాల్లో 1,23,020 మందికి ఇచ్చారు. ఈ లెక్కన ప్రభుత్వకేంద్రాల్లో రోజుకు సగటున 2 వందల కంటే తక్కువ మందికి టీకాలు ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటివరకు 73,99,241 టీకాలు ఇవ్వగా.. ఇందులో ప్రభుత్వకేంద్రాల్లో ఇచ్చినవి 60,71,872, ప్రైవేటు కేంద్రాల్లో ఫీజులు చెల్లించి తీసుకున్నవి 13,27,369 డోసులు కావడం గమనార్హం. 

ఆన్‌ లైన్‌  రిజిస్ట్రేషన్‌  ఆగింది! 
కొవిన్‌ యాప్‌ ద్వారా ముందస్తు ఆన్‌ లైన్‌  రిజిస్ట్రేషన్‌  ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్‌  చేసుకున్నా.. వ్యాక్సిన్‌  కేంద్రం సమాచారం, స్లాట్‌ బుకింగ్‌ ఆప్షన్లు కనిపించడమే లేదు. ప్రైవేటు కేంద్రాల వివరాలు కూడా ఉండటం లేదు. దీనితో ముందస్తు ఆన్‌ లైన్‌  రిజిస్ట్రేషన్‌ పై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టడం లేదు. ప్రైవేటు కేంద్రాల వద్ద అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసి టీకా ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతోపాటు సర్వీసు చార్జీ కింద మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

► ప్రైవేటు వ్యాక్సినేషన్‌  కేంద్రాల్లో వారం రోజుల నుంచి టీకాల పంపిణీ జోరు పెరిగింది. అంతకుముందు రోజూ పది వేల వరకు టీకాలు పంపిణీ చేయగా.. ప్రస్తుతం రోజూ 50–60 వేల వరకు ఇస్తున్నారు. 

► ప్రభుత్వ టీకా కేంద్రాల్లో హైరిస్క్, ఫ్రంట్‌ లైన్‌ కేటగిరీలు, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ కేటగిరీల్లో లేని 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు. 

► సగటున ఒక్కో ప్రైవేటు సెంటర్‌లో రోజూ 2 వేల మందికిపైనే వ్యాక్సిన్లు తీసుకుంటుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో రోజుకు సగటున 
2 వందల మందికే వేస్తున్నారు. 

► ప్రైవేటు కేంద్రాల్లో టీకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువగా తీసుకుంటున్నారని.. సర్వీస్, ఇతర చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. 

అవగాహన  పెరగడంతోనే.. 
ప్రజల్లో వ్యాక్సిన్‌ అవగాహన పెరిగింది. టీకాల కోసం ఎక్కువమంది ముందుకొస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొన్ని కేటగిరీల్లోని వారికే టీకాలు వేస్తుండటంతో.. ప్రైవేటుకు వచ్చే వారి సంఖ్య కొద్దిరోజులుగా పెరిగింది. మేం టీకా కేంద్రానికి వచ్చిన వారికే కాకుండా కార్పొరేట్‌ ఆస్పత్రులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు కోరితే.. ఆయా చోట్ల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా టీకాలు పంపిణీ చేస్తున్నాం.  –సి.భార్గవ ప్రసాద్, జనరల్‌ మేనేజర్, సిటీన్యూరో సెంటర్‌ 
చదవండి: కోవిడ్‌ తీవ్రతకు ఆ డీఎన్‌ఏకు లంకె

మరిన్ని వార్తలు