నేటి నుంచి కరోనా టీకా

16 Jan, 2021 03:41 IST|Sakshi

3.15 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా 

తొలిరోజు రాష్ట్రంలో  140 కేంద్రాల్లో

సాక్షి, హైదరాబాద్:‌ కరోనాకు చరమగీతం పాడే రోజు రానేవచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కోవిడ్‌ టీకాలను నేటి(శనివారం) నుంచి వేయనున్నారు. చరిత్రాత్మక టీకా కార్యక్రమ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యాక్సినేషన్‌లో 50 వేలమంది సిబ్బంది పాల్గొంటారు. వ్యాక్సిన్‌ వేసేందుకు 10 వేలమంది వైద్యసిబ్బందికి ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1,213 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిరోజు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4,200 మందికి టీకా వేయనున్నారు.

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నార్సింగ్‌లోని రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లో టీకా వేసుకున్నవారితో వర్చువల్‌ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడతారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. మిగిలిన టీకా కేంద్రాల్లో ప్రధానమంత్రి ప్రసంగం చూసేలా ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల్లో తొలి టీకా పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, నాలుగో తరగతి వైద్యసిబ్బందికి వేస్తారు. సోమవారం నుంచి ప్రతి కేంద్రంలో 50 మందికి చొప్పున వేస్తారు. దాన్ని విడతలవారీగా వంద వరకు వేసేలా ఏర్పాట్లు చేస్తారు. 

మొదటగా 3.15 లక్షల మంది వైద్యసిబ్బందికి టీకా ఇచ్చేలా ప్రణాళిక రచించారు. వీరికే రెండు, మూడు వారాల సమయం తీసుకునే అవకాశం ఉంది. వారానికి 4 రోజులే కరోనా టీకా వేస్తారు. అంటే సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే టీకా వేస్తారు. బుధ, శనివారాల్లో ఇతర టీకాలు వేస్తారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కరోనా టీకా వేయబోమని అధికారులు తేల్చిచెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య టీకాలు వేస్తారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాక్సిన్‌ సెంటర్‌కు 3.84 లక్షల టీకాలు చేరుకున్నాయి. అందులో 3.64 లక్షలు కోవిషీల్డ్, 20 వేలు కోవాగ్జిన్‌ టీకాలు ఉన్నాయి.

4,200మందికి.. టీకా కేంద్రాలకు తీసుకొచ్చేలా...
కరోనా లబ్ధిదారులను టీకా కేంద్రాలకు తీసుకొచ్చేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో చిన్న, చిన్న ఇబ్బందులుంటే ఆఫ్‌లైన్‌లో కూడా రికార్డుల్లో సమాచారం నమోదు చేయనున్నారు. మొదటి రోజు టీకా వేయించుకునేవారిలో 50 శాతం మంది పారిశుధ్య కార్మికులు, 20 శాతం మంది డాక్టర్లు, మిగిలిన 30 శాతం మంది ఇతర వైద్యసిబ్బంది ఉంటారు. టీకా వేయించుకోవడం స్వచ్ఛందమేనని అధికారులు తెలిపారు. అయితే టీకా వేయించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనంపై అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశారు. టీకాపై అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు పంపించారు. అన్ని టీకా కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. లబ్ధిదారులను టీకా కేంద్రాలకు రప్పించడంలో ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.  

57 ఆసుపత్రుల్లో ఐసీయూలు 
సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే వాటిని ఎదుర్కొనేలా రాష్ట్రస్థాయిలో నోడల్‌ ఆఫీసర్లను నియమించారు. వారు ఐదారు జిల్లాలకు ఒకరు చొప్పున ఉంటారు. మొత్తం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకవ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రియాక్షన్‌ వచ్చినయెడల అవసరమైతే తరలించేందుకు 57 ప్రభుత్వ ఆసుపత్రులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. సీరియస్‌ కేసులైతే ఒక్కో ఆసుపత్రిలో 5 నుంచి 10 వరకు ఐసీయూలను సిద్ధంగా ఉంచారు. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి టీకా వేయబోవడంలేదని అధికారులు తేల్చిచెప్పారు. వారికి 14 రోజులు గడిచిన తర్వాత టీకా వేస్తారు. పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే టీకాలు వేస్తారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు