అదనంగా 8,000 ఆక్సిజన్‌ బెడ్స్‌

28 Sep, 2020 04:18 IST|Sakshi

ఆరు నెలల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కరోనా వచ్చాక ప్రభుత్వ వైద్యం బలోపేతం 

5,209 మంది వైద్య సిబ్బంది భర్తీ... అందులో డాక్టర్లు 1,899 

1,259 వెంటిలేటర్లు... 200 హై ఫ్లో నాసల్‌ ఆక్సిజన్‌ పరికరాలు 

కోవిడ్‌ చికిత్సకు ఇప్పటిదాకా రూ. 912 కోట్లు మంజూరు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా ఆగమేఘాల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి వచ్చింది. వైరస్‌ వచ్చి ఆరు నెలలు గడిచింది. ఈ కాలంలో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న లక్ష మందికి వైద్యం అందించే వెసులుబాటు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. మార్చి నుంచి ఆగస్టు మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 8 వేల పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఆక్సిజన్‌ పడకల సంఖ్య రాష్ట్రంలో 10,010కి చేరింది. అంటే వైరస్‌ వచ్చాకే 80 శాతం ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఏళ్లుగా అందుబాటులోకి రాని వైద్య వసతులెన్నో కరోనా కారణంగా సమకూరినట్లు వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఎటువంటి వైరస్‌ మున్ముందు దాడి చేసినా తక్షణమే అప్రమత్తం అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సమకూరిన మౌలిక సదుపాయాలపై వైద్య, ఆరోగ్యశాఖ ఒక సమగ్ర నివేదికను సర్కారుకు నివేదించింది.  

పెరిగిన టెస్టింగ్‌ సామర్థ్యం 
కరోనా ప్రారంభ దశలో పరీక్షల కోసం పుణేలోని వైరాలజీ లేబొరేటరీకి రోడ్డు మార్గంలో నమూనాలను పంపాల్సి వచ్చింది. తర్వాత గాంధీ మెడికల్‌ కాలేజీలో మొదటి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 ప్రభుత్వ ఆర్‌టీ పీసీఆర్‌ లేబొరేటరీలు పనిచేస్తున్నాయి. మరో 6 ల్యాబ్‌లు త్వరలో ప్రారంభమవుతాయి. నిమ్స్‌లో రోజుకు 4వేల టెస్ట్‌లు చేసే లేబొరేటరీని విదేశాల నుంచి కొనుగోలు చేశారు. అలాగే ప్రైవేట్‌లో 43 ఆర్‌టీపీసీఆర్‌ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ఆర్‌టీపీసీఆర్‌ లేబొరేటరీల పరీక్షల సామర్థ్యం రోజుకు 20,771. ఇక పీహెచ్‌సీలు మొదలు పైస్థాయి వరకు 1,076 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ స్థాయి వరకు టెస్టింగ్‌ చేసే సామర్థ్యం ఏర్పడింది.  

యుద్ధప్రాతిపదికన ‘టిమ్స్‌’ 
గాంధీ ఆసుపత్రిని ప్రత్యేకమైన కోవిడ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. అలాగే కొత్తగా కోవిడ్‌ చికిత్స కోసం తక్కువ సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. టిమ్స్‌లో మొత్తం 1,224 పడకలున్నాయి. అందులో 980 ఆక్సిజన్‌ పడకలు, 50 ఐసీయూ పడకలున్నాయి. అలాగే 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం 8,840 పడకలు ఏర్పాటు చేశారు. ఇక 225 ప్రైవేట్‌ ఆసుపత్రులలో కోవిడ్‌ చికిత్సకు 9,454 పడకలను సిద్ధంచేశారు. ప్రస్తుతం లక్ష యాక్టివ్‌ కేసులు వచ్చినా చికిత్స చేసే సదుపాయం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది.  

అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు ఇవే... 

  • ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరునెలల్లో కొత్తగా 8 వేల ఆక్సిజన్‌ పడకల ఏర్పాటు.  
  • 100 పడకలకు మించి ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లిక్విడ్‌ ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతరాయంగా ఆక్సిజన్‌ను వాడుకోవచ్చు.  
  • కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా 5,209 వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేశారు. అందులో డాక్టర్లు 1,899, నర్సులు 2,125, పారామెడికల్, సహాయక సిబ్బంది 1,185 మంది ఉన్నారు.  
  • తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా కోసం ప్రత్యేకంగా రూ. 912 కోట్లు మంజూరు చేసింది.  
  • 1,259 వెంటిలేటర్లు ఏర్పాటు. 200 హై ఫ్లో నాసల్‌ ఆక్సిజన్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.  
  • 27,264 పల్స్‌ ఆక్సీమీటర్లు, 13,570 ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్లను సమకూర్చారు. 
  • ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు కొత్తగా 40 బస్తీ దవాఖానాల ఏర్పాటు. ఇక బస్తీ దవాఖానాల్లో గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఓపీ 6.2 లక్షలు కాగా, ఈ ఏడాది అదే కాలంలో 12 లక్షల ఓపీ రోగులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.   
మరిన్ని వార్తలు