Coronavirus: చిన్న పిల్లల్లో ఎంఐఎస్‌-సీ లక్షణాలు

26 May, 2021 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఫస్ట్‌ వేవ్‌ కన్నా ఈసారి కాస్త ఎక్కువ సంఖ్యలో చిన్నారులు, టీనేజ్‌ పిల్లలు కోవిడ్‌ బారినపడ్డారు. లక్షణాలేమీ లేకుండాగానీ, స్వల్ప లక్షణాలతోగానీ పాజిటివ్‌ వచ్చిన వారంతా సులువుగానే కోలుకుంటున్నారు. కానీ ఇలా కోలుకున్న తర్వాత కొందరు పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటిలో ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ – మిస్క్‌ (ఎంఐఎస్‌–సీ)’ ఒకటి.

చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి కాస్త ప్రమాదకరమేనని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బయటపడొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం అంతర్గతంగా అవయవాలను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గాక.. శరీరంలో భారీగా యాంటీబాడీస్‌ ఉత్పత్తి కావడం, వాటి పరిమాణంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండటం, ఇమ్యూన్‌ రెగ్యులేషన్స్‌ సరిగా లేకపోవడం వంటివాటి వల్ల పిల్లల్లో మిస్క్‌ సమస్య కనిపిస్తోందని వివరిస్తున్నారు. 

కొద్దిరోజులుగా పెరుగుతున్న కేసులు 
మిస్క్‌ కేసులు కరోనా తొలివేవ్‌ సమయంలోనే బ్రిటన్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ తదితర దేశాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు మన దేశంలోనూ పెరుగుతున్నాయి. మొదట తమిళనాడులోని చెన్నై కంచి కామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న 98 మంది పిల్లల్లో 40 మందిలో మిస్క్‌ లక్షణాలు కనిపించినట్టు వైద్యులు ప్రకటించారు. తర్వాత మదురైలో 25 కేసులను, కోయంబత్తూర్‌లోని పీఎస్జీ ఆస్పత్రిలో 30 కేసులను గుర్తించారు. హైదరాబాద్‌లో కూడా పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. 

బయటపడకుండానే.. 
చిన్నారులకు మిస్క్‌ వ్యాధి వచ్చినా గుర్తించడంలో ఇబ్బందులు ఉంటున్నాయి. ఇది చాలా అరుదైన వ్యాధి కావడం, కోవిడ్‌ బారినపడుతున్న చిన్నారుల సంఖ్య తక్కువగా ఉంటుండటం, పిల్లలకు వైరస్‌ సోకినా లక్షణాలు లేకపోతుండటంతో.. ఆ తర్వాత మిస్క్‌ సమస్య తలెత్తినా గమనించలేకపోతున్నారు. పిల్లల్లో తల, కాళ్లు, చేతుల వాపు వంటివి వచ్చినా సాధారణ సమస్యలేనని భావించి.. మామూలు చికిత్సలు తీసుకుంటున్నారు. 

కోవిడ్‌ ఉన్నప్పుడు కూడా ప్రభావం 
సాధారణంగా వ్యాధి తగ్గాక ఏర్పడే ఇమ్యూనిటీని యాంటీబాడీస్‌ అని.. వ్యాధి కొనసాగుతున్నప్పుడు ఉండే ఇమ్యూనిటీని యాంటీజెన్స్‌ అని పేర్కొంటారు. యాంటీ బాడీస్, యాంటీ జెన్స్‌ రెండూ మిస్క్‌కి కారణం కావచ్చని వైద్యులు చెప్తున్నారు. అంటే కోవిడ్‌ పాజిటివ్‌గా ఉన్నప్పుడు కూడా మిస్క్‌ సమస్య రావొచ్చని పేర్కొంటున్నారు. అయితే పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఎలాగూ జాగ్రత్తగా ఉంటారు, చికిత్స తీసుకుంటారు కాబట్టి గమనించడం సులభమని.. అదే కోలుకున్నాక పెద్దగా పట్టించుకోకపోవడంతో మిస్క్‌ ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 19 ఏళ్లలోపు వయసు ఉన్న వారిలో ఎవరిలోనైనా రావొచ్చు. ఇది బయటినుంచి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ల తరహాలో సోకేది కాదు.. శరీరంలోనే అంతర్గతంగా రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడే గందరగోళంతో తలెత్తే సమస్య. అధిక జ్వరం వచ్చి 3 రోజులు దాటినా తగ్గకపోవడం, పిల్లలు బాగా చిరాకుగా ఉండటం, కాళ్లలో వాపు, ముఖం ఉబ్బడం, కళ్లు ఎర్ర బారడం, పొట్టలో ఇబ్బందులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె, బ్రెయిన్, ఊపిరితిత్తులు.. తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆస్పత్రిలో చేర్చాల్సిందే.. 
యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన పిల్లల్లో మిస్క్‌ సమస్య గమనిస్తున్నాం. వ్యాధి నిరోధక వ్యవస్థలో ఏర్పడే గందరగోళం దీనికి కారణం. గతంలో కోవిడ్‌ వచ్చిందా? అని మేం అడిగితే.. కొందరు రాలేదని చెబుతున్నారు. కోవిడ్‌ రాకుండా దానికి సంబంధించిన యాంటీబాడీస్‌ వృద్ధి చెందవు. కోవిడ్‌తో సంబంధం లేకుండా రోజుల తరబడి అధిక జ్వరం, కాళ్ల వాపు వంటివి ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి.

ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవడం సరికాదు. సరైన సమయంలో గుర్తించకున్నా, సరైన చికిత్స తీసుకోకున్నా అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మిస్క్‌ సమస్యతో వచ్చిన వారికి మొదట కిడ్నీ, లివర్, గుండె పనితీరును పరీక్షిస్తాం. అప్పటికే అవయవాలు దెబ్బతినడం ప్రారంభమైతే క్రిటికల్‌ కేర్‌ అవసరమవుతుంది. 
– డాక్టర్‌ అపర్ణ, పీడియాట్రీషియన్, కేర్‌ హాస్పిటల్స్‌ 

రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి
కోవిడ్‌ సోకి తగ్గిన చిన్నారుల్లో మిస్క్‌ సమస్య తలెత్తుతోంది. గత ఏడాది 700 మంది చిన్నారులు కోవిడ్‌ బారినపడగా.. అందులో 58 మందిలో మిస్క్‌ సమస్య కనిపించింది. ఒకరిద్దరు మినహా అంతా సులువుగా కోలుకున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌లోనూ కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో 6 నుంచి 8 వారాల్లో మిస్క్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు కోవిడ్‌ తగ్గిన పిల్లలను రెండు, మూడు నెలలు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.

తీవ్రమైన కడుపునొప్పి, కాళ్లు, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, వాంతులు, 8 రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉండటం, నాలుక గులాబీ రంగులోకి మారడం, వేళ్ల సందులు, చేతి కింద నుంచి పొట్టులా రాలడం, ఒంటిపై దద్దుర్లు, ఆహారం సరిగా తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు కన్పిస్తే మిస్క్‌గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా మంది తల్లిదండ్రులు తమకు కోవిడ్‌ పాజిటివ్‌ రాగానే పిల్లలను ఇతర కుటుంబ సభ్యుల వద్దకు పంపేస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులకు వైరస్‌ ఉంటే.. పిల్లలకు ఉన్నట్లే భావించాలి. ఈ మేరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప ఇతరుల వద్దకు పంపడం వల్ల మిస్క్‌ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. 
– డాక్టర్‌ రాజవర్ధన్, పిల్లల వైద్య నిపుణుడు  
చదవండి: Coronavirus: కిడ్నీ రోగులు జాగ్రత్త..!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు